My title

పెహ్లూ హత్య కేసులో ఆరుగురికి విముక్తి

గత ఏప్రిల్ ఒకటవ తేదీన పాడి పరిశ్రమ నడుపుతున్న పెహ్లూ ఖాన్ హత్య కేసులో నిందితులైన ఆరుగురు నిర్దోషులని రాజస్థాన్ పోలీసులు తేల్చారు. వీరి మీద దర్యాప్తు నిలిపి వేశారు. పెహ్లూ ఖాన్ మరణించే ముందు ఈ ఆరుగురు తన మీద దాడి చేసినట్టు చెప్పారు. దర్యాప్తు నిలిపి వేయడం గో సంరక్షణ పేర మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చే వారిని కాపాడే ప్రయత్నంలో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పోలీసులు నిర్దోషులని తేల్చిన ఆరుగురిలో ముగ్గురు హిందుత్వ సంస్థలతో సంబంధం ఉన్న వారు. పోలీసులు విముక్తం చేసిన ఆరుగురు రథ్ గోశాలలో పని చేస్తారు. వారి వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్లలో ఉన్న సమాచారం ఆధారంగా వారు నిర్దోషులని పోలీసులు తేల్చారు. ఈ ఆరుగురు పెహ్లూ ఖాన్ మీద దాడి జరిగిన సమయంలో దాడి జరిగిన చోటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రథ్ గోశాలలో ఉన్నారని ఆ గోశాల సిబ్బంది చెప్పడంవల్ల వారిని ఈ కేసు నుంచి విముక్తం చేశారు. ఓం యాదవ్, హుకుం చంద్ యాదవ్, సుధీర్ యాదవ్, జగ్మల్ యాదవ్, నవీన్ శర్మ, రాహుల్ సాయ్ని అనే ఆరుగురిని ముందు పెహ్లూ హత్య కేసులో నిందితులుగా చేర్చారు.

“పోలీసులతో సహా సాక్షుల వాంగ్మూలాలు, రథ్ గోశాల సిబ్బంది వాగ్మూలాల ఆధారంగా ఈ ఆరుగురు దాడి జరిగిన ప్రాంతంలో లేరు. ఈ ఆరుగురి ఫోన్ల లో నిక్షిప్త సమాచారం ప్రకారం కూడా వారు సంఘటనా స్థలంలో లేరు” అని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

ఈ కేసులో మరో తొమ్మిది మంది నిందుతులుగా ఉన్నారు. వారిలో ఇద్దరు ఈడు రాని వాళ్లు.

పెహ్లూ ఖాన్ జై పూర్ సంతలో ఆవులు కొని హర్యానాలోని తన స్వగ్రామం నూహ్ కు తీసుకెళ్తుండగా ఒక మూక దాడి చేసింది. ఖాన్ ఆ తర్వాత రెండు రోజులకు దెబ్బలకు తాళ లేక మరణించాడు. గోవులను తరలించడానికి అతని దగ్గర అవసరమైన పత్రాలు ఉన్నాయి.

ఆరుగురిని పోలీసులు నిర్దోషులుగా తేల్చినందుకు పెహ్లూ ఖాన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసినప్పుడు నిందితులు ఒకరినొకరు పేరు పెట్టి పిలవడం తాము విన్నామని వారు చెప్తున్నారు.

“ఈ ఆరుగురు దాడి చేసినప్పుడు మేం అక్కడే ఉన్నాం. మా మీద దాడి చేస్తున్నప్పుడు ఒకరినొకరు పేరు పెట్టి పిలవడం విన్నాం. ఓక వ్యక్తి ‘హుకుం వాళ్లను కిందికి లాగు. వాహనాన్ని ధ్వంసం చేయి’ అనడం విన్నాం” అని పెహ్లూ ఖాన్ తండ్రి ఇర్షాద్ అన్నారు. “ఓం, హుకుం, సుధీర్, రాహుల్ అని పిలవడం నేను విన్నాను” అని ఆయన చెప్పారు.

“పోలీసులు ఒత్తిడికి లొంగి పోయి ఇప్పుడు ఇలా చెప్తున్నారు. న్యాయం కోసం మా పోరాటం ఆగదు. ఆ ఆరుగురు దోషులు అని తేలేదాకా విశ్రమించం” అని ఇర్షాద్ తెలియజేశారు.

విచిత్రం ఏమిటంటే పెహ్లూ ఖాన్ మరణ వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రికార్డ్ చేయకుండా పోలీసు అధికారి నమోదు చేశారు. కాని మరణ వాంగ్మూలం ఎవరు రికార్డు చేసినా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుంది.

“మరణ వాంగ్మూలాన్ని దర్యాప్తు దశలో పోలీసులు తోసిపుచ్చ లేరు. మరణ వాంగ్మూలం సాక్ష్యంగా పనికొస్తుందన్నది చట్టం ప్రకారం చెల్లుతుంది. పోలీసులు నమోదు చేసిన రికార్డు ఆధారంగా కూడా న్యాయస్థానాలు శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి” అని రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది వినయ్ పాల్ యాదవ్ అన్నారు.

దాడి జరిగిన నాలుగు గంటల తర్వాత బెహ్రోర్ లోని కైలాశ్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ విభాగం లో పెహ్లూ ఖాన్ వాంగ్మూలం ఇచ్చారు. పోలీసులు ఇప్పుడు నిర్దోషులు అంటున్న వారి మీద, గుర్తు తెలియని మరో 200 మంది మీద ఎఫ్.ఐ.ఆర్. దాఖలైంది. రెండు రోజుల తర్వాత పెహ్లూఖాన్ మరణించాడు.

మరో తొమ్మిది మంది మీద కేసు కొనసాగుతుంది. దాడి జరిగిన సమయంలో తీసిన వీడియో సామాజిక మాద్యమాల నుంచి తీసుకుని ఈ తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా అరెస్టు చేసిన తర్వాత చార్జిషీట్ దాఖలు చేస్తామని ఆల్వార్ పోలీసు విభాగం అధిపతి రాహుల్ ప్రకాశ్ చెప్పారు.