My title

తమిళ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్లేనా?

త‌మిళ‌నాడులో గ‌త కొన్ని నెల‌లుగా నెల‌కొన్న రాజ‌కీయ సందిగ్ధ ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే తొల‌గిపోనున్నాయ‌నే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ముఖ్యంగా అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి విడిపోయిన ప‌న్నీర్ వ‌ర్గం.. త్వ‌ర‌లోనే సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామితో చేతులు క‌లుపుతుంద‌ని, త‌న వ‌ర్గాన్ని ఎడ‌ప్పాడి వ‌ర్గంలో విలీనం చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక‌, ఎడ‌ప్పాడి కూడా ప‌న్నీర్ విష‌యంలో ప‌ట్టువిడుపుల ధోర‌ణినే ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ప‌న్నీర్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చేందుకు ఎడ‌ప్పాడి సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇదే జ‌రిగితే.. ఆ రాష్ట్రంలో గ‌త కొన్నాళ్లుగా నెల‌కొన్న ప‌రిస్థితులు స‌ర్దుబాటు అవుతాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఇదిలావుంటే, పార్టీలో త‌న ఆధిప‌త్యానికి తిరుగులేద‌ని చెబుతూ.. ఎడ‌ప్పాడికి, ప‌న్నీర్‌కు షాక్ ఇవ్వాల‌ని చూస్తున్న దిన‌క‌ర‌న్‌కు ఇరువురు నేత‌లూ ముకుతాడు వేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌గ్గాలు ప‌న్నీర్‌కి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. పన్నీర్‌కు ఉప ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వడానికి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అమ్మ వర్గం అంగీకరించినట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి తీహార్‌ జైలుకు వెళ్లిన దినకరన్‌ బెయిలుపై వచ్చాక దూకుడు పెంచారు. జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళతో తొలిసారి సమావేశమైన అనంతరం తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రెండోసారి భేటీ తర్వాత 122 మంది ఎమ్మెల్యేలూ తనవైపే ఉన్నారని ప్రకటించి పళనిస్వామికి హెచ్చరికలు పంపారు.

దీంతో.. ప‌ళ‌నిస్వామి.. ఎలాగైనా దిన‌క‌ర‌న్‌ను వ‌దిలించుకోవాల‌ని నిర్ణ‌యించే ఇప్పుడు ప‌న్నీర్‌తో స‌యోధ్య చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. మ‌రోప‌క్క‌, కేంద్రం నుంచి కూడా రెండు వ‌ర్గాల‌పైనా ఒత్తిడి పెరిగింది. ఇరు వ‌ర్గాలూ క‌లిసిపోవాల‌ని, స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించాల‌ని కేంద్రం సూచించింది. లేకుంటే తామే రంగం లోకి దిగి ఏదో ఒక వ‌ర్గాన్ని త‌మ‌లో క‌లిపేసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో త‌మిళ‌నాట రాజ‌కీయం యూట‌ర్న్ తీసుకుంది. పన్నీర్‌సెల్వం డిమాండ్లను అంగీకరించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వడానికి ఎడ‌ప్పాడి సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.