My title

కాంగ్రెస్ కు ఓటేయమంటున్న జలీల్‌ ఖాన్

సీరియస్‌గా నంద్యాలలో ముస్లిం ఓటర్లను ఆకర్షించాల్సిందిగా చంద్రబాబు పంపిస్తే… జలీల్‌ఖాన్ మాత్రం అక్కడా కామెడి చేస్తున్నారు. ఇప్పటికే బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్‌ ఖాన్… ఆ మధ్య కాంగ్రెస్‌కు, టీడీపీకి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పి ఆయా పార్టీల అధినేతలకే షాక్‌ ఇవ్వబోయారు. ఇప్పుడు లేటెస్ట్‌గా నంద్యాలలోనూ ఆయన ప్రచారం రొటీన్‌కు భిన్నంగా, గంభీర వాతావరణాన్ని చెదరగొడుతూ సాగుతోంది. ఆయన చెబితే ఓట్లేస్తారో లేదో గానీ.. జలీల్‌ ఖాన్ అనగానే ”బీకాంలో ఫిజిక్సా” అంటూ జనం చూసేందుకు వస్తున్నారు. అయితే ప్రచారంలో జలీల్‌ ఖాన్ నోరు జారారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నేతలతో సహా అందరూ బిత్తరపోయారు. వెంటనే ఏదో తేడాగా మాట్లాడేశానని గ్రహించిన ఖాన్… గొంతు సవరించుకుని సైకిల్‌కు ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు. పనిలో పనిగా జగన్‌ను నాలుగు మాటలు అనేశారు. నెత్తిన చేతులు పెట్టడం, ముద్దులు పెట్టడం తప్ప జగన్‌ చేసేది ఏమీ ఉండదని బీకాం ఫిజిక్స్ ఖాన్ ఎద్దేవా చేశారు.