My title

నంద్యాల టీడీపీలో కొత్త లొల్లి

నంద్యాల ఒక స‌మ‌స్య పోతే మ‌రో స‌మ‌స్య టీడీపీ వెంటాడుతోంది. ఉపఎన్నిక వేళ కొత్త కొత్త వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పోటాపోటీగా జ‌రుగుతున్న ఈ చేరిక‌ల‌తో పార్టీలో కొత్త లొల్లి మొద‌లైంది. మొద‌టి నుంచి పార్టీలో ఉన్న త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా కొత్త వారిని చేర్చుకోవ‌డంపై త‌మ్ముళ్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. నేష‌న‌ల్ కాలేజీ అధినేత ఇంతియాజ్ అహ్మ‌ద్‌ను చేర్చుకోవ‌డంపై కొంద‌రు అలిగిన‌ట్లు తెలుస్తోంది. క‌నీసం త‌న‌ను సంప్ర‌దించకుండా పార్టీలో తీసుకోవ‌డంపై రామ‌కృష్ణ విద్యాసంస్థ‌ల అధినేత రామ‌కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది. దీంతో ఆయ‌న బుధ‌వారం ప్ర‌చారానికి దూరంగా ఉన్నారు.

ఇంతియాజ్‌తో మొదటి నుంచి ఈయ‌న‌కు ప‌డ‌దు. దీంతో రామ‌కృష్ణారెడ్డిని బుజ్జ‌గించేందుకు మంత్రి అఖిల‌ప్రియ ప్ర‌యత్నించారు. అయితే ఆయ‌న స‌సేమిరా అన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఏవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దింపేందుకు పార్టీ ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న రాయ‌బారానికి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డలేదు. ఆయ‌న కూడా కొన్నిరోజులుగా తీవ్ర అసంతృప్తితో పార్టీ వ్య‌వ‌హారాలు పట్టించుకోవ‌డం లేదు. స్థానిక ప‌రిస్థితులు తెలియ‌క‌పోవడంతో మంత్రి అఖిల‌ప్రియ‌కు మైన‌స్‌గా మారింది. పార్టీలో మొద‌టి నుంచి ఎవ‌రున్నారో వారిని ప‌ట్టించుకోకుండా కొత్త‌వారికి పార్టీలో చేర్చుకోవ‌డంపై తీవ్ర‌మైన నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పోలింగ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డేస‌రికి త‌మ్ముళ్ల నిర్ణ‌యం ఏవిధంగా ఉంటుందోన‌ని తీవ్ర‌మైన చ‌ర్చ నంద్యాల‌లో న‌డుస్తోంది. కొంద‌రు పార్టీకి గుడ్‌బై చెప్పే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.