My title

క్యాల్షియం లోపిస్తే…. హ‌ఠాత్తుగా గుండెపోటు!!

క్యాల్షియం అన‌గానే మ‌న‌కు ఎముక‌లు మాత్ర‌మే గుర్తొస్తాయి. కానీ శ‌రీరానికి అవ‌స‌ర‌మైనంత స్థాయిలో క్యాల్షియం తీసుకోక‌పోతే గుండె ఆరోగ్యం దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని….ఒక ప‌రిశోధ‌న‌లో తేలింది. ర‌క్తంలో త‌గిన మోతాదులో క్యాల్షియం లేక‌పోతే….హ‌ఠాత్తుగా గుండెపోటుకి గుర‌య్యే ప్ర‌మాదం హెచ్చుగా ఉంటుంద‌ని ఆ ప‌రిశోధ‌న ఫ‌లితాలు వెల్ల‌డించాయి.  క్యాల్షియం…ఎముకలు, కీళ్లు, ప‌ళ్ల‌ను ఆరోగ్య‌వంతంగా ఉంచ‌డ‌మే కాకుండా ర‌క్త‌నాళాల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. అలాగే ర‌క్త‌పోటుని అదుపులో ఉంచుతుంది…. మ‌ధుమేహాన్ని రాకుండా నివారిస్తుంది. ఈ క్ర‌మంలో క్యాల్షియం గుండె ఆరోగ్యంలో కీల‌క పాత్ర‌ని పోషిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

సాధార‌ణంగా హ‌ఠాత్తుగా వ‌చ్చే గుండె పోటు… తొంభైశాతం వ‌ర‌కు ప్రాణాపాయంగా మారుతుంది. అయితే ఈ స‌డ‌న్ కార్డియాక్ అరెస్ట్‌తో మ‌ర‌ణించేవారిలో స‌గం కంటే ఎక్కువ‌మంది మ‌గ‌వారు, 70శాతం మంది మ‌హిళ‌లు…ఎలాంటి గుండెజ‌బ్బులు లేనివారే అయి ఉంటున్నారు. ఈ విష‌యంపై లాస్ఏంజిల్స్‌లోని సిడార్స్‌-సినాయ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వారు ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించ‌గా…హ‌ఠాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించేవారిలో ర‌క్తంలో క్యాల్షియం స్థాయి త‌క్కువ‌గా ఉన్న‌ట్టుగా గుర్తించారు. ఎవ‌రిలో అయితే ఉండాల్సిన మోతాదుకంటే త‌క్కువ‌గా ర‌క్తంలో క్యాల్షియం ఉందో వారు… ఈ స్థాయి …ఎక్కువ‌గా ఉన్న‌వారికంటే… హ‌ఠాత్తుగా వ‌చ్చే గుండెపోటుకి గుర‌య్యే ప్ర‌మాదం రెండు రెట్లు అధికంగా ఉన్న‌ట్టుగా గుర్తించారు. గుండె ఆరోగ్యానికి సంబంధించి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా…ఈ ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్టుగా గ‌మ‌నించారు.  అందుకే గుండె ఆరోగ్యం గురించి తీసుకునే శ్ర‌ద్ధ‌లో భాగంగా త‌ప్ప‌కుండా ర‌క్తంలో క్యాల్షియం స్థాయి ఎలా ఉందో చెక్ చేయాల‌ని ఈ ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

క్యాల్షియం మ‌న‌కు ఎక్కువ‌గా దొరికే ఆహారంలో పాల‌దే ప్ర‌థ‌మ‌స్థానం. ఒక క‌ప్పు పాల‌లో 300మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అలాగే సోయా మిల్క్, సోయా గింజ‌లు, సోయా గింజ‌ల‌తో త‌యార‌యిన తోఫుల్లో కూడా క్యాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇంకా క‌మ‌లాప‌ళ్లు, బాదం ప‌ప్పుల్లోనూ క్యాల్షియం అధికంగా ఉంటుంది. బాదంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి.  అంతేకాదు బాదం… బ‌రువు త‌గ్గ‌టానికి తోడ్ప‌డ‌ట‌మే కాకుండా కొలెస్ట్రాల్‌ని త‌గ్గిస్తుంది. ఇక‌పై మ‌న‌కు క్యాల్షియం అన‌గానే ఎముక‌ల ఆరోగ్య‌మే కాకుండా గుండె ఆరోగ్యం సైతం గుర్తురావాల‌న్న‌మాట‌.