My title

ఏపీలో ముందస్తు ఎన్నికలు… చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దేశంమొత్తం ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రధాని మోడీ పావులు కదుపుతున్న నేపథ్యంలో… చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఎన్నికల ప్రస్తావన తెచ్చారు.

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలతో చెప్పారు. కాబట్టి ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ప్రతి నెల ఎక్కడికక్కడ బహిరంగసభలతో హోరెత్తించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారానికి నాంది పలకాలని చెప్పారు. జిల్లాల్లో ప్రతినెల బహిరంగసభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా క్యాడర్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న ఓటు బ్యాంకుతో పాటు మిగిలిన వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలన్నారు.

ఇకపై తాను కూడా పార్టీ వ్యవహారాలపై ఎక్కువ సమయం కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల తర్వాత పార్టీ వ్యవహారాలపైనే సమీక్ష జరుపుతానని చెప్పారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు మోడీ నిర్ణయించుకున్నారని… ఈ నిర్ణయానికి చంద్రబాబు, కేసీఆర్‌ కూడా మద్దతు తెలిపారని కొద్దిరోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ముందస్తు ఎన్నికల కారణంగానే కేసీఆర్‌ కూడా ఇటీవల వరుసగా జనాకర్షక పథకాలు చేపట్టారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని మొదలుపెట్టారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై ఇటీవల స్పందించిన చంద్రబాబు… మొత్తం ఎన్నికలు ఓకేసారి జరుగుతాయని చెప్పారు.