My title

పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి !

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కూడా దాని ఫలితాన్ని అందుకోలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్దం చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీపీ తొలుత తన వైపు నుంచే మార్పులకు శ్రీకారం చుట్టింది.  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఇటీవల నియమితుడైన కుంతియాను తప్పించేందుకు అంగీకరించింది.

దిగ్విజయ్‌ స్థానంలో పగ్గాలు చేపట్టిన కుంతియాపై చాలా మంది టీ కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఇన్‌చార్జ్‌గా పార్టీని నడిపించేంత స్థాయి లేదంటూ నేరుగా వెళ్లి సోనియా, రాహుల్‌లకే ఫిర్యాదు చేశారు. కుంతియా కేవలం ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటున్నారన్నది కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు చాలా మంది ఫిర్యాదు చేశారు. దీని వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోదంటూ సోనియాకు బాగా సన్నిహితుడైన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు నేరుగా రాహుల్‌కు ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో తాము పార్టీని వీడేందుకు కూడా సిద్ధమని ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించడంతో అధిష్టానం దిగివచ్చింది. కుంతియాను తప్పించి త్వరలోనే ఆజాద్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించనున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ శాంతించారు. ఆజాద్‌ను ఇన్‌చార్జ్‌గా నియమిస్తే పార్టీలో కొనసాగుతానని సన్నిహితుల వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ వీడుతామనగానే వారిని ఆజాదే వారించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడవద్దని సూచించారు.

ఆజాద్‌ ద్వారా ఇటీవల కోమటిరెడ్డి బ్రదర్స్‌ సోనియా, రాహుల్‌ను ప్రత్యేకంగా కలిసినట్టు చెబుతున్నారు. రాహుల్‌ నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వారి భవిష్యత్తుపై భరోసా వచ్చినట్టు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో కూడా మాట్లాడిన ఆజాద్‌…. కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడకుండా చర్చలు జరపాలని సూచించారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిని తన నివాసానికి పిలిపించుకుని జైపాల్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరపారు.

మరుసటి రోజే రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆజాద్, రాహుల్‌గాంధీని కలిసి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఆజాద్‌ ఇన్‌చార్జ్‌గా వచ్చిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్‌ హవా కాంగ్రెస్‌లో పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు సాధుజీవుల తరహాలో టీఆర్‌ఎస్‌తో  ఫైట్ చేస్తున్నారని…. పార్టీని గెలిపించాలంటే ఆ ధోరణి సరికాదన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పార్టీ హైకమాండ్‌ మంచి ప్రాధాన్యతే ఇస్తున్నట్టు చెబుతున్నారు.