My title

నా ఓటమికి మీరే బాధ్యులు…. గొల్లుమన్న గాలి

అత్త చనిపోయాక…. ఆరునెలలకు ఏడ్చినట్టుగా ఉంది టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పరిస్థితి. 2014 ఎన్నికల్లో రోజా చేతిలో నగరి నుంచి ఓడిపోయిన ఆయన…. ఇప్పుడు తన ఓటమికి కార్యకర్తలను, నియోజకవర్గ నేతలను తప్పుపట్టారు. తాను ఓడిపోవడానికి కార్యకర్తలు, నాయకులే కారణమని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నేతలు ఉదాసీనంగా లేకుండా పనిచేసి ఉంటే తానే గెలిచేవాడినన్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే తాను మంత్రిని అయ్యేవాడినని, ఆ అవకాశం పోగొట్టుకున్నానని ఆవేదన చెందారు.

పుత్తూరులో జరిగిన నియోజకవర్గ టీడీపీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన సేవలను పార్టీ కార్యకర్తలు, నేతలు గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. తన గురించి చంద్రబాబుకు బాగా తెలుసని అందుకే తాను ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనిచెప్పారు. ఒక్క ఎన్టీఆర్‌ను మినహా మిగిలిన అందరు ముఖ్యమంత్రులను అసెంబ్లీలో గట్టిగా నిలదీసిన చరిత్ర తనకుందన్నారు. కిరణ్‌ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ సీఎం రిలీఫ్‌ ఫండ్ తీసుకొచ్చిన ఘనత తనకుందని గాలి చెప్పారు.