My title

టీ పోలీసులపై దిగ్విజయ్‌ సంచలన వ్యాఖ్యలు… కేటీఆర్ ఖండన

తెలంగాణ కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర స‌మితి మ‌ధ్య కొత్త యుద్ధానికి తెర‌లేచింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌ల యుద్ధానికి తెర‌లేపారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా పరస్పర విమర్శలు చేసుకున్నారు.

తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్‌ వెబ్‌సైట్‌ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారని దిగ్విజ‌య్ ఆరోపించారు. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్‌ అధికారం ఇచ్చారా?. అలా అయితే ఆయ‌న‌‌ దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని దిగ్విజయ్‌ సింగ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

దిగ్విజ‌య్ విమ‌ర్శ‌ల‌కు కేటీఆర్ ట్విట్ట‌ర్‌లోనే కౌంట‌ర్ ఇచ్చారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న వ్యక్తిపై బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. దిగ్విజయ్‌ సింగ్‌ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అన్నారు. నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న పోలీసుల నైతికతను ప్రశ్నించే అర్హత దిగ్విజయ్‌కు లేదని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఆ త‌ర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ దిగ్విజ‌య్‌ను రాహుల్‌గాంధీ కంట్రోల్ చేయాల‌ని…లేక‌పోతే రాష్ట్రానికి వ‌చ్చిన‌పుడు త‌గిన‌బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు.