My title

ఆకలి రాజ్యం… సూచీలో అధమ స్థానం

మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంది.  ఇప్పటికీ దేశంలో ఆకలిని జయించని,  మూడుపూటల అన్న తినని కడుపులు ఎన్నో!. తాజాగా అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ విడుదల చేసిన నివేదికలో భారత్‌ ఇంకా ఆకలి రాజ్యంగానే అలమటిస్తోంది. మన కంటే బంగ్లాదేశ్, శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉంది. 119 వర్థమాన దేశాల ఆకలి సూచిలో భారత్‌ ఏకంగా వందో స్థానంలో ఉంది. ఆకలి సూచిలో 31.4 శాతంతో భారత్‌ ”తీవ్ర” స్థాయి కేటగిరిలో నిలిచింది. దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఐదో వంతు మంది సరైన ఆహారం లేక ఎత్తుకు తగిన బరువు లేరని నివేదిక స్పష్టం చేసింది. మూడో వంతు మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. దీనికి ప్రధాన కారణం సరైన ఆహారం లేకపోవడమేనని నివేదిక  చెబుతోంది.

జీహెచ్ఐ సూచీలో నేపాల్ 72వస్థానం, మయన్మార్ 77, బంగ్లాదేశ్‌ 88, శ్రీలంక 84, చైనా 29 స్థానాల్లో ఉన్నాయి. మన దేశం శ్రీలంక, బంగ్లాదేశ్‌ కంటే దారుణ స్థితిలో ఉండడం ఆందోళనకరం. చిలీ, క్యూబా, టర్కీవంటి దేశాలు ఆకలిని జయించి తొలిస్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని మొత్తం సంపదలో 50శాతానికి పైగా సంపద కేవలం ఒక శాతం వ్యక్తుల వద్దే ఉందని, ఆహార ఉత్పత్తిలో దేశం రెండో స్థానంలో ఉన్నా…. పోషకాహార లోపంతో బాధపడేవారు అధికంగా ఉండడం దురదృష్టకరమని అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఆవేదన చెందింది.