My title

ప్ర‌పంచంలో మ‌న‌ది మూడో స్ధానం…. అభివృద్ధిలో కాదు అనారోగ్యంలో!

క్యాన్స‌ర్ ప్రాణాంత‌కం కాదు, దానికి స‌మ‌ర్థ‌మైన చికిత్స ఉంది… అని ఒక వైపు వైద్య రంగం ధైర్యం చెబుతూనే ఉంది. మ‌న‌దేశంలో కూడా క్యాన్స‌ర్‌ చికిత్సకు పూర్తి స్థాయిలో వైద్యసౌక‌ర్యం ఉంది. అయినా క్యాన్స‌ర్ విస్త‌రణ‌ను అడ్డుకోగ‌లుగుతున్నామా? అంటే స‌మాధానం క‌ష్ట‌మే. పైగా విస్త‌రిస్తున్న క్ర‌మం ఎంత వేగంగా ఉందంటే ప్ర‌పంచంలో మ‌న‌దేశానిది మూడ‌వ స్థానం. చైనా, అమెరికా త‌ర్వాత భార‌త‌దేశంలో క్యాన్స‌ర్ రోగులు, క్యాన్స‌ర్ మ‌ర‌ణాలు ఎక్కువ‌. అది కూడా మ‌హిళ‌ల్లో. కాల్ ఫ‌ర్ యాక్ష‌న్‌, ఎక్స్‌పాండింగ్ క్యాన్స‌ర్ కేర్ ఫ‌ర్ ఉమెన్ ఇన్ ఇండియా- 2017 నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం తేలింది. ఇండియాలో బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్‌, ఒవేరియ‌న్ క్యాన్స‌ర్ బాధితులు  ఏడు ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. అయితే ఇంకా గుర్తించ‌ని ద‌శ‌లో ఉన్న వాళ్లు, గుర్తించిన‌ప్ప‌టికీ న‌మోదు కాని వాళ్లు ఉండి తీరుతారు. వారితో క‌లుపుకుంటే ఈ సంఖ్య ప‌ది నుంచి ప‌దేహేను ల‌క్ష‌ల‌కు చేరుతుంది.

ఇదింకా విషాదం!

క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్న సంఖ్య‌ను బ‌ట్టి మూడవ స్థానంలో ఉన్నాం. కానీ క్యాన్స‌ర్ మ‌ర‌ణాల సంఖ్య‌లో మ‌న‌దేశ‌మే మొద‌టిది.  బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, స‌ర్వైక‌ల్‌, ఒవేరియ‌న్ క్యాన్స‌ర్‌ల బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్న మ‌హిళ‌లు ప్ర‌పంచ‌దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లోనే ఎక్కువ‌. ఇందుకు పేద‌రికంతోపాటు అవ‌గాహ‌న‌లేమి ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. కేర‌ళ వంటి అత్య‌ధికంగా అక్ష‌రాస్య‌త‌ను సాధించిన రాష్ట్రం కూడా క్యాన్స‌ర్ మ‌ర‌ణాల‌లో ముందు వ‌రుస‌లో ఉంది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ రాష్ర్టాలలో ఈ మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి.

న‌గ‌రాల‌కే ప‌రిమితం!

క్యాన్స‌ర్ స్ర్కీనింగ్ టెస్టుల ప‌ట్ల అవ‌గాహ‌న న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మ‌వుతోంది. అది కూడా కార్పొరేట్ హాస్పిట‌ళ్లు, మీడియా ప‌ని గ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్న ఫ‌లిత‌మే ఇది. అయితే కొంత వ‌ర‌కు అవ‌గాహ‌న క‌లిగిన ప‌ట్ట‌ణాలు, గ్రామాల మ‌హిళ‌ల‌కు స్ర్కీనింగ్ చేయించుకునే అవ‌కాశాలు అందుబాటులో ఉండ‌డం లేదు. దాంతో ముంద‌స్తుగా డిటెక్ట్ చేయ‌డం అనేది క‌ష్ట‌మ‌వుతోంది. వ్యాధి రెండు లేదా మూడ‌వ ద‌శ‌కు చేరిన త‌ర్వాత కానీ వైద్యం కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు కావ‌డం లేదు. ముంద‌స్తు ద‌శ‌లో డిటెక్ట్ చేసిన కేసుల్లో వ్యాధి చికిత్స నూటికి నూరు శాతం ఫ‌లితాల‌నిస్తుంది, ఖ‌ర్చు కూడా స‌గానికి త‌గ్గిపోతుంది.

రోజుకు రెండు వేల‌మంది!

దేశంలో రోజుకు రెండు వేల క్యాన్స‌ర్ కేసులను గుర్తించ‌డం జ‌రుగుతోంది. వాటిలో ప‌న్నెండు వంద‌ల కేసులు లేట్ స్టేజ్‌లోనే ఉంటున్నాయ‌ని ఈ నివేదిక తెలియ‌చేస్తోంది. ఇంకో బాధాక‌ర‌మైన విష‌యం ఏమిటంటే… మ‌న‌దేశంలో ప్ర‌స‌వం స‌మ‌యంలో సంభ‌వించే మ‌ర‌ణాల కంటే క్యాన్స‌ర్ మ‌ర‌ణాలే మ‌హిళ‌ల‌ను ఎక్కువ‌గా క‌బ‌ళిస్తున్నాయి.

క్యాన్స‌ర్ రావడానికి ఒబేసిటీ కూడా దోహ‌దం చేస్తుంది. అలాగే ఆల్కాహాలు సేవ‌నం. భార‌తీయ మ‌హిళ‌ల‌లో ఒబేసిటీ, ఆల్క‌హాలు సేవ‌నం గ‌ణ‌నీయంగా పెరిగింది. ఆహార‌పు అల‌వాట్లు, సోష‌ల్‌ లైఫ్‌స్ట‌యిల్లో పాశ్చాత్య సంప్ర‌దాయాన్ని అల‌వ‌రుచుకోవ‌డం కూడా ఈ అన‌ర్థానికి కార‌ణ‌మేన‌ని సూచ‌న ప్రాయంగా తెలియ‌చేస్తోంది పై నివేదిక‌.

పింక్ మంత్‌!

ఏటా అక్టోబ‌ర్ నెల‌ను బ్రెస్ట్ క్యాన్స‌ర్ అవేర్‌నెస్ మంత్‌గా ప‌రిగ‌ణించి అవ‌గాహ‌న క్యాంపులు నిర్వ‌హిస్తున్నాయి పాశ్చాత్య‌దేశాలు. దీనిని మ‌హిళ‌ల మాసంగా ప‌రిగ‌ణించి పింక్ మంత్ అంటారు. ఆ నెల‌లో మ‌హిళ‌ల‌కు మామోగ్రామ్‌, పాప్‌స్మియ‌ర్ వంటి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి సెల‌వు మంజూరు చేసి తీరాలి. మ‌న‌దేశంలో కూడా ఈ క్యాంపులు జ‌రుగుతున్నాయి. రాబోయే నెల అక్టోబరే. 35 ఏళ్లు నిండిన ఉద్యోగినులు, హ‌వుస్‌వైవ్స్ అంద‌రూ ఓ సారి ప‌రీక్ష‌లు చేయించుకోవడం మంచిది. చికిత్స కంటే నివార‌ణ ముఖ్యం.