My title

మంత్రిని లేపేయ‌డానికి 5 కోట్ల సుపారీ

జాతీయ ద‌ర్యాప్తు సంస్థ …నేష‌న‌ల్ ఇన్వెష్టిగేష‌న్ ఏజెన్సీ త‌న అదుపులో ఉన్న‌మావోయిస్టు క‌మాండ‌ర్ కుంద‌న్ నుంచి అనేక నిజాల‌ను రాబడుతోంది. 2008లో జార్ఖండ్ మంత్రి ర‌మేష్ సింగ్ ముండా ను చంపేందుకు త‌న‌కు 5 కోట్ల సుపారీ అందింద‌ని కుంద‌న్ వెల్ల‌డించాడు.

గోపాల్ కృష్ణ ప‌టార్ అలియాస్ రాజా పీట‌ర్ అనే మ‌రో మంత్రి త‌న‌కీ కాంట్రాక్ట్ అప్ప‌గించాడ‌ని కుంద‌న్ ద‌ర్యాప్తులో వెల్ల‌డించాడు.

కాంట్రాక్ట్ ప్ర‌కారం రాంచీ శివారు ప్రాంతంలో 2008 జూలైలో మావోయిస్టు గొరిల్లాలు ముండాను హ‌త‌మార్చారు.

హ‌త్య‌కు ముందు 3 కోట్లు హ‌త్య త‌ర్వాత 2 కోట్లు చెల్లించిన‌ట్లు ఎన్ఐఏ విచార‌ణ‌లో తేలింది.

హ‌త్య అనంతరం 2 కోట్లు అందుకున్న మావోయిస్టు క‌మాండ‌ర్ బ‌ల‌రాం సాహు డబ్బుతో ప‌రార‌య్యాడు. దీంతో పాలిట్‌బ్యూరోకు ఆ 2 కోట్లు చేర‌లేదు. కొన్ని రోజుల త‌ర్వాత పోలీసులు వ‌ల‌ప‌న్నిబ‌ల‌రాం సాహును ప‌ట్టుకున్నారు.

హ‌త్య‌కు సుపారీ చెల్లించిన రాజా పీట‌ర్ కూడా ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అత‌నికి అంత డ‌బ్బు ఎక్క‌డ నుంచి వ‌చ్చింది. వేరే ఎవ‌రైనా హ‌త్య‌కు డ‌బ్బులు చెల్లించారా త‌దిత‌ర అంశాల‌ను ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ జ‌రుపుతోంది.

ర‌మేష్ సింగ్ ముండాకు బాడీగార్డ్‌గా ఉన్న ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజా పీట‌ర్‌కు సాయం చేశాడు. ముండా క‌ద‌లిక‌ల‌పై ఎప్ప‌టి క‌ప్పుడు స‌మాచారం చేర‌వేసేవాడు. ఈ విష‌యాన్ని రాజా పీట‌ర్ మావోల‌కు చేర‌వేయ‌డంతో కాపు కాచి ఆయ‌న‌ను హ‌త్య చేశారు.

రాజా పీట‌ర్‌కు సాయం చేసిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను కూడా ద‌ర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తోంది.

ర‌మేష్ సింగ్ చ‌నిపోయిన త‌ర్వాత‌…

ర‌మేష్ సింగ్ ముండా హ‌త్య‌కు గురైన త‌ర్వాత ఖాళీ అయిన తామ‌ర్ నియోజ‌క వ‌ర్గం నుంచి రాజా పీట‌ర్ పోటీ చేశాడు. 2009 జ‌న‌వ‌రిలో జ‌రిగిన ఆ ఉప ఎన్నిక‌లో ఏకంగా జార్ఖండ్ ముఖ్య‌మంత్రి శిబుసోరెన్‌ను రాజా పీట‌ర్ ఓడించాడు. సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసుకున్నాడు.

ముఖ్య‌మంత్రిగా ఉన్న శిబుసోరెన్ ఓట‌మి చెంద‌డంతో జార్ఖండ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించారు. 2009 న‌వంబ‌ర్‌లో మ‌ళ్లీ జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజా పీట‌ర్ తిరిగి అదే సీటు నుంచి గెలుపొంది మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నాడు.