My title

‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ రివ్యూ

రివ్యూ: నేనే రాజు నేనే మంత్రి

రేటింగ్‌:   2/5

తారాగణం: రానా దగ్గుబాటి, కాజల్‌ అగర్వాల్‌, క్యాథరిన్ త్రెస్సా, నవదీప్‌, శివాజీ రాజా, అశుతోష్‌ రానా తదిత‌రులు

సంగీతం:   అనూప్‌ రూబెన్స్

నిర్మాత:   డి. సురేష్‌ బాబు, కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి

దర్శకత్వం: తేజ

అనగనగా జోగేంద్ర(రానా) అనే వడ్డీ వ్యాపారి. డబ్బు విషయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పుగా ఇస్తూ ఉంటాడు. తనకు భార్య రాధా(కాజల్)అంటే పంచ ప్రాణాలు. ఒకసారి ఊళ్ళో ఉన్న గుడిలో సర్పంచ్ భార్య చేసిన దాష్టికం వల్ల రాధా ప్రమాదానికి గురై శాశ్వతంగా గర్భం పోగొట్టుకుంటుంది. దాంతో కోపం వచ్చిన జోగేంద్ర సర్పంచ్ ని చంపి తాను సర్పంచ్ అవుతాడు. అంతటితో ఆగక మినిస్టర్ లెవెల్ కి చేరుకుంటాడు. ఇక బాలన్స్ ఎందుకని సిఎం కూడా కావాలి అనుకుంటాడు. దాని కోసం చేయకూడని పనులన్నీ చేయాల్సి వస్తుంది. అన్నీ రాధా కోసమే అని చెప్పి అడ్డమైన వాటికి ఆమె పేరును వాడుకుంటూ పోతాడు. చివరికి ఆ రాధా పోతే కాని జనానికి సిఎం పదవి జోగేంద్రకు ఇవ్వాలి అనే జ్ఞానోదయం రాదు. ఇంకేముంది తన ప్రత్యర్థులను బాంబు దాడిలో చంపేసిన జోగేంద్ర ను సిఎం చేయాలనీ, జైలు ముందు కోరస్ పాడుతూ జేజేలు కొడతారు. మరి జోగేంద్ర సిఎం అయ్యాడా లేక ఉరికంబం ఎక్కాడా అనేది ఈ సినిమా కథ….

కథగా చదివితే ఇది కన్విన్సింగ్ గా అనిపించవచ్చు కాని దర్శకుడు తేజ మాత్రం తెరపై దీన్ని చాలా సిల్లీగా చూపించాడు. చంపుతూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయి అనే పాయింట్ మీద కథను నడిపిన తేజ ఆ తర్వాత మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పి పాత కాలంలోకి మనల్ని తీసుకువెళ్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఫార్ములా రాజకీయ నేపధ్యం కలిగిన సన్నివేశాలను తీసుకుని కథగా రాసుకోవడం చూస్తే నవ్వు రాక మానదు. మూడు వేల కోట్ల అధిపతి అయిన టీవీ ఛానల్ ఓనర్, సెకండ్ హీరొయిన్ పాత్ర జోగేంద్ర చొక్కా విప్పగానే అతని ఒళ్లో పడిపోయి సర్వం సమర్పించుకుని అతని వెనకాల పడుతుంది. ఒక ఎమెల్యేని అతని ఇంట్లోనే చంపితే ఎటువంటి విచారణ లేకుండా, అతనికే పార్టీ టికెట్ రావడం అతను సులభంగా గెలవడం చకచక జరిగిపోతాయి. ఒక చిన్న ఊరికి ఎమెల్యే వచ్చి హోం మినిస్టర్ కి సిల్లీ ఆఫర్ ఇస్తే దాన్ని అతగాడు గుడ్డిగా నమ్మేసి చెప్పినట్టు చేస్తాడు. ఇలాంటి అర్థం లేని లాజిక్స్ ఈ సినిమాలో బోలేడు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించడానికి ప్రధాన కారణం తనకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని తేజ ఎంత దుర్వినియోగం చేసాడో చెప్పడానికే.

రానా తన కెరీర్ మరో బెస్ట్ మైల్ స్టోన్ అందుకున్నాడు. ఎక్కడా నిరాశ పరచడు. బాహుబలి కంటే మంచి నటన ఇందులో కనిపిస్తుంది. భార్య మీద ప్రేమతో ఎంత దూరమైనా వెళ్లి ఎవరినైనా చంపే పాత్రలో రానాను తప్ప ఇంకెవరినీ ఊహించలేం.అంత బాగా చేసాడు. కాజల్ అతని పక్కన బెస్ట్ జోడి అనిపించింది. తన పాత్ర అర్ధాంతరంగా ముగిసినా దాదాపు సినిమా మొత్తం ఉన్న ఫీలింగ్ వస్తుంది. విలన్ గా అశుతోష్ రానా పరమ రొటీన్ పాత్రలో కనిపిస్తే, నెగటివ్ షేడ్స్ ఉన్న టీవీ ఛానల్ ఓనర్ గా క్యాథరిన్ త్రెస్సా తన లుక్స్ తో ఔట్ ఫిట్ తో కంటికి ఇంపుగా ఉంది. జయప్రకాశ్ రెడ్డి, శివాజీ రాజా, బిత్తిరి సత్తి, ప్రభాస్ శీను, జోష్ రవి ఇలా ఇంకా చాలానే ఉన్నారు కాని సినిమా మొత్తం జోగేంద్ర, రాధా, దేవికా రాణి, హోం మినిస్టర్ పాత్రలే ఎక్కువ కనిపిస్తాయి.

నేనే రాజు నేనే మంత్రి తేజ గర్వంగా చెప్పుకునే సినిమా అయితే కాదు. కాని గత పదేళ్ళుగా మరీ తీసికట్టు సినిమాలు తీస్తున్న అతను కాస్త నిద్ర లేచినట్టే అనిపిస్తుంది ఈ సినిమాతో. కాని మంచి స్కోప్ ఉన్న కథను చేతులారా చెడగొట్టి అంచనాలు అందుకోవడంలో మాత్రం విఫలం అయ్యాడు తేజ. అనూప్ రూబెన్స్ సంగీతం, లక్ష్మి భూపాల మాటలు చాలా వరకు సినిమాను కాపాడాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. కాని వాటిని బలహీనమైన కథనం నీరు గార్చాడు తేజ. ఊరికే సినిమా నిండా ట్విస్ట్ లు పెట్టుకుంటూ పోయి ఇవేవి ప్రేక్షకుడి ఊహకు అందవు కాబట్టి సినిమా నచ్చుతుంది అనే తప్పుడు భావనలో సినిమా తీసిన తేజ అందుకు తగ్గ మూల్యమే చెల్లించాడు. రానా కాకుండా ఇంకే హీరోతో చేసినా ఇది రిస్కీ ప్రాజెక్ట్ అయ్యేది. అయినా రాయలసీమలో ఒక చిన్న ఊరిలో పెత్తనం చెలాయించే జోగేంద్ర అనే నాయకుడు రాష్ట్రం మొత్తం దేవుడిలా కొలిచే రేంజ్ కి వెళ్ళడం అనే జర్నీని చాలా సిల్లీ గా చూపించాడు తేజ. అది కొంచెం కూడా కన్విన్సింగ్ గా లేకపోవడంతో మంచి క్లైమాక్స్ వృధాగా పోయింది. రానా హీరో అయితే తేజ నే సినిమాకు విలన్ గా మారాడు. కాని ఒక్క విషయం మాత్రం సంతోషం కలిగిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ అని నమ్మి లాస్ట్ వీక్  నక్షత్రం వెళ్తే పగలే చుక్కలు చూపించినంత దారుణంగా ఈ క్రియేటివ్ దర్శకుడి మూవీ లేకపోవడం కొంతలో కొంత ఊరట.

Also Read: