My title

సారథి స్టుడియోస్ లో పవన్ హంగామా

పవన్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మధ్యలో వీకెండ్స్ మినహాయిస్తే.. లాంగ్ గ్యాప్ అనేది లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొన్నటివరకు రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యూల్ జరిగింది. ఆ తర్వాత షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోస్ కు షిఫ్ట్ అయింది. అక్కడ మరో లాంగ్ షెడ్యూల్ నడిచింది. తాజాగా యూనిట్ అంతా సారథి స్టుడియోస్ కు మారింది.

పవన్-త్రివిక్రమ్ సినిమా కోసం సారధి స్టుడియోస్ లో ఓ పెద్ద ఇరానీ కేఫ్ సెట్ వేశారు. ఆ సెట్ లో పవన్ పై ఓ భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. పవన్ సినిమాల్లో ఫైట్స్ అన్నీ స్టయిలిష్ గా ఉంటాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో కూడా అలాంటిదే ఓ కొత్త తరహా ఫైట్ పెట్టారు. విదేశీ స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆ ఫైట్ ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖుష్బూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని అనుకుంటున్నారు. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.