My title

జగన్‌ కేసులో సీబీఐకి ఊహించని దెబ్బ…. చార్జిషీటే కొట్టేసిన కోర్టు

జగన్ ఆస్తుల కేసులో సీబీఐకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అనంతపురం జిల్లా లేపాక్షి హబ్‌ భూ కేటాయింపుల్లో ఏకంగా చార్జిషీట్‌ను హైకోర్టు కొట్టి వేసింది. అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబుపై కేసును కొట్టివేసింది. సీబీఐ చార్జిషీట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌ వేసిన శ్యాంబాబుకు కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. లేపాక్షి హబ్‌ కేసులో శ్యాంబాబుపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఆయన్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పీసీ యాక్ట్ ప్రకారం ఐఏఎస్ లను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే సీబీఐ విజ్ఞప్తిని పరిశీలించి కేంద్ర విజిలెన్స్ కమిషన్.. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అప్పటి కేబినెట్ నిర్ణయం మేరకే అంతా బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం శ్యాంబాబుపై విచారణకు అనుమతి నిరాకరించింది.

లేపాక్షి హబ్‌ వ్యవహారంలో శ్యాంబాబు ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత శ్యాంబాబు పదవీ విరమణ చేశారు. ఈనేపథ్యంలో కేంద్రం విచారణకు నిరాకరించినందున తనపై ఉన్న చార్జిషీట్‌ను కొట్టివేయలాని శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సీతారామమూర్తి తీర్పువెలువరించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విచారణను నిరాకరించాయని,  ఇప్పుడు శ్యాంబాబు  పదవీ విరమణ చేశారని అందువల్ల  ఆయనపై విచారించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఒక ఉద్యోగిపై విచారణకు ప్రభుత్వం నిరాకరించినప్పుడు, ఆ ఆదేశాలను దర్యాప్తు సంస్థ సవాల్ చేయని పక్షంలో ఇక ఆ ఉద్యోగిని విచారించేందుకు వీల్లేదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చార్జిషీట్‌ను కొట్టివేస్తున్నట్టు ఉమ్మడి హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో దాదాపు అందరూ ఐఏఎస్‌ లు బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక జగన్‌పై కేసు నిలవడం అసాధ్యమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.