My title

దేశానికి అహ్మదాబాద్ రాజధానా?

మ‌న దేశ‌పు రాజ‌ధాని ఏది అంటే ఢిల్లీ అని బ‌డికి వెళ్లే బాలుడు కూడా ఠ‌క్కున చెబుతాడు.. దేశానికి ఆర్థిక రాజ‌ధాని ఏది అంటే ముంబై అంటూ త‌డుముకోకుండా చెప్పేస్తారు… అయితే భార‌త దేశానికి రాజ‌ధాని ఏది అంటే అహ్మ‌దాబాద్ అని ప్ర‌ధాని మోదీ చెబుతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. ఆ సెటైర్ల వెన‌క ఢిల్లీని రిటైర్డ్ హ‌ర్ట్ చేసిన క‌థ ఉంది. దేశ‌పు కేపిట‌ల్‌కు కేపిట‌ల్ ప‌నిష్‌మెంట్ ఇస్తున్న‌వ్య‌థ ఉంది.

సాధార‌ణంగా దేశానికి ఏ విదేశీ అధ్య‌క్షుడు వ‌చ్చినా, విదేశీ ప్ర‌ధాని వ‌చ్చినా ఢిల్లీలో దిగుతారు… రెడ్‌కార్పెట్ రాచమ‌ర్యాద‌లు అందుకుని ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తితో చ‌ర్చ‌లు జ‌రుపుతారు… వ్యాపారంతో పాటు ఇత‌ర సంబంధాల‌ను కూడా ప‌టిష్టం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు… చిన్న‌దేశాల నుంచి వ‌చ్చిన నేత‌ల‌కు కేంద్ర‌మంత్రులు, అధికారులు స్వాగ‌తం ప‌లుకుతారు.. మ‌రీ పెద్ద దేశాల అధినేత‌లైతే స్వ‌యంగా రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని వెళ్లి వెల్‌క‌మ్ టు ఇండియా అంటారు.

అయితే ఇప్పుడు దీనికి రివ‌ర్స్‌లో జ‌రుగుతోంది… విదేశాల నుంచి వ‌చ్చే అధ్య‌క్షులు, ప్ర‌ధానులు ఢిల్లీ రూటు మ‌ర్చిపోయిన‌ట్టున్నారు… అంద‌రు గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ల్యాండ‌వుతున్నారు… ప్ర‌ధాని మోదీ కూడా అక్క‌డికే వెళ్లి వాళ్ల‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం అంటున్నారు…. తాజాగా ఇండియా వ‌చ్చిన జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబేకు అహ్మ‌దాబాద్‌లో స్వాగ‌తం ప‌లికారు మోదీ… సైనిక వంద‌నం ముగిశాక ప‌దాతి ద‌ళాలు ముందు న‌డుస్తుండ‌గా భారత న‌రేంద్రుడు, జ‌పాన్ దేవేంద్రుడు అహ్మ‌దాబాద్ ర‌హ‌దారుల‌పై రోడ్ షో నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు క‌నుల‌పండ‌గ చేశారు… ఆ త‌ర్వాత షింజో అబేను స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి, సిద్దీ స‌యీద్ మసీదుకు తోడ్కొని వెళ్లారు మోదీ… ఆసియాలోనే రెండు దిగ్గ‌జాలు చైనా, జ‌పాన్.. ఈ రెండు దేశాల అధినేత‌ల‌కు అహ్మ‌దాబాద్‌లోనే ఆతిథ్యం ఇచ్చారు మోదీ. గ‌తంలో భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌ని కూడా ఏకంగా అహ్మ‌దాబాద్‌లో దించి రెడ్‌కార్పెట్ ప‌రిచారు మోదీ.

మోదీ తీరు చూసి మేధావుల‌తో పాటు జ‌నం కూడా విస్తుపోతున్నారు… దేశ రాజ‌ధానిగా ఉండ‌డంతో పాటు పరిపాల‌న‌కు, పార్ల‌మెంటుకు, రాష్ట్ర‌ప‌తికి, దేశం కోసం స‌ర్వం ఒడ్డే సైన్యానికి.. ఇలా అన్నింటికి కేంద్ర‌బిందువు ఢిల్లీ… తాజా ప‌రిణామాల‌తో త‌న‌ను ప‌క్క‌న పెట్టేశారంటూ ఢిల్లీ త‌ల్ల‌డిల్లిపోతోంది… వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా మోదీ గెలిస్తే దేశ రాజ‌ధానిని అహ్మ‌దాబాద్‌కు మార్చేస్తారేమో అని కొంద‌రు అనుమానాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. మోదీ త‌న‌ను తాను గుజరాతీ ప్ర‌ధానిగా భావిస్తున్నారేమో అంటూ మ‌రికొంద‌రు జోకులు వేస్తున్నారు.