My title

‘మిస్టర్’ మూవీ రివ్యూ

రివ్యూ: మిస్ట‌ర్‌

రేటింగ్‌: 1.75/5

తారాగణం: వ‌రుణ్‌తేజ్ , హెబ్బాప‌టేల్ , లావ‌ణ్య త్రిపాఠి, నికితిన్ థీర్ , నాజ‌ర్ , త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు

సంగీతం:  మిక్కీ జే మేయ‌ర్‌

నిర్మాత: న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు

దర్శకత్వం: శీను వైట్ల‌

మిస్టర్ మూవీ సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి ఒకరి మీదే అనుమానం. అదే దర్శకుడు శీను వైట్ల. హీరో వరుణ్ తేజ్ కు సైతం చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ ఇంతవరకు లేనప్పటికీ కేవలం మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడు, చూడడానికి బాగున్నాడు, చేసిన మూడు సినిమాల్లో బాగా నటించాడు అనే సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి వరుణ్ మీద మరీ అత్యాశ పెట్టుకోలేదు ప్రేక్షకులు. ట్రైలర్ రెగ్యులర్ ఫీల్ ఇచ్చినా కూడా శీను పదే పదే నేను కొత్తగా తీసాను అని చెబుతూ ఉండటంతో కాస్త నమ్మకం పెట్టుకున్నారు మెగా అభిమానులు. హెబ్బా పటేల్, లావణ్య త్రిపాటితో కాస్త ఫ్రెష్ గా కనిపించిన వరుణ్ తేజ్ మరి తన నాలుగో సినిమాతోనైనా సక్సెస్ అందుకున్నాడా లేక తన భవిష్యత్తును శేఖర్ కమ్ముల ఫిదా కోసం మరో సారి చకోర పక్షిలా ఎదురు చూస్తాడా అంటే మీరే ఓ సారి లుక్ వేయండి.

మిస్టర్ కథేంటి అసలు

పిచ్చయ్య నాయుడు ఉరఫ్ చై(వరుణ్ తేజ్)స్పెయిన్ టూర్ లో ఉన్నప్పుడు మీరా(హెబ్బ పటేల్)తో పరిచయం పెంచుకుంటాడు. చూడగానే మీరా లవ్ లో పడిన చై కి తనకు అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి షాక్ ఇస్తుంది మీరా. అతనే సిద్ధార్థ(ప్రిన్స్). కాని తమ పెళ్ళికి సమస్య ఉందని చెప్పి అది తీర్చే బాధ్యత చై మీద పెడుతుంది. దీంతో మీరా ఊరికి వెళ్ళిన చై కి  అదే ఊరిలో ఉంటున్న చంద్రముఖి(లావణ్య త్రిపాటి)తో  పరిచయం అవుతుంది. చంద్రముఖికీ సమస్య ఉంటుంది. ఊరిలోనూ సమస్య ఉంటుంది. ఊరికి హీరోకి ఒక లింక్ ఉంటుంది. ఇన్ని సమస్యలని హీరో ఎలా పరిష్కరిస్తాడు, ఇది చూసే వాళ్ళను ఎలాంటి సమస్యలోకి నెడతాడు అనేదే మిగిలిన కథ.

ఎలా చేశారు

నాగబాబు వారసుడు అనే స్టాంప్ ఉన్నా వరుణ్ తేజ్ కి మెగా హీరో ఫ్యామిలీ అనే ట్యాగ్ ఓపెనింగ్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతోంది. పైగా చిరు సపోర్ట్ పూర్తిగా ఉండటంతో వరుణ్ సినిమా అంటే అంతో ఇంతో ఆసక్తి మార్కెట్ లో ఉంటుంది. వరుణ్ తేజ్ నటనను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు అని కంచే సినిమాతోనే ప్రూవ్ అయ్యింది. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని మిస్టర్ లో చూపించే ప్రయత్నం చేసాడు శీను వైట్ల. వరుణ్ తనకు చెప్పింది చేసుకుంటూ పోయాడు కాబట్టి విమర్శించడానికి ఏమీ లేదు. నటనలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో వరుణ్ లోని డిఫరెంట్ షేడ్స్ బాగా వాడుకున్నాడు శీను వైట్ల. హెబ్బా పటేల్ వరుణ్ కు తగ్గ జోడిగా బాగుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడ తర్వాత తనకు కొంచం ఆప్ట్ గా అనిపించిన రోల్ ఇదే అని చెప్పొచ్చు.

కుమారి 21 ఎఫ్ కోణంలో నుంచి కాకుండా తనలోని మంచి నటిని వాడుకుంటే కొంత కాలం హీరొయిన్ కొరత తగ్గుతుంది. చంద్రముఖిగా లావణ్య త్రిపాటి మరీ కొత్త అనిపించే పాత్ర అయితే కాదు. పల్లెటూరిలో పెరిగిన పెద్దింటి అమ్మాయిగా బాగా చేసింది. వరుణ్ కి జోడిగా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ హెబ్బ ఈ విషయంలో మంచి స్కోర్ కొట్టేస్తుంది. రఘుబాబు, శ్రీనివాస రెడ్డి కామెడీ మొదట్లో పర్వాలేదు అనిపించినా తర్వాత బోర్ కొడుతుంది. పృథ్వి, నాజర్ ఇలా రాసుకుంటూ పోతే చాలానే ఉన్నారు కానీ ఎవరికి మరీ ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా మాటలతో నసపెట్టి చంపించారు. తనికెళ్ళ భరణి చాలా కాలం తర్వాత విలన్ గా ట్రై చేసాడు కానీ వర్క్ అవుట్ అయ్యింది తక్కువే. సిద్ధార్థ గా హీరో ప్రిన్స్ పాత్ర అంతగా పండలేదు. కనీసం నవీన్ చంద్ర లాంటి కాస్త గుర్తు పట్టే హీరోని పెట్టుంటే బాగుండేది. మురళి శర్మ, నాగినీడు జస్ట్ ఓకే.

మిస్టర్ ని ఎలా తీసారు

శీను వైట్ల తన స్కూల్ నుంచి బయటకు రావడం లేదు. ఆగడు, బ్రూస్ లీ పరాజయాలకు కోన వెంకట్ ని భాద్యుడిని చేసిన శీను ఇప్పుడు మాత్రం నేరం ఒప్పుకోక తప్పదు. అసలు లోపం తనలోనే ఉందని మరో సారి వెండితెరపై రుజువు చేసుకున్నాడు. మంచి టేకాఫ్ తో ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకున్న శీను రాను రాను తన పాత రూట్లోనే వెళ్ళడం  బాగా అసహనానికి గురి చేస్తుంది. పాత్రలు ఎన్ని ఎక్కువ ఉంటె అంత వినోదాన్ని పండించవచ్చు అనే మూర్ఖ సిద్ధాంతాన్ని శీను వదిలిపెట్టనంత వరకు ఇలాగే ఉంటుంది.

సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందో ఈజీగా ఊహకు అందేలాగా ఉండటం ముమ్మాటికి స్క్రీన్ ప్లే లోపమే. హీరోకు ముందు ఒక అమ్మాయి తో ప్రేమ, ఆ అమ్మాయికి తన ఊళ్ళో ఓ సమస్య. అది పరిష్కరించడానికి అక్కడికి బయలుదేరిన హీరో. అక్కడ మరో హీరొయిన్ తో పరిచయం. అది కూడా ప్రేమ. రెండు వర్గాల మధ్య అప్పటికే ఉన్న శత్రుత్వం. చిన్న ట్విస్ట్. హీరో నడుంబిగించి పరిష్కరించి అందరితో శభాష్ అనిపించుకోవడం వెరసి ఈ కథను కొన్ని వందల సినిమాల్లో చూసిందే. మరి గోపి మోహన్ కొత్తగా ఏమీ రాసుకున్నట్టు అనిపించదు.

శ్రీధర్ సీపాన మాటలు కూడా అంతే. ఏ మాత్రం వైవిధ్యంగా లేవు. మిక్కి జే మేయర్ సంగీతం మాత్రం పాటల వరకు ఓకే. నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. గుహన్ ఫొటోగ్రఫీ చాలా బాగుంది. లొకేషన్స్ ని తన కెమెరా కన్నుతో చాలా బాగా చూపించాడు. వర్మ ఎడిటింగ్ పని చాలా  చెప్పాల్సి ఉంది కాని ఇందులో ఆయనకు సంకెళ్ళు వేసారు. నిర్మాతలు తమ గత చిత్రం లాగే భారీగా ఖర్చు పెట్టినా ఫలితం శూన్యం.

ఫైనల్ వర్డ్

శీను వైట్లకు చివరి పరీక్షగా భావించిన మిస్టర్ సినిమా అతనికి కనీసం పాస్ మార్కులు వచ్చే అవకాశం లేకుండా చేసింది. మరీ తీసికట్టు కథ కాకున్నా తన వంతు బాధ్యత అయిన దర్శకత్వ ప్రతిభను తెరపై చూపడంలో మాత్రం అత్తెసరు మార్కులకే తెగకష్టపడ్డాడు శీను. ముతక కామెడీ కి కాలం చెల్లింది అని ప్రేక్షకులు ఏనాడో తీర్పు ఇచ్చారు. ఇంకా అదే పట్టుకుని వేలాడుతున్న శీను వైట్ల లాంటి దర్శకులకు మిస్టర్ ఒక లెసన్ లాంటిది.

తన సినిమాలు తానే కాపీ కొట్టుకునే దయనీయ స్థితిలో శీను ఇంకా కొట్టుమిట్టాడటం అతన్ని అభిమానించే ప్రేక్షకుల దురదృష్టం. ఇకనైనా తన పంధాను మార్చుకునే అవకాశం మరో నిర్మాత ఇస్తాడో లేదో చెప్పలేం. బ్రహ్మోత్సవం దెబ్బకు ఎక్కడున్నాడో కూడా తెలియలేనంతగా మాయం అయిన శ్రీకాంత్ అడ్డాల లాగా శీను రేపు మీడియా కు కనిపించకుండా పోతాడేమో చెప్పలేం. సో రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు డిటిఎస్ సౌండ్ ఉన్నా ఎసి ఉంటె చాలు నిద్ర వస్తుంది అనే బాపతు జనానికి బెస్ట్ ఛాయస్ మిస్టర్.

మిస్టర్ : దారి తప్పిన పాత రోత ప్రయత్నం—శీను వైట్ల కామెడీకి విషాద చిత్రం