My title

ఖైదీ నెం 150… తెరపైన రైతు బాంధవుడు….

రివ్యూ: ఖైదీ నెం 150

రేటింగ్‌: 2.75/5

తారాగణం:  చిరంజీవి, కాజల్ అగర్వాల్, ఆలీ, బ్రహ్మానందం, పోసాని తదితరులు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

నిర్మాత: రామ్ చరణ్

దర్శకత్వం: వి.వి.వినాయక్

మనది ప్రధానంగా వ్యవసాయదేశం. 90 శాతం మందికి ఏదోరకంగా వ్యవసాయనేపథ్యముంటుంది. మనం కాకపోయినా మన తాత ముత్తాతలు రైతులే అయివుంటారు. పల్లెలనుంచి వలసవచ్చిన వాళ్ళతోనే నేడు పట్టణాలు కిటకిటలాడుతున్నాయి.

గత పాతికేళ్ళుగా వ్యవసాయం మీద కుట్రజరుగుతూ ఉంది. ఇంకో పాతికేళ్ళకి ఈ కుట్రపూర్తి స్వరూపం మనకి అర్ధమవుతుంది. వ్యవసాయ భూముల్ని రియల్‌ ఎస్టేట్‌, సెజ్‌ల పేరుతో పల్లె ప్రజలనుంచి లాక్కోవడం ఈ కుట్ర మొదటి దశ. రెండోదశ ఏంటంటే చిన్నచిన్నపంట పొలాలను మాయం చేసి పెద్దపెద్ద ఆగ్రో ఫామ్స్‌ ఏర్పాటు చేయడం. కొన్నివేల ఎకరాలు ఒక్కో మల్టీ నేషనల్‌ కంపెనీ ఆధీనంలో ఉంటాయి. రైతులంతా కూలీలుగా మారి ఆ ఫార్మ్‌లో పనిచేస్తారు. అప్పుడు దళారులు కూడా ఉండరు. కంపెనీనే నేరుగా ధరని నిర్ణయిస్తుంది. సింథాల్‌ సోప్‌ని మనం ఎలా కొంటామో అలాగే పళ్ళు, కూరగాయలు, తిండిగింజల్ని కొంటాం. రిలయన్స్‌ వారి కందులు, టాటావారి జామకాయలు (అల్రెడీ ఉప్పువుంది), గొడ్రెజ్‌ వారి బియ్యం ఇలా… వస్తాయి. మొదటి దశని చూస్తున్నాం. రెండోదశని మనంకాకపోయినా భావితరాలు చూస్తాయి.

నిన్న మొన్నటి దాకా మన కళ్ళముందే పౌల్ట్రీ రైతులుండే వాళ్ళు. ఇప్పుడు లేరు. సుగుణ, వెంకోబ్‌ టేకోవర్‌ చేసేశాయి. వాళ్ళిచ్చే కూలీకోసం రైతులు పౌల్ట్రీఫారాలు ఏర్పాటుచేస్తున్నారు. ధరని కంపెనీలు నిర్ణయిస్తాయి. ఇదంతా ఎందుకంటే ఖైదీ నెంబర్‌ 150 సినిమా కథాంశం ఇదేకాబట్టి. కార్పోరేట్‌ కంపెనీలు రైతుల భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే హీరో ఎలా ప్రతిఘటించి రైతుల భూములన్ని కాపాడడన్నదే కథ. దీనికి సినిమాటిక్‌ హంగులు, చిరంజీవి ఇమేజ్‌ కలిస్తే ఏం జరిగిందన్నదే సమీక్ష….

దాదాపు పదేళ్ళ తరువాత చిరంజీవి తెరపై కనిపిస్తే ఎలావుంటాడన్నది అందరికీ ఆసక్తి. అరవైఏళ్ళవయసులో కూడా ఫైట్స్‌, డాన్స్‌లు అదరగొట్టాడా? నటనలో పంచ్‌, టైమింగ్‌ అలాగే వున్నాయా?తగ్గాయా? వీటన్నిటికి సమాధానం ఖైదీ నెం 150లో లభిస్తుంది.

ఒకరకంగా చెప్పాలంటే చిరంజీవి తన వయసుని జయించాడు. ఈ పదేళ్ళు ఆయన తెరమీద కనిపించలేదనే విషయం కూడా మనకి గుర్తుండదు. 1995 నాటి చిరంజీవిలా ఉన్నాడు. డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో కొంచెం ఊపుతగ్గినట్టు అనిపించిందికానీ జోష్‌ మరీ తగ్గలేదు. ఇక నటనలో కామెడీ, సీరియస్‌ అన్నీ ఎప్పటిలాగే! ఒకరకంగా ఈ సినిమా చిరంజీవి వన్‌మ్యాన్‌షో (డబుల్‌ యాక్షన్‌ అయినా కత్తిశీనునే సినిమా అంతా ఉంటాడు)

150 సినిమా కథకోసం గాలించి గాలించి చివరికి మురుగదాస్‌ తీసిన కత్తి సినిమాని ఓకే చేశారు. దాంట్లో హీరోయిజం, సెంటిమెంట్‌, కామెడీ అన్నీ ఉన్నాయి. తెలుగులో బ్రహ్మానందంతో కామెడీ పార్ట్‌ ఇంకొంచెం పెంచారు. వి.వి.వినాయక్‌ కత్తి సినిమాలో పెద్దగా మార్పులు చేర్పులు జోలికెళ్లలేదు. ఆయన చేసిందల్లా ఒరిజినల్‌ని చెడగొట్టకుండా తీయడమే.

కత్తిశీను (చిరంజీవి) జైలునుంచి పరారవ్వడంతో కథ మొదలవుతుంది. హైదరాబాద్‌ చేరుకున్న శీను స్నేహితుడు మల్లి (ఆలీ) సహాయంతో బ్యాంకాక్‌ వెళ్ళాలనుకుంటాడు. ఎయిర్‌పోర్టులో హీరోయిన్ని (కాజల్‌) చూసి మనసు మార్చుకుంటాడు.

తరువాత అనుకోని పరిస్థితుల్లో తనలాగే ఉన్న శంకర్‌ (చిరంజీవి)ని చూస్తాడు. గాయాలతో ఉన్న శంకర్‌ని తన పేరుతో ఆసుపత్రిలో చేరుస్తాడు. దాంతో తనకోసం వెతుకుతున్న పోలీసులు శంకర్‌ని అరెస్ట్‌ చేసి తీసుకెళతారని తాను స్వేచ్ఛగా ఉండొచ్చనుకుంటాడు.

అదే సమయానాకి శీనుని శంకర్‌ అనుకుని కలెక్టర్‌ 25లక్షల చెక్‌ ఇస్తాడు. డబ్బుమీద ఆశతో తానే శంకర్‌ అని నమ్మించాలని చూసిన శీనుకి అనేక విషయాలు అర్థమవుతాయి. శంకర్‌ ఒక ఊరి బాగుకోసం పోరాడుతున్నాడని శంకర్‌కోసం ఆరుగురు రైతులు ఆత్మాహుతి చేసుకున్నారని తెలిసి చలించిపోయి తానే ఆ ఊరి బాగుకోసం, కార్పోరేట్‌ విలన్‌ బారి నుంచి రైతుల్ని కాపాడ్డానికి పూనుకుంటాడు.

ఇక్కడితో ఇంటర్వెల్‌. సెకెండాఫ్‌లో శంకర్ ఏమయ్యాడు? కథకి ముగింపు ఏమిటన్నది తెలుస్తుంది.

రైతులకి సంబంధించిన ఎమోషనల్‌ సన్నివేశాల్లో చిరంజీవి కంటతడి పెట్టిస్తాడు. కామెడిసీన్స్‌లో నవ్విస్తాడు. ఆలీ, బ్రహ్మానందం, పోసాని సపోర్టింగ్‌ కామెడీ చేశారు. బ్రహ్మానందం చాలాకాలం తరువాత కనిపించాడు. హీరో చేతిలో ఫూల్‌ అయ్యే అదే ఓల్డ్‌ కామెడీ. అమ్మాయితో ఉన్నపుడు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం సెల్‌ఫోన్‌లో కెమెరాలు పుట్టినప్పటి పాత కామెడీ. కొత్తగా ఏమి ఆలోచించాలో తెలియక నటులు ఉద్దండులు కాబట్టి సర్దుకుపోయినట్టున్నారు.

హీరోయిన్‌ కాజల్‌ పాటల్లో డాన్స్‌ చేయడం తప్ప ఇక చేసిందేమి లేదు. అమ్మడు కుమ్ముడు పాట రాంగ్‌ ప్లేస్‌మెంట్‌. సినిమా సీరియస్‌గా ఉన్నపుడు అనవసరంగా ఫ్యాన్స్ కోసం వచ్చి అడ్డుపడుతుంది. నీళ్ళగొట్టంలో నిరసన దీక్ష చేస్తూ కూడా హీరోయిన్‌ విదేశీపాటని కలగంటుంది. ఈ పాటలో రాంచరణ్‌ కూడా కనిపిస్తాడు. రైతు ఉద్యమకారుడిగా చిరంజీవి పాత్రని ప్రేమిస్తున్నపుడు రాంచరణ్‌ కనిపించి ఆయన చిరంజీవని మనకి గుర్తుచేస్తాడు. పాత్రలోకి ప్రేక్షకుల్ని లీనం కాకుండా చేయడంలో మన తెలుగు సినిమాల సక్సెస్‌ రేట్‌ చాలా ఎక్కువ.

సాయిమాధవ్‌, వేమారెడ్డి డైలాగులు బావున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ పాటలు, రత్నవేలు ఫొటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తం మీద చిరంజీవి 150వ సినిమా సగటు ప్రేక్షకున్ని నిరాశపరచదు.

ఇంతసేపు హీరో చిరంజీవి గురించి మాట్లాడుకున్నాం. ఇపుడు రాజకీయనాయకుడు చిరంజీవి గురించి మాట్లాడుకుందాం. రాజకీయాల్లోకి ఎందరో నటులు వచ్చారు వెళ్ళారు. అయితే నలుగురి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్‌, జయలలిత, చిరంజీవి.

అమితాబ్‌, కృష్ణ, కృష్ణంరాజు, జమున, హేమమాలిని ఇలా ఎంతోమంది సినీప్రముఖులు రాజకీయాల్లో పదవులు అనుభవించారు, తరువాత విరమించారు. హేమమాలిని ఇప్పుడు కూడా పార్లమెంట్‌ సభ్యురాలే కానీ ఆమె ఎన్నడూ నోరెత్తి మాట్లాడగా చూసినవాళ్ళు లేరు. పార్టీల్లో చేరి నాయకులైన వారి సంగతి పక్కన పెడితే ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్‌, జయలలిత ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంచుకున్నదారిని వదలలేదు. పార్టీని బతికించారు, ముఖ్యమంత్రులయ్యారు.

అయితే చిరంజీవి వీళ్ళకి భిన్నం. ఆయనకూడా కాంగ్రెస్‌లోనో బిజెపిలోనో నేరుగా చేరి పదవిని పొందివుంటే ఎవరికీ ఎలాంటి ఆక్షేపణా లేదు. కానీ రాష్ట్రమంతటా ఒక పోరాట స్ఫూర్తి రగిలించి పార్టీపెట్టి, ఏదో చేస్తాడని ప్రజల్లో ఆశలు కల్పించాడు. గెలుపోటములు సహజం అనుకుని ఆయన ప్రజల్లోనే ఉండి పార్టీని బతికించుకుని ఉంటే 2014లో ఆయన ముఖ్యమంత్రిగానో, ప్రధాన ప్రతిపక్షనాయకుడిగానో ఉండేవాడు. ప్రజల పక్షాన సినిమాల్లోలాగే పోరాడి ఉంటే ప్రజలే ఆయన్ని నెత్తిన పెట్టుకుని ఉండేవారు. కానీ ఆయన వెనుకంజ వేశాడు. హీరోగా ఆయన్ని ఇంకా జనం కొటుస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణ ఖైదీ 150 ఓపెనింగ్సే. కానీ నాయకుడిగా అపఖ్యాతి మూట కట్టుకున్నాడు.

కేంద్రమంత్రిగా రెండు రాష్ట్రాలకీ ఏమీ చేయకుండా ప్రతి ఏటా వ్యవసాయానికి బడ్జెట్‌ తగ్గిస్తూ ఉంటే రాజ్యసభలో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఆయన ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూవుంటే రైతుల గొంతుని ఏనాడు వినిపించని చిరంజీవి రైతుల గురించి కంటతడి పెట్టించే డైలాగులు చెబుతూ ఉంటే ఎక్కడో కలుక్కుమంటోంది. నటనవేరు, నాయకత్వం వేరని సరిపుచ్చుకోవాల్సిందేనా?

నేను ఖైరతాబాద్‌లోని సెన్సేషన్‌ థియేటర్‌లో ఖైదీ 150 సినిమా చూశాను. పార్కింగ్‌ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరనుంచి, సమోసాలు అమ్మేవాళ్ళవరకూ అందరిలో ఆనందం. నాలుగు డబ్బులు కళ్ళచూసే ఆనందం. ఆ వీధిలో ఉన్న అన్ని దుకాణాల్లోనూ అదే కళకళ. బహుశా రాష్ట్రంలోని అన్ని ఊళ్ళలో ఇదే పరిస్థితి ఉంటుంది. సినిమాలతో ఇంతమందిని ఆనందపరిచే చిరంజీవి, ప్రజల నిజమైన సమస్యలను గొంతెత్తి నినదించివుంటే లక్షలాది మంది సంతోషించే వాళ్ళు. కోట్లమందిలో ఒక్కడికే చరిత్ర అవకాశమిస్తుంది. అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్న ఆయన చరిత్రలో అలా మిగిలిపోయారు.

-జి.ఆర్‌.మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 13 =