My title

గౌతమిపుత్ర శాతకర్ణి… స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌ – పూర్‌ గ్రాఫిక్స్‌

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

రేటింగ్‌: 2.75/5

తారాగణం:  బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని, తదితరులు

సంగీతం:  చిరంతన్ భట్

నిర్మాత: బిబో శ్రీనివాస్ (సమర్పకుడు), జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి, పంగులూరి సుహాసిని

దర్శకత్వం: జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్)

కాలం వెనక్కి వెళ్ళి కథ చెప్పడం కష్టం. అందులోనూ చారిత్రకం వేరు. జానపదం వేరు. పూర్వపు రోజుల్లో ఎన్టీఆర్‌ హీరోగా ఈ రకమైన సినిమాలు బోలెడొచ్చాయి. అయితే అప్పటి ప్రేక్షకులు వేరు. మొత్తం సినిమాని ఏవో నాలుగు సెట్టింగులు వేసి స్టూడియోలో తీసినా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇది ఇంటర్‌నెట్‌ యుగం. మహామహా హాలివుడ్‌ సినిమాల్ని ఫోన్‌లో చూసేయెచ్చు. తీయడం ఖర్చుతో కూడుకున్నపని, మెప్పించడం చాలా కష్టమైన పని కాబట్టి సాహసించడానికి భయపడతారు.

అయినా రాజమౌళి పట్టుదలతో బాహుబలి తీశాడు. హాలివుడ్‌తో సమానంగా తెలుగు సినిమాలు తీయగలమని నిరూపించాడు. గుణశేఖర్‌ ప్రయత్నించాడు కానీ రుద్రమదేవితో మెప్పించలేకపోయాడు. కారణం ఆ కథ అందరికీ తెలియకపోవడం, బాహుబలితో సమానమైన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ లేకపోవడం.
పిరియాడికల్‌ సినిమాలు తీయడానికి ఎవరూ ధైర్యం చేయలేని స్థితిలో క్రిష్‌ బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి తీశాడు. ధైర్యం ఎందుకంటే రాజమౌళి పెద్దగీత గీశాడు. గీస్తే అంతకంటే పెద్ద గీత గీయాలి. గీయడం కష్టం. అయినా క్రిష్‌ ఏంచేశాడో చూద్దాం.

వాస్తవానికి అఖండ భారతదేశం ఎన్నడూ లేదు. ఇదెప్పుడూ చిన్నచిన్న గణాల సముదాయమే. ఒక పెద్దరాజు తనకు సమీపంలోని కొన్ని చిన్నరాజ్యాలను జయించి కప్పం కట్టించుకునేవాడు. ఆయన్ని మహా ప్రభువుగా కీర్తిస్తూ శాసనాలు, గ్రంధాలు వెలువడేవి. డబ్బులు ఖర్చుపెట్టి పదవులు, బిరుదులు అలవొకగా ఈరోజుల్లోనే సంపాదిస్తూవుంటే ఆ రోజుల్లో రాజుల్ని కీర్తించే వాళ్ళకి కొదువా? అబద్దాలతో చరిత్రని నింపడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అశోకుడు చెట్లు నాటించెను అని చిన్నప్పటినుంచి చదువుకుంటూనే ఉన్నాం. వందేళ్ళ క్రితం కూడా ఈ భూమి చెట్లతో నిండి ఉండేది. మరి వేల ఏళ్ళ క్రితం చెట్లు నాటించాల్సిన అవసరం ఏముంటుంది. ఆయన 4 లక్షల సైన్యంతో దండయాత్రకి బయలుదేరాడు అని రాస్తారు. ఆ రోజుల్లో వ్యవసాయ భూమి ఎంత? 4 లక్షలమంది ఒకసారి భోంచేస్తే ఎన్ని తిండిగింజలు కావాలో ఎవరికైనా తెలుసా?

అన్ని కాలాల్లోనూ కాలం, దూరం, సంఖ్యాశాస్త్రం ఎప్పుడూ అవాస్తవాలతోనే ఉంటుంది. సరే ఈ చారిత్రక చర్చని పక్కనపెడితే సినిమా గురించి మాట్లాడుకుందాం.

సింపుల్‌గా చెప్పాలంటే చిన్నచిన్న గణరాజ్యాలుగా ఉంటూ ప్రజలు అశాంతిలో జీవించడం కంటే ఒకే రాజ్యం కింద ప్రజలు శాంతితో జీవించాలనేది శాతకర్ణి కల. తల్లిని విపరీతంగా గౌరవించే ఆయన తనని తాను గౌతమిపుత్ర శాతకర్ణిగా పిలుచుకుంటాడు (వాస్తవానికి ఆదిమసమాజంలో మాతృస్వామ్యమే ఉండేది తరువాత పితృ స్వామ్యం వచ్చింది) ఏళ్ళ తరబడి యుద్ధాలు చేయడం అశాంతిని పారదోలడానికే అని శాతకర్ణి విశ్వాసం.

శరణమా, రణమా అనే హెచ్చరికతో శత్రురాజులకి శాతకర్ణి సందేశం పంపడంతో సినిమా మొదలవుతుంది. శాతకర్ణి వచ్చి వాళ్ళని జయిస్తాడు. ఇంకోరాజుకి ఇదే రకమైన హెచ్చరిక పంపితే, తాను శాతకర్ణి కంటే బలవంతుడినని, శాతకర్ణి తన కొడుకుని తీసుకుని వచ్చి తనను శరణుకోరాలని అంటాడు. మూడు నాలుగేళ్ల పసిబిడ్డను యుద్ధానికి పంపడం భార్య వాశిష్ట ఇష్టంలేదు. కానీ తన కొడుకు జయిస్తాడని శాతకర్ణి తల్లి గౌతమికి తెలుసు. శాతకర్ణి జయిస్తాడు.

తరువాత యవనరాజుపై యుద్ధానికి వెళ్ళి అతన్ని జయించడంతో కథ ముగుస్తుంది. ఇంత చిన్నలైన్‌తో సినిమా తీయాలనుకోవడం దర్శకుడు క్రిష్‌ సాహసం. సినిమా అంతా యుద్ధమే ఉన్నప్పటికీ పెద్దగా గ్రాఫిక్స్‌ జోలికిపోకుండా బాహుబలితో పోలిస్తే నాసిరకంగా గ్రాఫిక్స్‌తో సినిమాలాగించడం రెండో సాహసం. మొదట్నుంచి ఆఖరివరకూ ఇతర నటీనటులెవరూ లేకుండా బాలకృష్ణతోనే సినిమానడవడం మూడోసాహసం. (శ్రియ, హేమమాలిని ఉన్నా వాళ్ళున్న ప్రతి సీన్‌లోనూ బాలకృష్ణ కూడా ఉంటాడు) మరి ఇన్ని సాహసాలు చేసి క్రిష్‌ గెలిచాడా? బాలకృష్ణ యుద్ధంలో గెలిచినట్టు క్రిష్‌ కూడా గెలిచాడు.

ప్లస్‌ పాయింట్లు ఏమంటే
1) చరిత్ర అంతా వివరించి కథణి గందరగోళ పరచకుండా స్ట్రెయిట్‌ లైన్‌లో చెప్పడం.
2) భావోద్వేగాలు పండించడం (బాలకృష్ణ శ్రియ సీన్స్‌)
3) బాలకృష్ణ అతిచేయకుండా బ్యాలెన్స్‌డ్‌గా నటించడం
4) మామూలుగా ఇలాంటి సినిమాల్లో చాంతాడంత డైలాగులుండడం రూల్‌ కానీ బుర్రసాయి మాధవ్‌ డైలాగులు క్లుప్తంగా, సూటిగా అర్ధవంతంగా ఉన్నాయి. సాయిమాధవ్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌
5) ఫొటోగ్రఫి బావుంది. బ్యాగ్రవుండ్‌ స్కోర్‌ ఓకే.
6) పాటలు ఎక్కువలేక పోవడం.

మైనస్‌ పాయింట్స్‌
1) సినిమలో ఎక్కువభాగం ఆక్రమించిన యుద్ధసన్నివేశాలు తేలిపోవడం
2) బాలకృష్ణకి వయసు మీద పడినట్టు అనిపించడం. శ్రియాతో నటిస్తున్న ఒక సన్నివేశంలో బాలకృష్ణ బోరబొజ్జ చూసి ప్రేక్షకులు నవ్వారు. నిజానికి ఈ సినిమాలో ఇదొక్కటే కామెడీ సన్నివేశం.
4) ఖైదీ 150లో చిరంజీవి తన ఫిజిక్‌ మీద తీసుకున్న శ్రద్ధ బాలకృష్ణలో లోపించడం. ఒక యుద్ధ వీరుని పాత్ర చేస్తున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
5) ఇతర పాత్రలకి ప్రాధాన్యం లేకపోవడం.
6)హేమమాలినిలాంటి అగ్రనటికి కూడా ప్రాధాన్యత లేకపోవడం.
బాలకృష్ణ అభిమానులకి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మామూలు ప్రేక్షకులకి సెకెండాఫ్‌ కొంచెం బోర్‌ కొడుతుంది. టైటిల్స్‌లో ప్రతిఒక్కరి పేరు ముందు వారి తల్లిగారి పేరువేయడం సముచితంగా ఉంది. అంతేకాకుండా ఈ సినిమా బిగువుగా ఉండడానికి ఎడిటింగ్‌ ప్రధాని కారణం. సంత సన్నివేశంలో ఆర్ట్‌ డైరెక్టర్‌ని కూడా అభినందించాలి.

మొత్తం మీద సంక్రాంతి రేసులో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ సమానంగా ఉన్నారు. ప్రేక్షకులు ఎటు మొగ్గుతారో తేలాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి.

కామెడీ, ఫైట్లు, డాన్స్‌లు కాస్త వర్తమాన పరిస్థితులు ఎక్కితే ఖైధీ నెం 150.
తెలుగుజాతి పౌరుషం, భావోద్వేగాలు నచ్చితే శాతకర్ణి. రెండూ నిరాశ పరచవు. దేనికి పెద్దపీట అనేది క్వశ్చన్‌మార్క్‌.

-జి.ఆర్.మహర్షి

Also Read:

khaidi-150-movie-telugu-review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + 18 =