My title

బాలకృష్ణపై మహిళల తిరుగుబాటు

ఎమ్మెల్యే బాలకృష్ణ పరిస్థితి హిందూపురంలో తలకిందులైంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో నియోజకవర్గంపై కాసింత ఆసక్తి కనబరిచిన బాలకృష్ణ ఇటీవల మాత్రం పూర్తిగా ముఖం చాటేశారు. ఎండకాలం రావడంతో ఇప్పుడు హిందూపురం ప్రజలు తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు.

ఒక ముఖ్యమంత్రి బామ్మర్ది ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బిందెడు నీటిని పది రూపాయలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. నీటి కోసం పనులు మానుకుని పోరాటం చేయాల్సిన దుస్థితి. అయినప్పటికీ ఐదు నెలలుగా బాలకృష్ణ నియోజకవర్గం వైపు రాలేదు. బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు కొందరు. ఇటీవల వామపక్షాల ఆధ్వర్యంలోనూ ఆందోళన కార్యక్రమం జరిగింది. అయినా బాలకృష్ణ స్పందించలేదు.

తాజాగా మంగళవారం హిందూపురం పట్టణంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ చర్చనీయాంశమైంది. వేలాది మంది మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు.  ఈ ర్యాలీకి ఊహించని సంఖ్యలో మహిళలు రావడంతో జనం మిద్దెలపైకి ఎక్కి ర్యాలీని వీక్షించారు. తమ కష్టాలను ఎమ్మెల్యేగా పరిష్కరించడంతో బాలకృష్ణ ఏమాత్రం స్పందించడం లేదంటూ దున్నుపోతులను కూడా ర్యాలీకి తీసుకొచ్చారు. వాటిపై బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు రాశారు.

 

అయితే దున్నుపోతులపై రాతల విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై లాఠీ చార్జ్ చేశారు. దున్నుపోతులను తీసుకెళ్లారు. నీటి కోసం అడిగితే స్పందించాల్సిందిపోయి లాఠీ చార్జ్ చేయడం ఏమిటంటూ విపక్షాలు రోడ్డుపై బైఠాయించాయి. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపురంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా బాలకృష్ణ ఎందుకు స్పందించడం లేదన్న దానిపై టీడీపీ నేతలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గంపై బాలకృష్ణ మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉండడం బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి పోటీ చేస్తారా లేదా అన్న అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.