My title

నంద్యాలలో పవన్ సొంత లెక్క…

నంద్యాల ఉప ఎన్నికలో జనసేన నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని వారం రోజుల క్రితం చెప్పిన పవన్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. స్పందిస్తారన్న నమ్మకమూ సన్నగిల్లుతోంది. టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న పవన్ కల్యాణ్‌ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి మద్దతు ప్రకటించేందుకు ఎందుకు ఇంతగా ఆలోచన చేస్తున్నారన్నది చాలా మంది ప్రశ్న. అయితే నంద్యాలపై పవన్ మౌనం వెనుక ఆయన లెక్క ఆయనకుందని చెబుతున్నారు.

తన బలాన్ని 2019 ఎన్నికలకు ముందే ప్రదర్శిస్తే అసలు బలమెంతో తెలిసిపోయి సాధారణ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందిగా మారుతుందన్న ఆలోచన పవన్‌లో ఉందని చెబుతున్నారు. అందుకే పవన్‌ ఫలితాన్ని తారుమారు చేయగలరు అన్న ప్రచారాన్ని సజీవంగా ఉంచేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు.

ఒక వేళ నంద్యాలలో టీడీపీకి మద్దతు ఇస్తే అక్కడ ఆ పార్టీ ఓడిపోతే… దాని ప్రభావం తనపైనా తీవ్రంగా ఉంటుందని పవన్ ఆలోచన. తాను మద్దతు ఇచ్చిన తర్వాత కూడా నంద్యాలలో టీడీపీ ఓడిపోతే పవన్‌ బలం ఉత్త బుస్సేనని అర్థమైపోతుంది. అందుకే ఆయన నంద్యాలలో టీడీపీకి మద్దతు తెలిపే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. తాను లేస్తే మనిషిని కాదన్న ధోరణిలోనే 2019 ఎన్నికల వరకు ప్రయాణం సాగించాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.