My title

జీతం బారెడు చదువు చారెడు

ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు జీటాలు ఎక్కువే. చైనాలో ఉపాధ్యాలుల వేతనాలకన్నా మన దేశంలో వారి జీతాలు నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నాయి. కాని విద్యార్థులు నేర్చుకుంటున్న దానితో పోల్చి చూస్తే చాలా నాసిరకంగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల మీద అంచనా కార్యక్రమం (పి.ఐ.ఎస్.ఎ.) అధ్యయనం ప్రకారం మొత్తం 74 దేశాలలో అధ్యయనం చేస్తే మన దేశం కింది నుంచి రెండవ స్థానంలో అంటే 73వ స్థానంలో ఉంది. చైనా పై నుంచి రెండవ స్థానంలో ఉంది.

ఆర్థిక సహకార అభివృద్ధి (ఒ.ఇ.సి.డి.) అధ్వర్యంలో పి.ఐ.ఎస్.ఐ. పదిహేనేళ్ల ప్రాయంగల విద్యార్థుల అధ్యయన స్థాయిపై వివరాలు సేకరిస్తుంది. గణితం, విజ్ఞాన శాస్త్రం, చదవగలగడం మొదలైన అంశాలలో విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తుంది.

విద్యా రంగం కోసం భారత ప్రభుత్వం పెట్టే ఖర్చులో 80 శాతం ఉపాధ్యాయుల జీతాలకు, శిక్షణకు సరిపోతోందని తేలింది. ఉత్తరప్రదేశ్ లో ఉపాధ్యాయులకు చెల్లించే వేతనాలు దేశ స్థూల ఉత్పత్తికి నాలుగైదు రెట్లు, ఉత్తరప్రదేశ్ స్థూల ఉత్పత్తి కన్నా పదిహేను రెట్లు ఎక్కువ. ప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్య సేన్, జాన్ డ్రీజ్ ఉమ్మడిగా చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఒ.ఇ.సి.డి. దేశాలలోకన్నా, మన పొరుగు దేశాలకన్నా మన దేశంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువే ఉన్నాయి.

ఉపాధ్యాయుల వేతనాలు మెరుగ్గా ఉండకూడదన్నది వాదన కాదు కాని ఉపాధ్యాయులు తమ బాధ్యత నిర్వర్తించాలని, విద్యార్థులకు చదువు రావాలని కోరుకోవడం అత్యాశ కాదు.

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు సంఘటితంగా పోరాడి అధిక వేతనాలు సాధించగలిగిన అవకాశం, శక్తి ఉన్నాయి. ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు ఆ వీలు లేనందువల్ల వారికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. ఉద్యోగాలు దొరకని వారు తక్కువ జీతాలకైనా ప్రైవేటు పాఠశాలల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కనక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తక్కువ వేతనాలతో సరిపెట్ట గలుగుతున్నాయి.

విద్యా రంగంపై మరింత పెట్టుబడి పెట్టాలన్న వాదన చాలా రోజులుగా ఉంది. జాతీయ స్థూల జాతీయ ఉత్పత్తిలో భారత్ మూడు శాతం మాత్రమే పాఠశాల విద్య, కళాశాల విద్య కోసం ఖర్చు పెడుతోంది. బ్రిక్స్ దేశాలలో ఇంతకన్నా ఎక్కువ మొత్తం కేటాయిస్తున్నారు. రష్యా 3.8 శాతం, బ్రెజిల్ 5.2 శాతం, దక్షిణాఫ్రికా 6.9 శాతం విద్యా రంగానికి కేటాయిస్తున్నాయి.

విద్యారంగం మెరుగుపడడానికి ప్రభుత్వం పెట్టే ఖర్చు పెరగాలన్న విషయంలో భేదాభిప్రాయానికి తావు లేదు కాని అంత మాత్రం చేత విద్యారంగం మెరుగుపడుతుందన్న హామీ లేదు.