My title

ఘర్షణ మాని…. జనంలోకి….

ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వం అభివృద్ధి దిశ‌గా దూసుకుపోతున్న‌ది. ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వంతో విభేదాల‌కు స్వ‌స్థి పలికిన ఆయ‌న త‌న దృష్టినంత‌టినీ ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌వైపు సారిస్తున్నారు. విద్యారంగంలో స‌మూల మార్పులు చేసిన అర‌వింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆరోగ్యం, మంచినీరు వంటి అంశాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు. పాల‌కులు చిత్త‌శుద్ధితో ప‌నిచేయ‌డంతో ప్ర‌జ‌లు కూడా సంతోషంతో ఉన్నారు. అందుకే ఇటీవ‌ల బ‌వానా నియోజ‌క వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్ది ఘ‌న విజ‌యం సాధించింది. పంజాబ్‌, గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత అర‌వింద్ కేజ్రీవాల్ ఆలోచ‌న‌లో స్ప‌ష్ట‌మైన మార్పు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.   సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళితే వారు త‌మ ప‌క్షానే ఉంటార‌ని ఆయ‌నకు పూర్తిగా అర్ధ‌మ‌యింది.

తాగునీటికి ప్రాధాన్య‌త‌

2013-14 లో 49 రోజుల పాటు ఢిల్లీని ఏలిన కేజ్రీవాల్ త‌న వ‌ద్ద 5 శాఖ‌ల‌ను ఉంచుకున్నారు. పవ‌ర్‌, ప్లానింగ్‌, విజిలెన్స్‌,ఫైనాన్స్, హోం వంటి అతి కీల‌క‌మైన శాఖ‌ల‌ను ఆయ‌న నిర్వ‌హించారు. 2015లో రెండో సారి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత త‌న వ‌ద్ద ఒక్క‌శాఖ‌ను కూడా ఉంచుకోలేదు. కేవ‌లం సీఎంగా ఉన్నారు. ఇటీవ‌ల బ‌వానా బైపోల్స్‌లో విజ‌యం సాధించిన అనంత‌రం ఆయ‌న మంచినీటి శాఖ‌ను తీసుకున్నారు. ఢిల్లీ జ‌ల్ బోర్డ్‌కి చైర్మ‌న్‌గా కూడా ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఢిల్లీలో ఉన్న అన్ని కాల‌నీల‌కు కొర‌త లేకుండా తాగునీటిని అందించాల‌నే ఉద్దేశ్యంతోను, ఢిల్లీ జ‌ల్‌బోర్డ్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రిచేసేందుకు ఆయ‌న సిద్ధం అయ్యారు. అందుబాటు ధ‌ర‌ల‌కే తాగునీటిని అంద‌రికీ అందిస్తామ‌ని 2015 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మ‌రోవైపు ఇంటి అవ‌స‌రాల కోసం ప్ర‌స్తుతం ప్ర‌తి ఇంటికి 20,000 లీట‌ర్ల నీటిని ఉచితంగా అందిస్తున్నారు. అదే విధంగా వాట‌ర్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని కూడా కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు కొత్త సైన్యాన్ని ఆయ‌న సిద్ధం చేస్తున్నారు.

మంచి ఫ‌లితాలిస్తున్న మొహ‌ల్లా క్లీనిక్కులు

విద్యారంగం, తాగునీటి రంగం త‌ర్వాత కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఆరోగ్య రంగంపై దృష్టి సారించింది. సామాన్య‌లంద‌రికీ అతి తక్కువ ధ‌ర‌ల‌కే వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మొహ‌ల్లా క్లీనిక్కులు అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం 162 మొహ‌ల్లా క్లీనిక్కులు ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సంఖ్య 450కి చేర‌నుంది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ్వాల్ కూడా ఈ మెహ‌ల్లా క్లీనిక్కుల ప‌ట్ల ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. దీనికి సంబందించిన అనుమ‌తుల‌ను వెంట‌నే మంజూరు చేశారు.

అగ్ర నేత‌ల నుంచి ప్ర‌శంస‌లు

ఢిల్లీ ప్ర‌భుత్వం ప్రారంభించిన మొహ‌ల్లా క్లీనిక్కులు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఐక్య‌రాజ్య స‌మితి మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కోపీ అన్న‌న్, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్ట‌ర్ గ్రో హార్లెమ్‌లు ఈ మొహ‌ల్లా క్లీనిక్కుల ద్వారా అందుతున్న సేవ‌ల‌ను ప్ర‌శంసించారు.