My title

రెడ్డి యాత్రపై లాఠీచార్జ్‌…. పగిలిన తలలు

తెలంగాణలో పేద రెడ్డి కులస్తులను ఆదుకోవాలన్న డిమాండ్‌తో నిర్వహించిన రెడ్డిపోరు యాత్రపై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 2న వేములవాడ నుంచి ప్రారంభమైన పోరు యాత్ర వివిధ జిల్లాల మీదుగా హైదరాబాద్ చేరుకుంది. కొంపల్లిలో గురువారం ముగింపు కార్యక్రమానికి  వివిధ జిల్లాల నుంచి వేలాది మంది రెడ్డి కులస్తులు వచ్చారు. అయితే మేడ్చల్ సమీపంలో రెడ్డి కులస్తులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్న సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వాహనాల్లో తరలివచ్చారు. దీంతో ఉద్రికత్త ఏర్పడింది. పోలీసులు భారీగా బలగాలను రప్పించి అరెస్ట్‌లు చేశారు.

పోలీసుల తీరుకు నిరసనగా మిగిలిన వేలాది మంది మేడ్చల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కారణం లేకుండా అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు మరోసారి భారీగా బలగాలను రప్పించి ఈసారి ఏకంగా లాఠీలకు పనిచెప్పారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. పోలీసుల దాడిలో పలువురికి తలలు పగిలి నెత్తురోడాయి. తాము శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తుంటే అసలు అరెస్ట్‌లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రెడ్డి కులస్తులు ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం కార్యక్రమానికి అనుమతి లేదని అందుకే అడ్డుకున్నామని చెబుతున్నారు.