My title

ఆర్.ఎస్.ఎస్.వల్లే హిందూ మతానికి ముప్పు

హిందువులు మేల్కోవాల్సిన సమయం ఇది. అయితే ఇది గోవులను అక్రమగా రవాణా చేస్తున్నారు, గోవులను వధిస్తున్నారు అన్న సాకుతో ముస్లింల మీద దాడి చేస్తున్నందువల్ల, మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని క్రైస్తవుల మీద విరుచుకు పడుతున్నందువల్ల మాత్రమే ప్రమాదం ముంచుకొస్తోందని హిందువులు బాధపడవలసిన అవసరం లేదు. హిందూ మతానికి ముస్లింల వల్ల ముప్పులేదు. అయినా హిందువులు నిద్రావస్థలోంచి మేల్కోవాల్సిన అగత్యం ఉంది. ముస్లింల జనాభా పెరిగిపోతున్నందువల్ల హిందూ మతానికి ప్రమాదం ఉందని 150 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవులు అందరి మతాన్ని మార్పించలేదు కనక వారి వల్ల కూడా ముప్పు లేదు. కాని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) హిందూ మతంపై సంపూర్ణమైన ఆధిపత్యం చెలాయిస్తున్నందువల్లే హిందూ మతం ప్రమాదంలో పడుతోంది. హిందూ మతం ఒక జీవన విధానం. ఇప్పుడు హిందూ మతాన్ని ఇతర మతాల వారి మీద ఆధిపత్యం చెలాయించే మతంగా మారుస్తున్నారు. ఇతర మతాల వారిని “ఇతరులు”గా అభివర్ణిస్తున్నారు.

బెంగాల్ లో శ్రీ రామ నవమి రోజున కత్తులు, కటార్లు పట్టుకుని హిందువులు ఊరేగింపులు నిర్వహించారు. ఈ ఊరేగింపులు నిర్వహించింది ఆర్.ఎస్.ఎస్.కు అనుబంధంగా ఉన్న వివిధ సంస్థలే. బాలలు, బాలికలు, మహిళలు, పురుషులు ఆయుధాలు చేతపూని నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.

కోల్ కతా, బీర్భం, బర్ద్వాన్, నాడియా, మాల్దా, మిద్నాపూర్, డార్జిలింగ్ లో జై శ్రీరాం, హర హర మహాదేవ్ అన్న నినాదాలు ప్రతిధ్వనించాయి. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు స్వయంగా కత్తి చేతపూని ఊరేగింపునకు నాయకత్వం వహించారు. ఇది బెంగాల్ లో హిందువుల ప్రాభవానికి చిహ్నం అని ఆయన ప్రకటించారు. 33 కోట్ల మంది హిందూ దేవతలు పట్టుకున్న ఆయుధాలను పట్టుకోవడం వల్ల తమను ఎవరూ ఆపలేరని కూడా ఆయన హుంకరించారు.

ఇంతకీ బెంగాల్ లో శ్రీ రాముడికి ప్రాధాన్యత ఎప్పటి నుంచి పెరిగింది? శ్రీ రామనవమి ఎప్పటి నుంచి పెద్ద పండగ అయింది? అక్కడ హిందీలో నినాదాలు ఎప్పటి నుంచి మొదలైనాయి? బెంగాలీలు హిందూ మతానికి, హిందూ జాతీయతా వాదానికి లొంగి పోయారా? “దుర్గ కాదు, కాళీ కాదు, కేవలం రాముడు, బజరంగ్ బలి” అన్న నినాదాలను బెంగాలీలు ఎప్పటి నుంచి సహిస్తున్నారు? దుర్గా మాత ఆరాధనకు పేరుపడ్డ బెంగాల్ శ్రీ రాముడికి ప్రాధాన్యం ఇస్తోందా?

హనుమంతుడి పతాకం ఎరుపు రంగులో ఉంటుంది. కాని ఈ సారి హనుమజ్జయంతి సందర్భంగా మహావీరి అఖడా నిర్వహించిన ఊరేగింపులో కాషాయ జెండాలు రెపరెపలాడాయని బిహార్ లోని ఒక మిత్రుడు చెప్పాడు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్ హా హజారీ బాగ్ వెళ్లి ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే వీధిలో నుంచి రామ నవమి ఊరేగింపు వెళ్లడానికి అనుమతించాలని పట్టుబట్టి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించారు. గత ఆరు దశాబ్దాలుగా ఆ మార్గం గుండా రామ నవమి ఊరేగింపు వెళ్లిన సందర్భమే లేదు. కాని ఈ సారి ఆ వీధి గుండా వెళ్లకపోతే ఊరేగింపే లేదని హిందువులందరి తరఫున బీజేపీ నిర్ణయించేసింది. అంటే శ్రీరామ నవమి ముస్లింలను లొంగదీయడానికి ఓ సాకు మాత్రమే.

గత సంవత్సరం కన్వరియాలు తమ కాషాయ వస్త్రాలకు త్రివర్ణ పతాకం తగిలించుకుని దిల్లీ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపులో ఉన్న లారీల మీద కూడా త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. కన్వరియాలు శివుడిని ఆరాధిస్తారు. నిజానికి కన్వరియాలు అమాంతం జాతీయవాదులు అయి పోలేదు. ఆర్.ఎస్.ఎస్. పనిగట్టుకుని జాతీయ పతాకాన్ని తన ప్రయోజనాలకు వినియోగించుకుంది. జాతీయ పతాకం ధరించడాన్ని ఎవరు తిరస్కరిస్తారు గనక? అంటే త్రిలోకదారి అయిన దేవుడిని జాతీయం చేసేశారన్న మాట. కషాయానికి జాతీయపతాకం తోడు కావడం వల్ల ప్రయోజనం ఏమిటో గమనించడం కష్టమేమీ కాదు.

సిక్కు మతం హిందూ మతం నుంచి ఆవిర్భవించిందే అని నమ్మించడానికి ఆర్.ఎస్.ఎస్. చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. సిక్కులు తీవ్రంగా గర్హించిన తర్వాత ఆర్.ఎస్.ఎస్. వెనకడుగు వేసిన మాట నిజమే కాని ఆ ప్రయత్నం ఇంకా పూర్తిగా వదులుకోలేదు. ఓనం పండగను గొప్పగా జరిపే కేరళలో కూడా బలి చక్రవర్తి స్థానంలో వామనుడిని అధిష్టింప చేయడానికి ఆర్.ఎస్.ఎస్., బీజేపీ గట్టిగానే ప్రయత్నించాయి. ఓనం రోజున బలిని ఆరాధించే బదులు వామన దినోత్సవం ఆచరించాలని చెప్పారు. ఈ విష్యంలో వారి ప్రయత్నాలు ఫలించలేదు కాని ఆ నేలలో అంతర్భాగమైన భావాల స్థానంలో “ఆర్యుల” సంప్రదాయాలను ప్రవేశ పెట్టడానికి చేసే ప్రయత్నాలను విస్మరించడానికి వీలు లేదు.

మహా రాష్ట్రలో గిడి పర్వంలో కూడా మార్పు వస్తోంది. సాంప్రదాయికమైన ఈ మహారాష్ట్రీయుల పండగలఒ జాతీయతా ఛాయలు కనిపిస్తున్నాయి. ఇది యాదృఛ్చికంగా జరిగిందేనా?

కాషాయానికి, త్రివర్ణ పతాకానికి తేడా లేదని హిందువులను నమ్మించడానికి ఆర్.ఎస్.ఎస్. కృషి చేస్తోంది. అన్ని పండగలు, పర్వాల మీద ఆర్.ఎస్.ఎస్. ముద్ర కనిపిస్తోంది. నిజమైన హిందువుగా ఎలా ఉండాలో సృజనాత్మక రీతుల్లో ఆర్.ఎస్.ఎస్. తెలియజెప్తోంది. దీన్ని హిందువులు అంగీకరిస్తున్నారు కూడా. హిందువుల సరసన జీవించే ఇతర మతాల వారి పండగలు హిందూ రూపు సంతరించుకుంటున్నాయి. జార్ఖండ్ లో గిరిజనులు జరిపే సర్హుల్ పండగకు కాషాయ రంగు పులుముతున్నారు. ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలో గాజీ మియా ను హిందువులు, ముస్లింలు కూడా ఆరాధిస్తారు. కాని ముస్లింలను ఆరాధించకూడదని దానికి బదులు గాజీ మియా చేతిలో ఓడిపోయిన సుహేల్ దేవ్ ను ఆరాధించాలని ఆర్.ఎస్.ఎస్. చెప్తోంది.

హిందూ మతం వైవిధ్యభరితమైంది. ఆ వైవిధ్యం గందరగోళంగా కూడా ఉండొచ్చు. కాని హిందూ మతం ఒకే రీతిలో ఉన్నది కాదు. హిందువులకు ఒకే పవిత్ర గ్రంథం, ఒకే దేవుడి విగ్రహం లేవు. ఈ బహుముఖీనతను తొలగించే ప్రయత్నాలు జరిగాయి కాని అవన్నీ విఫలమైనాయి. ఆధునిక హిందూ సన్యాసుల్లో ప్రధానుడైన స్వామి వివేకానంద కూడా ఈ వైవిధ్యాన్ని తొలగించి హిందూ మతాన్ని ఆధునీకరించాలనుకో లేదు. భగవద్గీతను హిందువుల పవిత్ర గ్రంథంగా మార్చాలన్న ప్రయత్నాలను గాంధీ కూడా వదులుకోవాల్సి వచ్చింది.

కృష్ణుడిని వీరుడిగా ఆరాధించరు. శ్రీరాముడి బాల రూపం ఉండదు. శివుడు లయకారుడైనా వరాలు ఇచ్చే వాడిగా, స్వేచ్ఛగా వ్యవహరించే దేవుడిగానే చూస్తారు. కాని ఈ దేవతలందరూ ఒకే రకంగా మారిపోతున్నారు. వీరందరూ కొత్తగా వచ్చిన జాతీయవాద దూకుడు కలిగిన వారిలా కనిపిస్తున్నారు. హిందూ పండగలన్నీ ఒకే రకంగా ఉంటే, అదీ ఒక నిర్దిష్టమైన జాతీయతా వాదానికి లోబడి ఉంటె అది మనకు సహస్రాబ్దాలుగా తెలిసిన హిందూ మతానికి అంతం కావొచ్చు. అందరూ ముస్లిం వ్యతిరేకులుగా, ఇతరులకు వ్యతిరేకులుగా మారిపోవచ్చు.

వీర సావర్కర్ బహుదేవతారాధనను అంగీకరించలేదు. హిందుత్వం అన్న మాట ప్రచారంలోకి తీసుకొచ్చారు. అది హిందూ ధర్మానికి సంబంధించింది కాదు. ఒక రకమైన జాతీయతా వాదానికి పరిమితమైంది. ఈ వాదాన్ని ఆర్.ఎస్.ఎస్. అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత సుప్రీం కోర్టు హిందుత్వం, హిందూమతం అనే మాటల మధ్య గందరగోళం సృష్టించడానికి కారణం అయింది. హిందూ మతం ఒక జీవన విధానం కాదు. అనేక జీవన విధానాలతో కూడింది. అనేక జీవన విధానాలను ఒకే జీవన విధం అని తీర్పు చెప్పడం ద్వారా సుప్రీం కోర్టు హిందూ మతానికి నష్టమే కలిగించింది. హిందుత్వం ఆధిక్యతా భావంతో కూడింది. ఈ భావన అన్ని హిందూ సంప్రదాయాలకూ విస్తరిస్తోంది. ఈ రుగ్మతకు చికిత్స చేసి దాని అసలు స్వరూపం పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. ఈ పని చేసే వారు సత్వరం కావాలి.