My title

హెచ్ఐవీకి మందు వచ్చేసినట్లే

హెచ్‌ఐవి పులిరాజాని భ‌య‌పెట్టిందో లేదో కానీ స‌ర్వ మాన‌వాళినీ భ‌య‌ కంపితుల్ని చేసింది. ముంద‌స్తు హెచ్చ‌రిక లేకుండా వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసి దేహాన్ని ఆసాంతం క‌బ‌ళించే ఈ రోగానికి ఇక భూమ్మీద నూక‌లు చెల్ల‌నున్నాయి. నిజ‌మే! హెచ్ఐవిని న‌యం చేయ‌డానికి మందులు క‌నిపెట్ట‌డం, ఆ వ్యాధిని అస‌లు రానివ్వ‌కుండా నివారించ‌డానికి మందులు క‌నిపెట్ట‌డంలో ప‌రిశోధ‌కులు అకుంఠిత దీక్ష‌తో ద‌శాబ్దాల పాటు ప‌రిశోధ‌న‌లు చేశారు. అవి తుది ఫ‌లితాల ద‌శ‌కు చేరుకున్నాయి కూడా . ఆ ఫ‌లితాలు అంద‌డానికి ఇంకా ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సిన ప‌ని లేదు. నెల‌ల్లోనే హెచ్ఐవి ని నివారించే యాంటీబాడీస్ వ్యాక్సిన్లు రూపంలో అందుబాటులోకి రానున్నాయి.

అమెరికాలోని హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్‌, మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఇత‌ర ప‌రిశోధ‌న సంస్థ‌లు సంయుక్తంగా నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల ఫ‌లితంగా ఈ మందు రూపొందింది. దీనిని కోతుల మీద ప్ర‌యోగించి 99 శాతం ఫ‌లితాల‌ను సాధించారు. మ‌నుషుల్లో ఇంకా ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని ప‌రిశోధ‌కులు తెలియ‌చేస్తున్నారు.

హెచ్ఐవీ వైరస్ ఒక మొండి వైరస్. దాని మౌలిక స్వరూపం ఒకలా ఉండదు. కొన్ని కోట్ల రకాలుగా ఉంటుంది. ఇన్ని కోట్ల రకాల హెచ్ఐవీ వైరస్ లను నిర్మూలించగల కామన్ మందును శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా తయారుచేయలేకపోయారు. దానికి కారణం ఇప్పటివరకు కనిపెట్టిన ఒక్కోరకమైన హెచ్ఐవీ నిరోధక మందు ఒక్కోరకమైన హెచ్ఐవీ వైరస్ ను నిర్మూలిస్తున్నది. కానీ మిగిలిన రకాల హెచ్ఐవీ వైరస్ ల మీద ఆ మందులు పనిచేయడం లేదు.

ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు తయారుచేసింది మూడురకాల యాంటీబాడీస్ తో కూడుకున్న సరికొత్త మందు. ఈ యాంటీ బాడీస్ అన్నిరకాల హెచ్ఐవీ వైరస్ లను అడ్డుకోవడంలో 99 శాతం విజయం సాధించాయి. దాంతో ఇక ఈ మందు హెచ్ఐవీ నిర్మూలనకు అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఒకటి రెండు సంవత్సరాలలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.