My title

‘మహానుభావుడు’ మూవీ రివ్యూ

రివ్యూ: మహానుభావుడు

రేటింగ్‌: 2.75/5

తారాగణం:శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్ తదిత‌రులు

సంగీతం: తమన్

నిర్మాత:  వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్

దర్శకత్వం: మారుతి

అసలే బాక్స్ ఆఫీస్ దగ్గర జై లవకుశ, స్పైడర్ నువ్వా నేనా అన్నట్టు వసూళ్ళ కోసం పోటీ పడుతుంటే మధ్యలో మహానుభావుడు ఎందుకు వస్తున్నాడు అనే డౌట్ అందరికి వచ్చింది. శర్వానంద్ కు ఇలా రావడం కొత్తేమి కాదు. గతంలో ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి హెవీ కాంపిటీషన్ లోనే తీసుకొచ్చి సూపర్ హిట్స్ కొట్టాడు. అదే ధైర్యం కాబోలు ఈ సారి కూడా మహేష్, తారక్ తో పోటీకి సై అంటూ ముందుకు వచ్చాడు. యూత్ లో మంచి క్రేజ్, ఫ్యామిలీస్ లో ఫాలోయింగ్ ఉన్న శర్వానంద్, భలే భలే మగాడివోయ్ తో నానిని ఇమేజ్ పరంగా పది మెట్లు పైకి ఎక్కించిన దర్శకుడు మారుతి కాంబో కావడంతో మహానుభావుడిపై ముందు నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి వాటిని నిలబెట్టుకునేలా మహానుభావుడు ఉన్నాడో లేదో చూద్దాం.

భలే భలే మగాడివోయ్ చూసిన కళ్ళతో మహానుభావుడిని ఏదేదో ఊహించుకుని వెళ్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. ఇందులో స్టొరీ లైన్ చాలా చిన్నది. అతి శుభ్రంగా ఉండే రోగంతో బాధపడే హీరో శుభ్రతను ఇష్టపడే అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని ముందు ఇది మంచి లక్షణం అనుకున్న హీరొయిన్ ఇదో పిచ్చి రోగమని తర్వాత తెలుసుకుంటుంది. హీరోకున్న ఈ లక్షణం వల్ల తన తండ్రి చావు దాకా వెళ్లి రావడంతో అతనంటే అసహ్యం కూడా పెంచుకుంటుంది. దీంతో హీరో తప్పని పరిస్థితుల్లో ఆమె పల్లెటూరికి వెళ్లి అక్కడ నానా అగచాట్లు పడతాడు. చివరికి ఆమె కోసం మట్టి కొట్టుకునే కుస్తీ పోటీకి కూడా సై అంటాడు. చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేదే ఈ సినిమా కథ

శర్వానంద్ టేస్ట్ చాలా స్పెషల్. రొటీన్ గా అనిపించుకునే కథను సెలెక్ట్ చేసుకోడు. అది మనం గత మూడు నాలుగు సినిమాల్లో గమనించవచ్చు. అందుకే మారుతీ చెప్పిన ఓసిడి కాన్సెప్ట్ బాగా నచ్చి ఉంటుంది. తనవరకు బాగా చేసాడు శర్వానంద్. అవతలి వారికి ఏమైనా పర్వాలేదు అంతా శుభ్రంగా ఉండే తీరాలి అనే వింత జబ్బుతో బాధ పడే పాత్రలో జీవించాడు. సెకండ్ హాఫ్ లో  తన పాత్రను చాలా బాగా ఒన్ చేసుకున్నాడు. హీరొయిన్ మెహ్రీన్ ఫ్రెష్ గా కనిపించినా నటన పరంగా ఇంకాస్త ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. నాజర్ కొన్ని వందల సినిమాల్లో చేసిన పాత్రనే ఇందులో చేసాడు. కొత్తగా ఏమి లేదు. నటనలో కూడా. హీరొయిన్ బావగా చేసిన ఆర్టిస్ట్ మాత్రం కండలు బాగా పెంచి హీరో కంటే బలంగా కనిపిస్తాడు.

దర్శకుడు మారుతీ ఓవర్ క్లీన్లినెస్ డిజార్దర్ అనే పాయింట్ ముందు మనసులో అనుకుని ఆ తర్వాత కథను రాసుకున్నట్టు అనిపిస్తుంది. మంచి కామెడీ పండించడానికి స్కోప్ ఉన్న ఈ కథలో మారుతీ భలే భలే అంత ఎంటర్టైనింగ్ గా అనిపించదు. కారణం కథ చాలా చిన్నది కావడమే. సెకండ్ హాఫ్ లో హీరొయిన్ ఫ్యామిలీని మెప్పించే క్రమంలో కామెడీ కొంతవరకు పండింది కానీ ఆ తర్వాత బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎలాగూ హీరోనే కుస్తీ పోటీల్లో నెగ్గుతాడు, మార్పు వస్తుంది అని ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేయగలిగినప్పుడు చివరి నలభై నిమిషాల్లో రెండు పాటలు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ప్రీ క్లైమాక్స్ మొదలు కొని సినిమా త్వరగా ముగించాలి అనే కాన్సెప్ట్ బదులు ఇది తెగ నచ్చుతుంది కదా ఇంకా ఎంజాయ్ చేస్తారు అని మారుతీ అనవసరమైన సీన్లు చాలా రాసుకున్నాడు. ఇవి మైనస్ చేసుకుని చూస్తే మహానుభావుడు మంచి సినిమానే. కాని భలే భలే మేజిక్ తాను కూడా రీ క్రియేట్ చేయలేకపోయాడు మారుతీ . కాని ఓవరాల్ గా మార్కెట్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే ఏ సినిమా మార్కెట్ లో లేదు కాబట్టి ఇది మంచి ఛాయస్ గా మిగిలే అవకాశం ఉంది. తమన్ రెండు ట్యూన్స్ చాలా బాగున్నాయి. మిగిలినవి రొటీన్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. యాక్షన్ మూవీ కాదు కాబట్టి ఇదే ఎక్కువ అనుకోవాలి. నిజార్ షఫీ కెమెరా పనితనం బాగుంది. కోటగిరి ఎడిటింగ్ మాత్రం సెకండ్ హాఫ్ లో పని చెప్పడం మరిచినట్టు అనిపిస్తుంది. ట్రిమ్ చేసే చాన్సు వదిలేసారు. యువి క్రియేషన్స్ మాత్రం రిచ్ గా రావడంలో ఎంత బడ్జెట్ అవసరమో అంతా ఇచ్చారు కాబట్టి దాని గురించి స్పెషల్ గా చెప్పేది ఏమి లేదు.

మహానుభావుడు మహా గొప్ప సినిమా కాదు కాని ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మామూలు డీసెంట్ ఎంటర్టైనర్. కథ పెద్దగా లేకపోవడం అనే మైనస్ తప్పిస్తే రెండున్నర గంటల పాటు ఓ మాదిరిగా నవ్వించి పంపుతాడు. కాని మారుతీ బ్రాండ్ ని నమ్ముకుని నాని భలే భలే మగాడివోయ్ ని మించి ఉంటుంది అనుకుంటే మాత్రం కొంత నిరాశ తప్పదు. వీక్ ఎండ్ లో హాలిడే సీజన్ చూసుకుని మరీ వదిలిన సినిమా కాబట్టి పెట్టిన బడ్జెట్ కి, వచ్చే రిటర్న్స్ కి ఇబ్బంది ఏమి ఉండదు. బలమైన పోటీ మార్కెట్ లో ఉన్నా తన సెక్షన్ ఆడియన్స్ ని రప్పించుకోవడంలో మాత్రం మహానుభావుడు బాగానే సక్సెస్ అయ్యాడు. కాని శుభ్రం అక్కడక్కడ ఎక్కువైనట్లు అనిపిస్తుంది…. దాన్ని కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ రప్పిస్తాడు. అది మినహాయిస్తే చూసినందుకు ఫీల్ కావాల్సిన అవసరం లేని సినిమా మహానుభావుడు.