My title

జేసీ వ్యాఖ్యలతో కంగుతిన్న బాబు..

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరు టీడీపీకి ఓపంథాన అంతుచిక్కడం లేదు. జేసీ టీడీపీని పొగుడుతున్నారా లేక హేళన చేస్తున్నారా అన్న విషయం అర్థం కావడం లేదు. మూడు రోజుల క్రితం అమరావతి నిర్మాణంపై చంద్రబాబుకు  అవగాహన లేదని నేరుగా మంత్రి నారాయణ ముఖం మీదే చెప్పేసిన జేసీ దివాకర్‌ రెడ్డి… తాజాగా అనంతపురం జిల్లా పామిడి బహిరంగసభలో చంద్రబాబు సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు మరో గతిలేకే టీడీపీలో చేరానని చంద్రబాబు సమక్షంలోనే చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. అంతేకాదు పరోక్షంగా జగన్‌తో కలిసి ఉండాలన్న తన మనోగతాన్ని బయటపెట్టారు. తనకూ కొంచెం కులాభిమానం ఉందని, తనకు కూడా జగన్‌ పక్కనే ఉండాలని ఉందన్నారు. కానీ జగన్ ఏమీ చేయలేడన్న భావనతోనే టీడీపీలో చేరానన్నారు. అటు కాంగ్రెస్‌ చూస్తే చచ్చిపోయిందని అందుకే మరో గతిలేక టీడీపీలో చేరానన్నారు.

జేసీ వ్యాఖ్యలతో అందరూ టీడీపీని పొగిడారా లేక గతిలేక ఈ పార్టీలోకి వచ్చానని ఆవేదన చెందారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జేసీ వాలకం చూస్తుంటే మరోదారి లేక టీడీపీలో ఉన్నట్టుగా ఉందని, వైసీపీ నుంచి సరైన హామీలు వస్తే ఈయన ఎప్పటికైనా ఆ గూటికి చేరే పక్షేనని టీడీపీ నేతలు గుసగుసలాడుకున్నారు. అంతేకాదు పోలవరం విషయంలోనూ జేసీ కుండబద్దలు కొట్టారు. 2019కి పోలవరం పూర్తి అయ్యే పని కాదన్నారు. చంద్రబాబు మరీ ఎక్కువగా కలలు కంటున్నట్టుగా ఉందని చంద్రబాబు సమక్షంలోనే ఆయన ముఖం మీదే చెప్పేశారు జేసీ. చంద్రబాబు చాలా కలలు కంటున్నారని… అవి ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదన్నారు జేసీ. మొత్తం మీద జేసీ దివాకర్‌ రెడ్డికి ఏమూలనో వైసీపీపైన, జగన్‌పై  సానుకూలత, సానుభూతి ఉందన్న అభిప్రాయాన్ని సభకు హాజరైన వారు వ్యక్తం చేశారు.