My title

లోకేష్ మాట‌ల‌తో కోట‌లో చిచ్చు

అది శృంగ‌వ‌ర‌పు కోట‌… ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి కంచుకోట‌… ఇప్పుడు ఒక్క మాట‌తో ఆ కోట‌లో చిచ్చు లేపారు లోకేష్‌… ఆ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని రెండు వ‌ర్గాలుగా చీల్చేశారు… ఇప్ప‌టికే త‌న మాట‌ల‌తో, చేష్ట‌ల‌తో పార్టీని ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్న లోకేష్ మ‌రోసారి త‌న మాట‌ల‌తో మంట‌లు పుట్టించారు… ఆ మంట‌ల్లో కంచుకోట మాడి మ‌సైపోయి ఖాళీకోట‌గా మారిపోతోందని తెలుగుత‌మ్ముళ్లు వాపోతున్నారు…. త‌న మాట‌ల‌తోనే పార్టీ కోట‌లు కూల్చెయ్య‌గ‌ల స‌మ‌ర్థుడు చిన‌బాబు అని తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు అవాక్క‌యిపోతున్నాయి.

ఎస్‌. కోట‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభానికి వ‌చ్చిన మంత్రి లోకేష్ స‌భావేదిక‌పై స్థానిక ఎమ్మెల్యే ల‌లిత‌కుమారి ప‌నితీరును మెచ్చుకున్నారు… అంత‌టితో ఊరుకోకుండా 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా మ‌రోసారి ల‌లిత‌కుమారిని గెలిపించాలని ప్ర‌జ‌ల‌ను కోరారు… దీంతో జ‌నంలో క‌ల‌క‌లం రేగింది…. పార్టీ శ్రేణుల్లో క‌ల‌వ‌రం క‌లిగింది… వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌లిత‌కుమారికే టికెట్ ఖాయ‌మంటూ చిన‌బాబు చెప్ప‌డంతో ఎమ్మెల్యే ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం భ‌గ్గుమంది. ఈ దెబ్బ‌తో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి.

ఎస్‌. కోట‌లో మాజీ ఎమ్మెల్యే హైమావ‌తి, సిట్టింగ్ ఎమ్మెల్యే ల‌లిత‌కుమారి వ‌ర్గాల మ‌ధ్య పోరు న‌డుస్తోంది… వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాల‌తో ఐదు మండ‌లాల్లోని టీడీపీ శ్రేణులు ఇప్ప‌టికే రెండు వ‌ర్గాలుగా చీలిపోయాయి….వీళ్లిద్ద‌రి వ‌ర్గ‌పోరుతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో అస‌మ్మ‌తి మంట‌లు చెల‌రేగుతున్నాయి…. ఎంపీపీల రాజీనామా విష‌యంలో కూడా ఇద్ద‌రి మ‌ధ్య రాజీ లేని పోరు సాగుతోంది…తాజాగా లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై హైమావ‌తి వ‌ర్గం మండిప‌డుతోంది… ఆమె త‌న దారి తాను చూసుకున్నా, పార్టీలోనే ఉంటూ ల‌లిత‌కుమారికి సెగ పెట్టినా ఎస్‌. కోట‌లో టీడీపీకి గ‌డ్డుకాలం వ‌చ్చిన‌ట్టే అని కార్య‌క‌ర్త‌లు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.