My title

అసహనం ప్రజలకు ఉండొచ్చు… ప్రభుత్వానికి కాదు!

( ఇంటూరి రవికిరణ్ అరెస్టుపై  ప్రముఖ రచయిత సురేష్ ప్రతిస్పందన ఇది )

ప్ర‌భుత్వం మీద‌, త‌న మీద‌ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌ పేర‌డీలు, సెటైర్ల మీద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అలాంటివారిని జైళ్ల‌కు పంపిస్తామ‌ని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్న‌ట్లుగా మీడియాలో వార్త‌లొస్తున్నాయి. వీటిలో నిజానిజాల్ని ప‌క్క‌న‌పెడితే … ఇలా చ‌ర్య‌లు తీసుకోవాల‌నే భావ‌నే అప్ర‌జాస్వామిక చ‌ర్య‌గా గుర్తించాల్సివ‌స్తుంది. రాజ్య‌వ్య‌వ‌స్థ‌లో పాల‌కులు త‌ప్పులు చేస్తున్న‌ప్పుడు వాటిని ఎండ‌గ‌ట్ట‌డానికి జ‌నం ప‌లు మార్గాల‌నెంచుకుంటారు. వీటిలో పాట‌లు పాడ‌డం, స్కిట్స్ ప్ర‌ద‌ర్శించ‌డం, పేర‌డీలు చేయ‌డం ఇవ‌న్నీ భాగ‌మే! వీటిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మంటే … నోరెత్తిన‌వాడి మీద రాజ్యం చేసే జులుం లాంటిదే!

ప్ర‌భుత్వం ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగానే వుండాలి త‌ప్ప‌, వారి భావావేశాల్ని ఎన్న‌టికీ నియంత్రించ‌లేదు. నిజానికి రాజ్య‌వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేది, ప్ర‌భుత్వాల‌ను స‌రైన దారిలోకి న‌డిపించేది కూడా జ‌నం నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌లూ, అభిప్రాయాలే. ప్ర‌భుత్వాల్ని ప్ర‌జ‌లు బాహాటంగా విమ‌ర్శించ‌డం, ర‌చయిత‌లు, క‌ళాకారులు ఎలుగెత్తి చాట‌డం ఇప్పుడు కొత్త‌గా మొద‌లైందేమీ కాదు. నెహ్రూ, ఇందిరాగాంధీలు ప్ర‌ధాన‌మంత్రులుగా వున్న‌ టైమ్‌లో శంక‌ర్ త‌న కార్టూన్ల‌తో వారిని ఏకిపారేసేవాడు. ఇందిర హ‌యాంలో బాల్‌థాక‌రే చేసిందీ అదే! బ‌ల‌మైన విమ‌ర్శ‌, నిజాయితీతో చేసే విమ‌ర్శ‌కు భీతి చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అబ్ర‌హాం లింక‌న్ చెప్తారు.

మీడియా సంస్థ‌ల‌న్నీ ఏదో ఒక పొలిటిక‌ల్ పార్టీకి క‌నెక్ట్ అయివున్న ఈరోజుల్లో జ‌నం సోష‌ల్ మీడియాను ప్ర‌త్యామ్నాయ మీడియాగా పరిగ‌ణిస్తున్నారు. అంతేకాదు, త‌మ అభిప్రాయాల‌ను త‌మ వాల్స్ మీద నేరుగా చెప్పుకోగ‌ల అవ‌కాశమూ వారికి దొరికింది. కొంద‌రు దీనిని విలువైన విమ‌ర్శ‌ల‌కు, ప‌రిష్కార‌మార్గాలు సూచించ‌డానికి ఉప‌యోగించుకుంటుంటే, మ‌రికొంద‌రు కువిమ‌ర్శ‌ల‌కు, త‌మ మ‌న‌సుల్లోని క‌ల్మ‌షాల‌ను వ‌దిలించుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటున్నారు. ఇంకొంద‌రైతే త‌మ ప్ర‌తి అస‌హ‌నాన్నీ ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా క‌క్కేయ‌డానికి కూడా దీనినే వాడుకుంటున్నారు. క‌త్తిని కూర‌గాయ‌లు త‌ర‌గ‌డానికీ, పీక‌లు కోయ‌డానికీ ఎలా వాడుకోవ‌చ్చో సోష‌ల్ మీడియాను కూడా అంతే వాడుతున్నారు. అయితే, జ‌నానికి త‌మ అభిప్రాయాల్ని న‌లుగురితో పంచుకోవ‌డానికి ఒక బ‌ల‌మైన వేదిక దొరికిన వాస్త‌వాన్ని మాత్రం గుర్తించాలి.

స‌మాజంలో మంచి లేకుండా చెడు లేదు; చెడు లేకుండా మంచి లేదు. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసుకోగ‌ల శ‌క్తి మ‌న ప్ర‌జ‌ల‌కు వున్న‌ప్పుడు …. ఖ‌చ్చితంగా వారి ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌ల‌ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. కానీ, ప్ర‌జ‌ల్ని కులాలుగా, మ‌తాలుగా, రాజ‌కీయ వ‌ర్గాలుగా చీల్చి, దొంగాట‌లాడుతున్న‌ ప్ర‌భుత్వాలు, పార్టీలు – ఇప్పుడు త‌మ‌దాకా రాగానే తూచ్ అన‌డం ఎలా వీల‌వుతుంది? ప‌్ర‌జ‌ల్లో పెరుగుతున్న అస‌హ‌నాల‌కు, రాజ‌కీయ‌ రంజాట‌ల‌కు తామే కార‌ణ‌మ‌ని వారెందుకు మ‌ర్చిపోతున్నారు?

మ‌రోవైపు లోకేష్ ఇటువంటి నిర్ణ‌యానికి రావ‌డం వెనుక అత‌ని కోణాన్ని కూడా త‌ప్ప‌కుండా చూడాలి. లోకేష్ చంద్ర‌బాబు నాయుడు కొడుకు కావ‌చ్చు; అమెరికాలో చ‌దువుకుని వ‌చ్చివుండొచ్చు. రాజ‌కీయ అనుభ‌వ శూన్య‌త వుండొచ్చు. రోజూ త‌డ‌బడుతూవుండొచ్చు. కానీ, అత‌ని త‌ప్పుల్ని మాత్ర‌మే వెతుకుతూ రాయ‌డం స‌రికాద‌ని నా అభిప్రాయం. ఇప్ప‌టిదాకా పార్టీ వ్య‌వ‌హారాల్లో కార్య‌క‌ర్త‌ల‌తో మాత్ర‌మే సంబంధాలు నెరిపిన లోకేష్ నేరుగా జ‌నం లోకి వెళ్ల‌డం ఇదే మొద‌లు కాబ‌ట్టి, త‌డ‌బాటు ప‌డ‌డానికి ఖ‌చ్చితంగా అవ‌కాశ‌ముంది. జ‌నంలో తిర‌గ‌కుండా, న‌లుగురిలో నల‌గ‌కుండా రాజ‌కీయాల్లో ఎద‌గ‌డం అసాధ్యం. ఓ ఏడాది, రెండేళ్ల అనుభ‌వాల త‌రువాత కూడా అత‌నిలో ఇదే పంథా వుంటే …. లోకేష్‌ని కూడా రాహుల్‌తో పోల్చినా అర్థ‌ముంటుంది. లోకేష్ త‌ప్పుల మీద అటు మీడియా, ఇటు సోష‌ల్ మీడియా ఓ ఆరునెల‌లు స్వీయ మార‌టోరియం విధించుకుంటే బావుంటుందేమో!

ఇదే స‌మ‌యంలో రెండు విష‌యాలు లోకేష్ గుర్తుంచుకోవాలి. జ‌నం బ‌ల‌మైన మ‌రో ప్ర‌త్యామ్నాయం లేకనే ఆ రెండు పార్టీల‌ను ప‌ట్టుకుని వేలాడుతున్నారు త‌ప్ప వారు బిచ్చ‌గాళ్లు కాదు; రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త‌, స్వేచ్ఛాభిలాష లేనివాళ్లు అంత‌కంటే కాదు. 1977లో దేశ‌వ్యాప్తంగా జ‌నం కాంగ్రెస్‌కి చూపించిన దెబ్బను గుర్తుచేసుకోవాలి. 1982లో మీ తాత ఎన్‌టిఆర్ గెల‌వ‌డం కూడా ఇలాంటి దెబ్బ‌ల్లో భాగ‌మేన‌ని తెలుసుకోవాలి! కాబ‌ట్టి, ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది చ‌ట్టాల్ని ఎలా ఉప‌యోగించాలా అని కాదు; ఎందుకు ఉప‌యోగించాలా అని.

దాదాపు న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయానుభ‌వం వున్న మీ నాన్నే ఎప్పుడూ ఇలాంటి పిరికిపంద చ‌ర్య‌ల‌కు దిగ‌లేదు. రేప‌టి రాజ‌కీయాల‌కు ప్ర‌తినిధిగా మారాల‌నే ఆకాంక్ష మీలో నిజంగా వుంటే ….. మీరు మ‌రింత మాన‌సిక ప‌రిణ‌తి సంపాదించుకోవాలి. మీ వెనుక వున్న బ‌లం మీ నాన్న మాత్ర‌మే! ఇప్పుడు కులం కూడా ఒక బ‌లం కావ‌చ్చు; కానీ, ఆయ‌న లేనప్పుడు మిమ్మ‌ల్ని ఈ కులం ఏ రూపంలోనూ కాపాడ‌లేదు. మీ సొంత‌పార్టీయే మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోని స్థితి ఏర్ప‌డుతుంద‌న్న స‌త్యం గ్ర‌హించాలి.

ప్ర‌భుత్వాల మీద కావ‌చ్చు; వ‌్య‌క్తుల మీద కావ‌చ్చు … సోష‌ల్ మీడియాలో రాసేట‌ప్పుడు స్వీయ‌నియంత్ర‌ణ‌ను మించింది లేదు. మ‌న అభిప్రాయాల్ని ఎంత బ‌లంగా చెప్పుకుంటామో, ఇత‌రుల అభిప్రాయాల‌ను కూడా అంతే బ‌లంగా గౌర‌వించాల్సివుంటుంది. అభిప్రాయాల్ని వ్య‌క్తం చేయ‌డంలో స‌హ‌నం కోల్పోయిన‌ప్పుడు, దుర్భాష‌ల‌కు దిగిన‌ప్పుడు చ‌ర్య‌ల‌కు వెళ్లే హ‌క్కు అంద‌రికీ వుంటుంది. అది లోకేష్‌కి కూడా వుంటుంది. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి, ప‌రువుకూ భంగం క‌లుగుతోంద‌ని భావించిన‌ప్పుడు వ్య‌క్తిగ‌తంగా అత‌ను చ‌ర్య‌లకు వెళ్ల‌వ‌చ్చు; కానీ, ఒక మంత్రి హోదాలో అందుకు దిగ‌డం మాత్రం ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల‌ స్వేచ్ఛాభిలాష‌ను బంధించ‌డ‌మే అవుతుంది.

ప‌దేళ్ల క్రితం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ద‌క్క‌న్ క్రానిక‌ల్ కార్యాల‌యం ముందు నిర‌స‌న దీక్ష‌కు కూర్చున్న‌ప్పుడు మీడియాను దుమ్మెత్తిపోసిన ప్ర‌జ‌ల్ని ఒక‌సారి గుర్తుకు తెచ్చుకోవ‌డం ఈ స‌మ‌యంలో సంద‌ర్భోచితంగా వుంటుంది.