My title

ఇకపై తెర వెనుకే చక్రం తిప్పుతా

కర్నాటక బీజేపీ నేత గాలి జనార్దన్‌ రెడ్డి రూట్ మార్చారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఆయన ఉన్నారు. మరో ఏడాదిలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం అనుచరులతో గాలి జనార్దన్‌ రెడ్డి సమావేశమయ్యారు.

ముఖ్యమైన సన్నిహితులు హాజరైన ఈ భేటీలో గాలి జనార్దన్ రెడ్డి తన రాజకీయ ఆలోచనను వివరించారు. తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని వివరించారు. అయితే జనార్దన్ రెడ్డి నిర్ణయాన్ని తొలుత సన్నిహితులు అంగీకరించలేదు. రాజకీయాల్లో కొనసాగాల్సిందేనని పట్టుబట్టారు. అయితే తాను నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే తనపై చాలా మంది కక్ష కట్టే అవకాశం ఉందని… కాబట్టి తాను తెర వెనుక ఉండే వ్యవహారం నడుపుతానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

తన సోదరులు కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, మిత్రుడు శ్రీరాములు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని వివరించారు. వారి తరపున ప్రచారం చేసే విషయంలో మాత్రం తాను వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదన్నారు. గతంలోనే మంత్రిగా హోదా అనుభవించానని ఇప్పుడు కొత్తగా తనకు రాజకీయాల్లో ఎలాంటి పదవీకాంక్ష లేదని చెప్పారు. తాను నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అన్ని విధాలుగా అండగా ఉంటానని అనుచరులకు ధైర్యం చెప్పారు.

ఎప్పటిలాగే బీజేపీ గెలుపుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గాలిజనార్దన్ రెడ్డి సూచించారు. నిజానికి బళ్లారి, రాయచూరు జిల్లాల్లో గాలి జనార్దన్ రెడ్డికి తిరుగులేని పట్టు ఉంది. గతంలో బళ్లారి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఒకసారి ఇక్కడి నుంచి సోనియాగాంధీ, బీజేపీ ప్రస్తుత కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్‌ తలపడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ ఓడిపోయారు. ఆ సమయంలో వచ్చే ఎన్నికల నాటికి బళ్లారిని బీజేపీకి కంచుకోటగా మార్చి చూపిస్తానని సుష్మ స్వరాజ్‌ దగ్గర గాలి జనార్దన్‌ రెడ్డి ప్రతిజ్ఞ చేసినట్లు చెబుతుంటారు.

గాలి జనార్దన్ రెడ్డి చెప్పినట్టుగానే ఆ తర్వాతి ఎన్నికల నుంచి బళ్లారి ప్రాంతం బీజేపీకి కంచుకోటగా మారిపోయింది. ఇదంతా గాలి జనార్దన్ రెడ్డి, అతడి స్నేహితుడు శ్రీరాములు చేసిన హార్డ్‌ వర్కే కారణమని చెబుతుంటారు. కాంగ్రెస్‌ పార్టీ గాలి జనార్దన్‌ రెడ్డిపై కక్ష కట్టి గతంలో జైలుకు పంపడానికి ఇది కూడా ఒక కారణమని భావిస్తుంటారు. మొత్తం మీద ఇకపై గాలి జనార్దన్‌ రెడ్డి తెర వెనుక నుంచే చక్రం తిప్పబోతున్నారన్న మాట.