My title

కేంద్ర పెద్దలకు కేటీఆర్ నజరానా…. ఇంత ఖర్చా?

కేంద్ర పెద్దల వద్ద తమ పలుకుబడి పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సరికొత్త పంథాలో ముందుకెళ్తున్నారు. కేంద్ర మంత్రులను కాకా పట్టడం ద్వారా తాను ఏదైనా పని మీద ఢిల్లీ వెళ్తే వెంటనే వారు స్పందించేలా చేయాలన్నది మంత్రి కేటీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు. ఒక విధంగా కేటీఆర్ కేంద్ర మంత్రులకు, ఆయా శాఖల కార్యదర్శులకు లంచం ఇస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వస్తున్నాయి.

ఒక వైపు లంచం అడిగిన వారిని చెప్పుతో కొట్టండి అంటూ కేసీఆర్‌, కేటీఆర్ స్టేట్‌మెంట్లు ఇస్తూనే మరోవైపు కేంద్రమంత్రులను కాకపట్టేందుకు విలువైన వస్త్రాలు, వెండికానుకలు పంపడం ఏమిటంటున్నారు. కేంద్రమంత్రుల వద్ద మార్కులు కొట్టేసేందుకు గాను చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేటీఆర్‌…. చీరలు, షేర్వాణీలు పంపుతుండడం  ఇప్పుడు దుమారం రేపుతోంది. కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా ఇలా బట్టలు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

దీపావళి సందర్భంగా కేటీఆర్ ఇలా కేంద్రమంత్రులకు గిఫ్ట్‌లు  పంపడం లంచం కిందికే వస్తుందని, కాంట్రాక్టర్లు  పనులు చేయించుకుని ఇలాగే బహుమతులు ఇస్తారని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. లంచం ఇచ్చినా తీసుకున్నా చెప్పుతో కొట్టమని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, ఇలా బహుమతుల రూపంలో లంచం ఇచ్చేవారిని ఏం చేయాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా నుంచి బహుమతులకు నిధులు కేటాయించడం దారుణమన్నారు. కేంద్రమంత్రులకు కానుకలు అంశంపై బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులకు ఖరీదైన కానుకలు పంపడం ఏమిటని ప్రశ్నించారు. అయితే మోడీ కేబినెట్‌లో పనిచేస్తున్న కేంద్రమంత్రులు ఈ కానుకలను స్వీకరిస్తారో లేదో చూడాలి. ఒకవేళ స్వీకరిస్తే అది తప్పుకాదని ఎలా సమర్దించుకుంటారో చూడాలి. ఇకపై కాంట్రాక్టర్లు కూడా ఇదే తరహాలోనే కానుకలు ఇచ్చి అవి లంచాల కిందకు రావంటే అప్పుడు పరిస్థితి ఏంటో! అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.