My title

కాంగ్రెస్ ఘ‌ర్ వాప‌సీ ఫ‌లిత‌మిస్తుందా?

తెలంగాణ కాంగ్రెస్ 2019 ఎన్నిక‌ల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. రాష్ట్ర‌వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా గులాం న‌బీ ఆజాద్ వ‌స్తార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. ప్ర‌ముఖ ఛాన‌ల్ ఓన‌ర్ కూతురు పెళ్లికి ఆజాద్ వ‌చ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత‌ల‌ను కొంద‌రిని క‌లిశారు. తాను తిరిగి ఇంఛార్జ్‌గా వ‌స్తాన‌ని…కార్య‌క్ర‌మాలు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ఆయ‌న చెప్పార‌ట‌. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత‌లు చేప‌ట్ట‌బోయే మొద‌టి కార్య‌క్ర‌మం ఘ‌ర్‌వాప‌సీ. అంటే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన‌…దూరంగా ఉన్న నేత‌ల‌ను పార్టీలోకి తిరిగి ఆహ్వానించ‌డం. ఇందుకోసం పార్టీలో సీనియ‌ర్ నేతలు జానారెడ్డితో పాటు ఐదుగురితో క‌మిటీ వేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌. ఈ క‌మిటీ పార్టీలోకి తిరిగి రావాల‌ని నిర్ణ‌యించుకున్న నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ట‌.

పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్‌లో కంఫ‌ర్ట్‌గా లేరు. దీంతో మొద‌ట ఆయ‌న‌తోనే ప్రారంభించాల‌ని అనుకుంటున్నారు. ఆ త‌ర్వాత రెడ్యానాయ‌క్‌, బ‌స్వ‌రాజు సార‌య్య‌తో పాటు గ‌తంలో ఎమ్మెల్యేలుగా ప‌నిచేసిన నేత‌లను మొద‌ట క‌ల‌వాల‌ని నిర్ణ‌యించారు. ఎలాగైనా పార్టీని వీడిన నేతల‌ను తిరిగి పార్టీలోకి ర‌ప్పించి ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపాల‌ని ఆ పార్టీ నేత‌లు ఆలోచిస్తున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మం ఎంత బాగా వ‌ర్క్‌వుట్ అవుతుందో కాల‌మే స‌మాధానం చెబుతుంది.