My title

లోకేష్‌పై మరీ ఎక్కువగా ఈకలు పీకుతున్నారా?

ఎన్నో ఒత్తిళ్లను, విమర్శలను కూడా ఖాతరు చేయకుండా తన కుమారుడు లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వెంటనే మంత్రిని చేసేశారు చంద్రబాబు. అయితే మంత్రి అయిన లోకేష్‌ పరిణతి సాధించే క్రమంలో పదేపదే తడబడుతున్నారు. ఒకటి చెప్పబోయి అందుకు పూర్తి వ్యతిరేకంగా మరొకటి చెప్పి విమర్శలపాలవుతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో నారా లోకేష్‌పై విపరీతంగా జోకులు పేలుతున్నాయి. అయితే లోకేష్‌ను విమర్శించే క్రమంలో ఒక వర్గం మీడియా, కొందరు నెటిజన్లు మరీ అత్యుత్సాహం చూపుతున్నట్టుగా అనిపిస్తోంది.

తాజాగా లోకేష్‌ వ్యాఖ్యలపై ఒక మీడియా సంస్థ చేసిన హడావుడి చూస్తే అలాగే ఉంది. అనంతపురం జిల్లాలో జరిగిన సభలో ప్రసంగించిన నారా లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో 225 స్థానాలకు 200 సీట్లు గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు, బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు పెరుగుతుందని చెబుతున్నారు. దాన్ని ఆధారంగా చేసుకునే నారా లోకేష్ 225 స్థానాలకు 200 సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు.

కానీ ఒక మీడియా సంస్థ మాత్రం లోకేష్ నోరు జారారని, ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియదా అని పదేపదే కథనాలు ప్రసారం చేస్తోంది. ఇలా విమర్శించడం అత్యుత్సాహమే. సీట్ల సంఖ్య పెంపును దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఆ వ్యాఖ్యలు చేశారు. దాన్ని కూడా విమర్శించడం అంటే జనంలో చులకన అవడం తప్ప మరొకటి కాదు.  కొందరు వైసీపీ అభిమాన నెటిజన్ల అత్యుత్సాహం వల్ల కూడా మొదటికే మోసం వస్తోందన్న భావన వ్యక్తమవుతోంది.

పలు చోట్ల ఇళ్లు కట్టుకోవడం, పార్క్‌ హయత్‌ హోటల్‌లో చంద్రబాబు కుటుంబం కాపురం పెట్టడం, వందల కోట్ల ప్రజాధనాన్ని తన సౌకర్యాల కోసం చంద్రబాబు వృథా చేస్తున్న మాట నిజమే. ఇటీవల హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలు పోసి అత్యంత విలాసవంతమైన భవంతిని చంద్రబాబు కట్టుకున్న మాట నిజమే. ఆ ఇంటిని ఎవరికీ చూపించకుండా చంద్రబాబు దాచుకుంటున్న మాట వాస్తవమే. అయితే కొందరు నెటిజన్లు చంద్రబాబు ఇంటిపై విమర్శలు చేసే క్రమంలో ఏకంగా… దుబాయ్‌లోకి భవంతులు, ముకేష్ అంబానీ ఇంటిలోకి దృశ్యాలను తెచ్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

చంద్రబాబు ఇంటిలోని దృశ్యాలు ఇలా ఉంటాయని ప్రచారం చేశారు. అయితే తీరా లోతుగా ఆరా తీయగా అవన్నీ ఫేక్ ఫోటోలని తేలిపోయింది. దీంతో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు క్రెడిబులిటీనే దెబ్బతినే పరిస్థితి. చంద్రబాబు ఇంటిపై నిజాలు చెప్పినా జనం నమ్మలేని పరిస్థితిని తప్పుడు ఫోటోలతో ప్రచారం ద్వారా కొందరు సృష్టించారు.

గతంలో జగన్‌పైనా టీడీపీ నేతలు ఇదే తరహాలో ప్రచారం చేశారని.. కాబట్టి మేం కూడా అలాగే ప్రచారం చేస్తామని కొందరు సమర్ధించుకోవచ్చు. కానీ తిమ్మరిబమ్మిరి చేసి నమ్మించేందుకు చంద్రబాబు వెంట 12 టీవీ చానళ్లు, రెండు పత్రికలు ఉన్నాయి. కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్నది కేవలం ఒక మీడియా సంస్థే. అది కూడా తన క్రెడిబులిటీని పోగొట్టుకునేలా వ్యవహరిస్తే భవిష్యత్తులో నిజాలు చెప్పినా జనం నమ్మే పరిస్థితి ఉండదు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించే క్రమంలో కొందరు గాలిపోగేయడం మరీ ఎక్కువైనట్టుగానే ఉంది. ఇది వైసీపీ వారికే నష్టం.