My title

జై లవకుశ మూవీ రివ్యూ

రివ్యూ: జై లవకుశ

రేటింగ్‌:   2.5 /5

తారాగణం: ఎన్టీఆర్‌, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, సాయికుమార్‌, ప్ర‌దీప్ రావ‌త్‌, తదిత‌రులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

నిర్మాత:  క‌ల్యాణ్‌రామ్‌

దర్శకత్వం: కె.ఎస్‌. ర‌వీంద్ర‌

టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ మూవీస్ చాలా కామన్ కానీ ట్రిపుల్ రోల్ మాత్రం చాలా అరుదు. అప్పుడెప్పుడో చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు చేసి చేదు ఫలితం అందుకున్నాక మళ్ళీ ఇంకెవరు ఆ సాహసం చేయలేదు. స్టార్ హీరోలు ఒక పాత్ర ఉన్న కథలు దొరక్కే ఇబ్బంది పడుతూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అదే పనిగా ఛాలెంజింగ్ గా తీసుకుని మరీ చేసిన మూవీ జై లవకుశ. అర్జున్ రెడ్డి తర్వాత సరైన సక్సెస్ లేక స్తబ్దుగా ఉన్న బాక్స్ ఆఫీస్ ఈ సినిమాతోనే కళకళగా కనిపిస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకుని వచ్చిన మూవీ కావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కూడా యమా ఉత్సాహంగా థియేటర్ల దగ్గర హడావిడి చేస్తున్నారు. మరి జై లవకుశలు అంచనాలు అన్ని అందుకున్నారా లేక మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయ్యారా చూద్దాం.

కథ మరీ కొత్తది ఏమి కాదు. కొత్తదనం అంతా ఒక్క జై పాత్రలో మాత్రమే ఉంది. మిగిలినదంతా రొటీన్ వ్యవహారమే. అనగనగా చిన్నప్పుడు విడిపోయిన ముగ్గురు కవలలు. ఒకడు చెడ్డవాడిగా, ఒకడు మంచివాడిగా, ఒకడు దొంగగా దూర దూరంగా పెరుగుతారు. వాళ్ళే జై, లవ అండ్ కుశలు. లవకు కుశకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా సడన్ గా ఆ ఇద్దరినీ జై కిడ్నాప్ చేస్తాడు. కారణం తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ ఊరిలో ఉన్న విలన్స్ వల్ల సమస్యలు వస్తుంటాయి. మరి జై మంచివాడిగా మారాడా లేదా, ముగ్గురు అన్నదమ్ములు కలిసి విలన్స్ భరతం ఎలా పట్టారు అనేది మిగిలిన స్టొరీ.

ఇది ముమ్మాటికి ఎన్టీఆర్ మాత్రమే చేయగలిగే పాత్ర. అందులో అనుమానం అక్కర్లేదు. మిగిలిన స్టార్ హీరోలకు ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి. కాని ఎన్టీఆర్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎంత బరువున్న పాత్ర ఇస్తే అంత తేలిగ్గా దాన్ని ఓన్ చేసుకోవడం. సరిగ్గా ఇందులో జై పాత్ర కోసం అలాగే కష్టపడ్డాడు. అవుట్ పుట్ కూడా అలాగే వచ్చింది. నత్తితో డైలాగులు చెబుతూ ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టే పాత్రలో చెలరేగిపోయాడు. జై ఎఫెక్ట్ వల్ల లవ, కుశ గురించి ఆలోచించడానికి అంతగా మనసు ఒప్పదు. అంతగా జై మనసులు గెలిచేస్తాడు. హీరొయిన్స్ రాశి ఖన్నా, నివేదా థామస్ చెప్పుకోదగ్గ పాత్రలు కాదు. గ్లామర్ కోసం తప్ప పెద్దగా ఉపయోగపడలేదు. పోసాని, బ్రహ్మాజీ జస్ట్ ఓకే కామెడీ చేస్తే ప్రదీప్ రావత్, అభిమన్యు సింగ్ బ్యాచ్ విలనీ తమను అలవాటైన రీతిలో పండించారు.

దర్శకుడు బాబీ, సర్దార్ గబ్బర్ సింగ్ చేదు ఫలితం తరువాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన మూవీగా ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. కాని ఫోకస్ మొత్తం జై పాత్ర ఒక్క దాని మీదే పెట్టడంతో మిగిలిన పాత్రల బలం తగ్గి మూడు పాత్రలు ఉన్నా సరే రావాల్సిన కిక్ రాలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కుశ పాత్రతో బోలేదు కామెడీకి స్కోప్ ఉన్నా ఆ యాంగిల్ లో బాబీ దృష్టి పెట్టలేదు. పైగా ముగ్గురు అన్నదమ్ములు కలుసుకోవడం చాలా మామూలు వ్యవహారంలా అనిపించడం స్క్రీన్ ప్లే లోపమే. దుర్మార్గుడైన జై లో మార్పు రావడం, తమ్ముళ్ళు ఇద్దరు చాలా ఎమోషనల్ గా ఫీల్ కావడం కనెక్ట్ కాదు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా తీసేసుకుంటూ పోయాడా అని అనిపిస్తుంది ఒక మూమెంట్ లో. కాని తారక్ ఆ ఆలోచన ప్రేక్షకుల మనసులోకి రానివ్వకుండా మొత్తం మేనేజ్ చేసే ప్రయత్నం చేసాడు. జై పాత్ర ఇంకా బలంగా రాసుకుని బ్రదర్స్ సెంటిమెంట్ బాగా పండించి ఉంటే సినిమా హాల్స్ విజిల్స్ తో దద్దరిల్లిపోయేవి. కాని బాబీ అంత అవకాశం ఇవ్వలేదు. కాని జై లవకుశ అలా అని తీసిపారేసే బాపతు కాదు. మరీ విసిగించకుండా వీలైనంత ఎంగేజ్ చేసే ప్రయత్నమే చేసాడు బాబీ. మొదటి సారి చూసినప్పుడు బోర్ కొట్టే అవకాశాలు తక్కువ. దేవి శ్రీ ప్రసాద్ మరీ స్పెషల్ అనిపించే మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. రావణ ట్రాక్ తప్ప మిగిలినవన్నీ ఎక్కడో ఒక చోట విన్నట్టు ఫీలింగ్ ఇస్తాయి. చోటా కెమెరా బాగుంది. కోటగిరి ఎడిటింగ్ పదునుగా లేదు. కళ్యాణ్ రామ్ కళ్ళు చెదిరే బడ్జెట్ పెట్టలేదు. రిచ్ గా కనిపించేలా మాత్రం జాగ్రత్తలు తీసుకున్నాడు.

చివరిగా చెప్పాలంటే జై లవకుశ సినిమా ఎన్టీఆర్ లో పూర్తి భిన్నమైన కోణం కలిగిన నటుడు ఉన్నాడు అని నిరూపించే సినిమా. ట్రైలర్ ను బట్టి మరీ అతిగా ఊహించుకోకుండా వెళ్తే ఎన్టీఆర్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తో హ్యాపీగానే బయటికి రావొచ్చు. ముగ్గురు ఎన్టీఆర్ లు ఉన్నారు కదా ఏదేదో ఉంటుంది అని మితి మీరిన అంచనాలు పెట్టుకుంటే మాత్రం బాబీ అడ్డుపడతాడు. కాచుకోవడానికి తారక్ ఉన్నాడు లేండి. ముగ్గురు ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేంలో చూడటం నయనానందకరంగా ఉంటుంది. అలాగే మూడు వేరియేషన్స్ ని చక్కగా బాలన్స్ చేసిన యంగ్ టైగర్ కోసమే చూడవలసిన సినిమా జై లవకుశ.