My title

అవినీతి దెబ్బ… ఏపీకి ఉపాధి నిధులు నిలిపేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులను నిలిపివేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం… ఏపీకి మాత్రమే ఉపాధి హామీ నిధులను ఆపేసింది. ఇటీవల ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలు… ఏపీలో ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగినట్టు గుర్తించాయి. కోట్లాది రూపాయలు దారి మళ్లినట్టు తేల్చాయి. ప్రణాళికలు లేకపోవడం, ఎం-బుక్‌ల్లో అధికారుల సంతకాలు లేకపోవడం వంటి అంశాలను కేంద్ర బృందాలు గుర్తించాయి. పనులు చేయించామని అధికారులు చెబుతున్నా… వాటికి సంబంధించిన కనీస రికార్డులను కేంద్ర బృందాలకు చూపించలేకపోయారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిపిన పర్యటనలో ఈ అక్రమాలు బయటపడ్డాయి.

కొన్ని పనులకు అంచనాల కంటే అదనంగా భారీగా సొమ్మును చెల్లించిన విధానం కూడా బయటపడింది. ఏపీలో ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉపాధి హామీ పథకం నడుస్తోందని గుర్తించిన కేంద్రం… నిధులను ఆపేసింది. జులై 1 నుంచి ఏపీకి రూ. 589 కోట్లు చెల్లించాల్సి ఉంది.  కేంద్రం నిధులు ఆపేయడంతో కూలీలకు డబ్బుల చెల్లింపు ఆగిపోయింది. ఏప్రిల్‌లో మొదటి విడతగా అన్ని రాష్ట్రాలకు నిధులను విడుదల చేసింది కేంద్రం. రెండో విడత  నిధుల కోసం దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాలకు జులై 27న మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఈనెల 9న రెండో విడత నిధులు మంజూరయ్యాయి. ఏపీకి మాత్రం కేంద్రం నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చింది. ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఢిల్లీకి క్యూ కట్టారు. వారి వల్ల ఫలితం లేకపోవడంతో నారా లోకేష్‌ కూడా ఢిల్లీ బాట పట్టారు. గురువారం కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ను కలిసి నిధులు విడుదల చేయాలని కోరారు. అయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందో లేదోనన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.