My title

బాధ్యత తేలకుండానే ‘దోషుల’ శిక్ష

సరిగ్గా 16 ఏళ్ల ఎనిమిది నెలల కిందట గోధ్రాలో జరిగిన రైలు పెట్టె దగ్ధం కేసులో గుజరాత్ హైకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు ఒక రకంగా ఆహ్వానించదగిందే. కాని ఆ తీర్పు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పనే లేదు. మొదటిది మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడంలో న్యాయమూర్తులు ఎక్కడా మరణ శిక్ష అమానుషమైందని భావించినందువల్ల మార్చామని చెప్పలేదు. ఈ తీర్పు పరిధిలోకి రాకపోయినా ఇంతకీ ఆ బోగీ దగ్ధం కావడానికి కారణం ఏమిటో మాత్రం తేలలేదు. గోధ్రా సంఘటన తర్వాత శాంతి భద్రతలను పరిరక్షించడంలో గుజరాత్ లో అప్పటి మోదీ ప్రభుత్వం విఫలమైందని, రైల్వే శాఖ భద్రత కల్పించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినా దానికి నైతిక బాధ్యత తీసుకునే అవకాశం కనిపించడం లేదు. రైల్వే భద్రతా శాఖలో ఉన్న లొసుగులను సరిదిద్దే పని షరా మామూలుగా ఎటూ జరిగే అవకాశం లేదు. న్యాయం నత్త నడక నడవడం వల్ల జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి ఎప్పుడు శ్రీకారం చుడతారో ఎటూ తెలియదు.

సబర్మతి ఎక్స్ ప్రెస్ లోని ఎస్-6 రైలు పెట్టె దగ్ధం అయినందువల్ల 59 మంది కరసేవకులు మాడి మసై పోయారు. వీరందరూ అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కర సేవకులే. ఆ రైలులో మొత్తం 1700 మంది కర సేవకులు ప్రయాణించారని అంచనా. ఈ దుస్సంఘటన వెంటనే గుజరాత్ మారణకాండకు దారి తీసింది.

ఈ సంఘటనను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృంద న్యాయస్థానం ఈ ఉదంతం జరిగిన తొమ్మిదేళ్లకు 2011 మార్చి ఒకటిన తీర్పు చెప్పింది. అప్పుడు 11 మందికి మరణ శిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో 63 మందిని నిర్దోషులుగా తేల్చింది. ఈ తీర్పుపై శిక్షలు పడ్డ వారితో పాటు ప్రభుత్వం కూడా హై కోర్టులో అప్పీలు చేసింది. సోమవారం నాడు తీర్పు వెలువరించిన హై కోర్టు  11 మందికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారగార శిక్షగా మార్చింది. ఈ తీర్పులోని ప్రధానాంశం ఇదే. ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయంలోని మరే అంశాన్ని హైకోర్టు మార్చలేదు. ప్రత్యేక న్యాయ స్థాన తీర్పుపై అప్పీలును విచారించి తీర్పు చెప్పడానికి హై కోర్టుకు ఆరేళ్లు పట్టింది.

మరణ శిక్షను యావజ్జీవ కారాగారవాస శిక్షగా మార్చడం సూత్ర రీత్యా మరణ శిక్షను వ్యతిరేకించే వారందరికీ ఊరట కలిగించే అంశమే. అయితే ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తులు అనంత్ ఎస్. దవే, జి.ఆర్. ఉద్వానీతో కూడిన డివిజన్ బెంచ్ సిద్ధాంత రీత్యా మరణ శిక్షకు వ్యతిరేకమైనందువల్ల ఈ నిర్ణయానికి రాలేదు. మన చట్టాలు మరణ శిక్షకు అవకాశం కల్పిస్తున్నాయి కనక ఆ శిక్ష విధిస్తున్నామనే చాలా మంది న్యాయమూర్తులు వాదిస్తున్నారు. గోధ్రా సంఘటన లాంటి ఘోరం జరిగినప్పుడు మరణ శిక్ష విధించడాన్ని హర్షించే వారు చాలా మందే ఉంటారు. ఇది కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆటవిక న్యాయమే. సూత్ర రీత్యా మరణ శిక్ష విధించడానికి తాము వ్యతిరేకం అని డివిజన్ బెంచి న్యాయమూర్తులు చెప్పి ఉంటే అది మరో రకంగా మరణ శిక్ష సబబా, బేసబబా అన్న విస్తృత చర్చకు తెర లేపి ఉండేది. అలా జరగకపోవడం ఓ విషాదమే. 

శిక్షల మాట ఎలా ఉన్నా అసలు ఆ బోగీ ఎందుకు దగ్ధమైందో ఇప్పటికి తేల లేదు. అసలు దర్యాప్తు అయినా మొదలు కాకుండానే గుజరాత్ ప్రభుత్వం “ఇది పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ. పన్నిన కుట్ర” అని ప్రకటించేసింది. సీనియర్ మంత్రి అశోక్ భట్. హోం శాఖ సహాయ మంత్రి గోవర్ధన్ జడాఫియా ఫిబ్రవరి 27 న శాసన సభలో ఈ విషయం ప్రకటించారు. ఆ సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి మోదీ “ఇది పథకం ప్రకారం అమానుషంగా, సామూహికంగా పన్నిన తీవ్రవాద కుట్ర” అని వ్యాఖ్యానించినట్టు తెలియజేశారు.

వాస్తవం ఏమిటంటే రైలు పెట్టె ఉదయం 7.45 ప్రాంతంలో దగ్ధం అయితే డిసిపి ఎనిమిదిన్నరకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మూగిన జనం వెళ్లి పోయారు. ఆ డి.ఎస్.పి.కి ఆ బోగీ లోనుంచి ఆక్రనందనలు, హాహాకారాలు ఏమీ వినిపించలేదట. అందువల్ల భారీ ప్రాణ నష్టం కలిగినట్టు ఆయన భావించలేదు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వచ్చి కాలిపోయిన రైలు పెట్టెలోకి వెళ్లి చూసిన తర్వాతే ఎంత ఘోరం జరిగిందో గ్రహించారు. ఎస్-6 బోగీ మధ్యలో కాలిపోయిన కళేబరాలు కుప్పగా పడి ఉన్నాయి. కాని గుజరాత్ పోలీసులు కాలిపోయిన రైలు పెట్టెను పరిశీలించడానికి ఫారెన్సిక్ నిపుణులను పిలిపించ లేదు.

విచిత్రం ఏమిటంటే దర్యాప్తు చేసిన బృందం రైలు పెట్టె దగ్ధం కావడంలో కుట్ర ఉందన్న వాదనను తోసి పుచ్చింది. కాని ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు మాత్రం 2011 లో తీర్పు చెప్పినప్పుడు కుట్ర ఉందని తేల్చింది. ఈ కేసులో మొత్తం 94 మంది మీద ఆరోపణలు నమోదు చేస్తే కేవలం 31 మందినే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. మిగతా 63 మంది నిర్దోషులని చెప్పింది. ఇందులో కుట్ర ప్రధాన సూత్ర ధారి అన్న ఆరోపణ ఉన్న మౌల్వీ ఉమర్జీని కూడా నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. కుట్రకు సూత్ర దారుడే నిర్దోషి అయినప్పుడు, అంతమందిని నిర్దోషులుగా తేల్చినప్పుడు కుట్ర లేదనే అనుకోవాలి. కాని ప్రత్యేక న్యాయస్థానం ఆ విషయం అంత స్పష్టంగా చెప్పలేదు.

బోగీ దగ్ధం గురించి అనేక వాదనలు వినిపించాయి. కాని అసలు కారణం ఏమిటో నికరంగా తేలలేదు. ఈ దుర్ఘటన వెనక తీవ్రవాద కుట్ర ఉందన్న ఆరోపణ ఏ దర్యాప్తులోనూ రుజువు కాలేదు. గాంధీ నగర్ లోని ఫారెన్సిక్ సైన్స్ లేబొరటరీ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తుపై ఈ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర సింగ్ దహియా నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో కుట్ర జరిగిందన్న వాదనను తోసి పుచ్చారు. “ఆ బోగీలో 72వ సీటు దగ్గర నిలబడి ఎవరో మూత విశాలంగా ఉన్న ఒక డబ్బాలోంచి పేలుడు ద్రవాన్ని గుమ్మరించారని ఆ తర్వాత బోగీలో మంటలు ఎగిశాయి” అని ఈ నివేదికలో పేర్కొన్నారు.

బయటి నుంచి పేలే స్వభావం ఉన్న ద్రవ పదార్థాలను బోగీలోకి వెదజల్లడం కుదరదని ఫారెన్సిక్ లేబొరటరీ ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఆ బోగీ నేల మీంచి ఏడు అడుగుల ఎత్తున ఉన్నందువల్ల పెట్రోల్ లాంటివి బోగీ లోపలికి చల్లడం కుదరదని చెప్పించి. రైలు పట్టాలకు సమాంతరంగా 14 అడుగుల దూరంలో మూడు అడుగుల ఎత్తైన మట్టి దిబ్బ ఉండేదని అక్కడి నుంచి కూడా పెట్రోల్ వెదజల్లినా అందులోంచి 10-15 శాతం కన్నా రైలు పెట్టె లోపల పడే అవకాశం లేదని ఈ నివేదికలో వివరించారు. మిగతా పెట్రోల్ కింద పడిపోతుందని కనక ఆ ప్రాంతం కూడా కాలి పోయి ఉండాలి. కాని అలా జరగలేదు.

లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు న్యాయమూర్తి యు.సి. బెనర్జీ నాయకత్వంలో ఓ దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం కూడా “కుట్ర” వాదనను తిరస్కరించింది. రైలు బోగీ ప్రమాదవశాత్తు దగ్ధమై ఉంటుందని చెప్పింది. రైళ్లలో పేలుదు పదార్థాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చునని తెలియజేసింది. పశ్చిమ రైల్వే భద్రతా ప్రమాణాలు పాటించదని కూడా వ్యాఖ్యానించింది.

రైలు పెట్టె ఎలా దగ్ధం అయిందో అనుమాన రహితంగా తేలకపోయినా ప్రత్యక న్యాయస్థానం విచారణ, ఆ తీర్పుపై హైకోర్టులో అప్పీలు, ఆ తర్వాత తీర్పు మాత్రం వెలువడ్డాయి. రైలు పెట్టె దగ్ధం కావడానికి బాధ్యులు ఎవరన్న విషయంలో రకరకాల వాదనలు వచ్చాయి. 31 మందిని దోషులుగా ప్రత్యేక న్యాయ స్థానం తేల్చింది. ఇందులో నిర్దోషులకు శిక్ష పడడమూ సాధ్యమే. మన న్యాయవ్యవస్థలో ఇలాంటి ఉదంతాలు తరచుగానే జరుగుతాయి. అసలు దోషులు తప్పించుకు పోయినా ఆశ్చర్య పడనవసరం లేదు.

గోధ్రా సంఘటనకు ప్రతీకారంగా జరిగిన గుజరాత్ మారణకాండలో అధికారిక లెక్కల ప్రకారం 1044 మంది మరణించారు. వీరిలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు. లక్ష మంది ముస్లింలు, 40,000 మంది హిందువులు నిర్వాసితులయ్యారు. ఇలాంటి భారీ దుర్ఘటనలు జరిగినప్పుడు అధికారిక అంచనాలలో ప్రాణ నష్టం తక్కువగానే చూపడం సర్వసాధారణం. మానవ హక్కుల సంఘాలు, ముస్లిం వర్గాలు 2,000 మంది కన్న ఎక్కువగా ముస్లింలు మరణించారని అంచనా వేశాయి. గుజరాత్ లో కార్చిచ్చు ప్రబలినప్పుడు అనువైన చోట ముస్లింలు కూడా ప్రతిఘటించినందువల్లే హిందువులలో ప్రాణ నష్టం ఉంది. గుజరాత్ లో 25 జిల్లాలు ఉంటే 20 జిల్లాల్లో మారణ కాండ కొనసాగింది.

కాని ఈ దుర్ఘటన జరిగిన తర్వాత పరిస్థితి మారిన దాఖలాలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు మాత్రం లేవు. భయకంపితులైన ముస్లింలు దళితుల్లాగా విడిగా నివసించడానికి అలవాటు పడ్దారు. ఈ మారణకాండ తర్వాత గుజరాత్ శాసన సభ ఎన్నికలలో వరసగా బీజేపీ విజయం సాధించినందువల్ల ఆ ప్రభుత్వం మీద పడ్డ మచ్చ మాసిపోయినట్టే. ఈ సంఘటనపై మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం “అద్భుతమైన అభివృద్ధి” సాధించింది అన్న ముసుగు కప్పేశారు. దీనిని గుజరాత్ నమూనా అంటున్నారు. దాన్ని దేశమంతా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అభివృద్ధి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వ్యాపార వర్గాలకే ప్రిమితం అని ఎవరైనా చెప్పడానికి సాహసిస్తే వారి మీద అభివృద్ధి నిరోధకుల ముద్ర వేస్తారు.

గుజరాత్ మారణకాండ వల్ల ఒక్క ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముస్లింలు రెండవ శ్రేణి పౌరులుగా దిగజారిపోయారు. ఈ రెండవ శ్రేణి పౌరులు అన్న మాట క్రైస్తవులకు, దళితులకు, గిరిజనులకు కూడా వర్తిస్తుంది.

-ఆర్వీ రామారావ్