My title

దసరా రోజున క‌మ‌ల్ హాస‌న్ కొత్త పొలిటిక‌ల్ పార్టీ?

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నాడు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. త్వ‌ర‌లోనే ఓ రాజ‌కీయ పార్టీని స్థాపించ‌నున్నాడు. గాంధీ జ‌యంతి రోజున గానీ…ద‌సరాకు గానీ పార్టీ పేరును వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏ ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకోకుండానే న‌వంబ‌ర్‌లో జ‌రిగే స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఉన్న ప‌రిస్థితులు త‌న రాజకీయ అరంగేట్రానికి స‌రైన స‌మ‌యంగా క‌మ‌ల్ భావిస్తున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు తెలియ‌జేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ శూన్య‌త‌ను భ‌ర్తీ చేయ‌డానికి ఇంత‌కంటే మంచి స‌మ‌యం ఉండ‌ద‌ని గుర్తించిన క‌మ‌ల్ అన్ని విధాలుగా స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న అభిమాన సంఘాల‌లో కీల‌క వ్య‌క్తుల‌ను ఇప్ప‌టికే క‌లిసి త‌న అభిప్రాయాల‌ను వారితో పంచుకున్నారు.

త్వ‌ర‌లో మ‌రింత క్లారిటీ

న‌వంబ‌ర్‌లో జ‌రిగే స్థానిక ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటేందుకు పూర్తి అవ‌కాశం ఉంద‌ని క‌మ‌ల్ వ‌ర్గీయులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి తాలూకాలోనూ క‌మ‌ల్‌కు అభిమాన సంఘాలు, వీరాభిమానులు ఉన్నారు. వారిని ఎన్నిక‌ల బ‌రిలో దించి గ్రాండ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌ని విశ్వ‌న‌టుడు ప్లాన్ చేస్తున్నాడు. సెస్టెంబ‌ర్ 15, సెప్టెంబ‌ర్ 17న క‌మ‌ల్ హాస‌న్ రెండు వేర్వేరు కార్య‌క్ర‌మాల్లో పాల్గోనున్నారు. ఈ సంద‌ర్భంలో పార్టీపై మ‌రింత క్లారిటీ రానుంది.

ఇటీవ‌ల కొంత కాలం నుంచి వామ‌ప‌క్షాల నాయ‌కుల‌ను క‌లిసి త‌న పొలిటిక‌ల్ ప్లాన్ వారితో చ‌ర్చించిన‌ట్లు క‌మ‌ల్ స‌న్నిహితులు తెలిపారు. సెస్టెంబ‌ర్ 1 వ తేదీన కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌ను క‌లిసిన సంద‌ర్భంలో ఆయ‌న సీపీఎంలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంలో నిజం లేద‌ని ప్ర‌స్తుతం తేలింది. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో క‌మ‌ల్ ఏదో ఒక పార్టీలో చేర‌తార‌ని అంద‌రూ భావించారు. వారి అంచ‌నాల‌కు భిన్నంగా ఏకంగా ఒక కొత్త రాజ‌కీయ పార్టీని స్థాపిస్తున్నార‌ని తెలియ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యంలో మునిగిపోయారు. క‌మ‌ల్ సొంత పార్టీ పెట్టి ఏమీ సాధించ‌లేరని…ఏదో ఒక పెద్ద‌ పార్టీలో చేర‌డం మంచిద‌ని కొంద‌రు విశ్లేష‌కులు అంటున్నారు.

రాజ‌కీయాల్లో సినిమా స్టార్లు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సినిమా స్టార్లు ప్ర‌వేశించ‌డం చాలా కాలం నుంచి జ‌రుగుతూనే ఉంది. కరుణానిధి, ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత‌, విజ‌య్‌కాంత్  త‌మిళ‌నాట త‌మ‌దైన ముద్ర‌ను వేయ‌గ‌లిగారు. క‌మ‌ల్ హాస‌న్ ఏ స్థాయిలో రాణిస్తాడో రానున్న రోజులే చెప్ప‌నున్నాయి.