My title

అమెరికాపై దాడి ఇంత భయంకరంగా ఉంటుందట..

ఏ క్షణానైనా ఉత్తర కొరియామీద యుద్ధం ప్రకటించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. కొరియా తీరం వెంబడి అమెరికా యుద్ధనౌకలు తిష్టవేసి ఉన్నాయి. ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం కావచ్చునని చైనా ఆందోళన చెందుతోంది. ట్రంప్ దుందుడుకు స్వభావం వల్ల ఆయన ఎలాంటి నిర్ణయమైన తీసుకొనే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో తాజాగా తాము దాడి చేస్తే అమెరికా తట్టుకోలేదంటూ ఉత్తరకొరియా ఒక వీడియోను రూపొందించింది. వరుసగా తాము క్షిపణి దాడులు చేస్తే అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్‌-2 సంగ్ గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వీడియోను ప్రదర్శించి అమెరికాకు సవాల్ చేసింది ఉత్తరకొరియా.

వీడియోలో ఏముందంటే.. ‘పసిఫిక్‌ సముద్రం మీదుగా అమెరికాపై వరుసపెట్టి ఉత్తరకొరియా క్షిపణులతో దాడి చేస్తుంది. ఆ తర్వాత ఓ పెద్ద బాంబును అమెరికాపై విసురుతుంది. దీంతో అగ్రరాజ్య నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమవుతాయి. చివరగా.. అమెరికా జెండా కాలిపోయినట్లుగా ఉంటూ దానిపై శవపేటిక ఆకారం కనిపించడంతో వీడియో ముగుస్తుంది. వీడియో ప్రదర్శన అయిపోగానే.. ఉత్తరకొరియా మిలిటరీ అధికారులు కరతాళ ధ్వనులు మోగించారు. అది చూసిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆనందంతో అభివాదం చేశారు.

అమెరికాపై ఉ.కొరియా ఇలాంటి హెచ్చరిక‌లకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అమెరికాను నాశనం చేసినట్లుగా ఉన్న వీడియోలను ఉ.కొరియా రూపొందించిన సందర్భాలున్నాయి. 2016లో లాస్ట్‌ ఛాన్స్‌ పేరుతో విడుదల చేసిన వీడియోలో వాషింగ్టన్‌పై అణుదాడి చేసినట్లుగా చూపించారు. ఇక, 2013లో కొలంబియా, కాలిఫోర్నియా, హవాయి తదితర రాష్ట్రాలపై అణుదాడులు చేస్తున్న వీడియో విడుదల చేశారు.