My title

కార్పొరేట్లకు మృష్టాన్నం – రైతుకు సున్నం

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే లక్ష రూపాయలు లోబడిన రైతుల రుణాలను మాఫీ చేశారు. దీని వల్ల 2 కోట్ల 10 లక్షల మంది రైతులకు మేలు కలుగుతుంది. రైతు రుణాలు మాఫీ చేయడం అంటే ప్రభుత్వ ఖజానా నుంచి 36,000 కోట్ల భారం భరించడం. తమిళనాడు రైతులు రూ. 40,000 కోట్ల రుణాలు మాఫు చేయాలంటున్నారు. రుణమాఫీ అయిదు ఎకరాలకు మించిన భూవసతి ఉన్న వారికి కూడా వర్తింప చేయాలని తమిళనాడు హైకోర్టు ఆదేశించింది. రైతుల రుణాలు మాఫీ చేయాలనే ఆందోళనలు రెండు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. రుణాలు మాఫీ చేస్తే మేం కొత్త జీవితం ప్రారంభిస్తాం అన్నది రైతుల ఆలోచన.

రైతుల రుణభారం పెరగడానికి ప్రధాన కారణం వారి ఆదాయం తక్కువ కావడమే. 17 రాష్ట్రాలలో రైతుల వార్షిక ఆదాయం రూ. 20,000 లోపే. తక్కువ ఆదాయం ఉన్నందువల్ల సహజంగానే రైతు రుణాల ఊబిలో కూరుకు పోతాడు.

అనావృష్టికి గురైనందువల్ల సహాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ దిల్లీలో అర్థ నగ్న ప్రదర్శన చేస్తున్న తమిళనాడు రైతులు.

ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. ఈ ఏడాది బడ్జెట్ లో రైతులకు రుణాలు ఇవ్వడానికి 10 లక్షల కోట్ల రూపాయలు కేటయించారని ఇది గత సంవత్సరం కన్నా లక్ష కోట్లు ఎక్కువ అని ప్రభుత్వం తన వీపు తానే చరుచుకుంటోంది. మీడియా దీనికి వంత పాడుతూ ఇది వ్యవసాయదారులకు అనుకూలమైన బడ్జెట్, గ్రామీణ బడ్జెట్ అని కీర్తిగానం చేస్తోంది. ప్రభుత్వ కేటాయింపు పెరగడం వాస్తవం కావొచ్చు. కాని ఈ ఏడాది రైతులకు అందజేయాలనుకుంటున్న పది లక్షల కోట్లలో 75 శాతం చివరకు పారిశ్రామిక రంగానికే దక్కుతుంది. చిన్న రైతులకు దక్కేది కేవలం 8శాతమే.

వార్షిక ఆదాయం రూ.20, 000 దాటని రైతులకు రుణాలు తిరిగి చెల్లించడం ఎంత కష్టమో కోట్లాది రూపాయల లాభాలు ఆర్జించే కార్పొరేట్ రంగం కూడా రుణాలు చెల్లించడం లేదన్నది అంతే వాస్తవం. జిందాల్ ఉక్కు, విద్యుత్ సంస్థ చెల్లించవలసిన రుణాలు రూ. 44, 000 కోట్లు. అంటే ఆ ఒక్క సంస్థ బకాయి పడ్డ సొమ్మే ఉత్తరప్రదేశ్ లో రైతుల రుణాలు మాఫీ చేయడానికి ప్రభుత్వం భరించవలసిన రూ. 36,000 కోట్ల కన్నా ఎక్కువ. పంజాబ్ లో భూషణ్ ఇండస్ట్రీస్ బకాయి పడ్డ రుణాం రూ. 44,000 కోట్లు. పంజాబ్ రైతులు మాఫీ చేయమంటున్న రుణాల మొత్తం రూ. 36,000 కోట్లు మాత్రమే. అంటే భూషణ్ ఇండస్ట్రీస్ బకాయి కన్నా 8,000 కోట్లు తక్కువే. మొత్తం ఉక్కు పరిశ్రమ చెల్లించవలసిన రుణాలు రూ. 1, 50,000 కోట్లు అని అంచనా. ఈ రుణాలు మాఫీ చేయాలంటున్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తే మాత్రం నానా యాగీ చేస్తారు. కాని 2008-09లో ఆంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పుడు పారిశ్రామిక రంగానికి రూ. 3 లక్షల కోట్ల మేర సహాయం అందజేశారు. ఆ సహాయక చర్యలు ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. పారిశ్రామిక రంగానికి అంత సొమ్ము కట్టబెట్టినప్పుడు ఎవరూ నోరెత్తలేదు.

రైతుల గోడు పట్టించుకునే వారు లేరు. రైతుల వ్యవహారం అమ్మకం సరుకు కాదు కనక మీడియా పట్టించుకోదు. విధాన నిర్ణయాలు తీసుకునే వారు పారిశ్రామికవేత్తల గుప్పెట్లో ఉంటారు. రాజకీయవాదులూ పైకి ఏం చెప్పినా కార్పొరేట్ రంగానికి లోబడి ఉండేవారే. వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యవహారం అని టముకు వేసే రాజకీయనాయకులకు కొదవ లేదు. రైతులు గ్రామాలు వదిలి పట్టణాలకు రావాలని ఉచిత సలహాలు పడేస్తారు తప్ప సమస్య మూలాల్లోకి వెళ్లి ఆలోచించరు. వ్యవసాయం దండగ అన్న వాదన ప్రపంచ బ్యాంకు మన బుర్రల్లో నాటింది. మన దేశంలోని 4 కోట్ల మంది 2015 కల్లా గ్రామాలనుంచి పట్టణాలకు వలస వెళ్తారని ప్రపంచ బ్యాంకు 1996లో అంచనా వేసింది. అందువల్ల రైతులకు నైపుణ్యాభివృద్ధి చేసుకోవడంలో శిక్షణ ఇవ్వాలని సలహా కూడా ఇచ్చింది. గ్రామాలనుంచి వలస వచ్చే వారు చేయాల్సింది పారిశ్రామిక కార్మికులుగా మారడమే. ఆ ఉద్యోగాలెక్కడున్నాయి గనక. పీవీ నరసింహా రావ్, అటల్ బిహారీ వాజపేయి అధికారం చేపట్టినప్పుడు కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న వాదన వాగ్దానాలకు మురిసిపోవడానికి తప్ప ఎందుకూ పనికి రాలేదు. నరేంద్ర మోదీ ప్రచారార్భాటంలో నిష్ణాతుడు కనక ఏకంగా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ మాట కూడా గడప దాటిన జాడలు లేవు.

కార్పొరేట్ రంగం మరో ముందడుగు వేసి 2022 కల్లా 3 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని బీరాలు పలుకుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక 70 ఏళ్లలో సాధించనిది అయిదేళ్లలో ఎలా సాధ్యమో తెలియదు. ఈ కల్లబొల్లి కబుర్లను ఎండగట్టే వారే లేరు. పట్టణ ప్రాంతాలలో నివసించే వారు ఉపాధి కోల్పోయినా వారి అప్పులు తీర్చమని అడగడం లేదు కనక రైతుల రుణాలు ఎందుకు తీర్చాలి అని ప్రశ్నించే వారు లేక పోలేదు. కాని కార్పొరేట్ రంగం బకాయి పడ్డ రూ. 6.8 లక్షల కోట్లు రద్దు చేయడానికి సిద్ధపడినా ప్రశ్నించాలన్న ఆలోచనే ఇలాంటి వారికి రాదు.

రైతులకు అప్పుల బాధ వారి  సమస్యల్లో ఒకటి మాత్రమే. ప్రతి పంటకాలంలోనూ క్రమం తప్పకుండా పునరావృతం అయ్యే సమస్య పంట చేతికొచ్చినప్పుడు ధర పలకక పోవడం. మధ్య ప్రదేశ్ రైతులు తమ కమలా పళ్లకు ధర పలకక, కొనే నాథుడు లేక వాటిని రోడ్ల మీద పారబోస్తున్నారని, బంగాళాదుంప రైతులదీ పశ్చిమ బెంగాల్ లో అదే పరిస్థితి అని ఆలోచించరు. టొమాటో రైతులైతే ధర పలకనప్పుడల్లా 20 ఏళ్లుగా పంటను రోడ్ల పాలు చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే టొమాటో కెచప్ తయారు చేసే పరిశ్రమ టొమాటో గుజ్జును భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటూనే ఉంది. రైతుకు ధర పలకక పారబోస్తూ ఉంటే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటే లోపం ఎక్కడుందో ఆలోచించాలి కదా. పంటలు అధికంగా పండించాలని ప్రభుత్వం ఊదరగొడ్తుంది. తీరా పండించిన తర్వాత కొనే వారు కరువు. పప్పు దినుసుల రైతులదీ అదే పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాని ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసి పని అయి పోయిందనుకుంటుంది.

23 పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. కాని నికరంగా ప్రభుత్వం సేకరించేది బియ్యం, గోదుమలు మాత్రమే. కనీస మద్దతు ధర వల్ల ప్రయోజనం కలిగే రైతులు కేవలం ఆరు శాతం మాత్రమే. 94 శాతం మంది రైతులు మార్కెట్ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే. మార్కెట్లు నిజంగా సమర్థంగా పని చేసేటట్టయితే వ్యవసాయ రంగానికి సంక్షోభమే ఉండదు.

వ్యవసాయ శాస్త్రవేత్త దేవేంద్ర శర్మ

మౌలిక సదుపాయాలు అంటే మన దృష్టిలో రహదార్లు, ఫ్లై ఓవర్లు మాత్రమే. వ్యవసాయరంగాభివృద్ధికి మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంటుందన్న ఆలోచనే రాదు.  సాగు నీటి సదుపాయం, మార్కెట్ అందుబాటు, కనీస స్థాయిలోనైనా గిట్టుబాటు ధర అందడం మొదలైనవి అన్నీ మౌలిక సదుపాయాల కిందే లెక్క. అలాగని సాగునీటి సదుపాయం ఉన్నంత మాత్రాన రైతు బతుకు సుఖంగా ఉంటుందని చెప్పలేం. ఉదాహరణకు పంజాబ్ లో 98శాతం సేద్యపు భూములకు నీటి సదుపాయం ఉంది కాని ప్రతి రోజూ ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రైతుల అసలు సమస్య ఉత్పాదకత కాదు. ఆదాయం మార్గాలు లేకపోవడమే.

1970 నుంచి 2015 దాకా సేకరణ ధర ప్రకారం లెక్కేస్తే రైతుల ఆదాయం 45 ఏళ్లలో 19 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం 120 నుంచి 150 రెట్లు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు జనాభాలఒ కేవలం 1.3 శాతం మందే. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల వేతనాలు 150 నుంచి 175 రెట్లు పెరిగాయి. పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలు 280 నుంచి 300 రెట్లు పెరిగాయి. కార్పొరేట్ సంస్థలలో మధ్య స్థాయిలో పని చేసే మేనేజర్ల జీతాలు వెయ్యి రెట్లు పెరిగాయి. విభిన్న వర్గాల వారి ఆదాయం పెరుగుదల తీరు గమనిస్తే రైతుల ఆదాయం కనీసం 100 రెట్లైనా పెరిగి ఉండాలి. వాస్తవంగా పెరిగింది 19 రెట్లు మాత్రమే. రైతుల ఆదాయం అదే రీతిలో పెరిగి ఉంటే గ్రామాల నుంచి పట్టణాలకు వలసల బదులు పట్టణాలనుంచి గ్రామాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండేది.

జనాభాలో 52 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడతారు. 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో వ్యవసాయ రంగానికి కేటాయించింది రూ. లక్ష కోట్లు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ మొత్తం రూ. 1.5 లక్షల కోట్లు. అంటే పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం రూ. 2.5 లక్షల కోట్లు. రైతులు పండించిన పంట అమ్ముకోవడానికి ఉన్న సదుపాయాలు అంతంత మాత్రమే. నియంత్రిత మార్కెట్లు దేశం మొత్తం మీద 7,000 ఉన్నాయి. ప్రతి అయిదు కిలోమీటర్ల పరిధిలో ఒక వ్యవసాయ మార్కెట్ ఉంటే రైతులు తమ పంట సులభంగా అమ్ముకోగలుగుతారు. లేకపోతే మధ్య దళారుల మీద ఆధారపడాల్సిందే. అంటే 42,000 మండీలు అవసరం.

పంట బాగా పండింది అనుకున్న సమయంలో ధర అమాంతం పడిపోతుంది. రైతులకు గిట్టుబాటు ధర లభించే మాట అటుంచి పెట్టుబడి కూడా రాని దుస్థితి ఏర్పడుతుంది.

ప్రభుత్వోద్యోగుల వేతనాలు పెరిగితే తమ వస్తువులకు గిరాకీ పెరుగుతుందని పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఇదే పెరుగుదల రైతుల జీవితాలలో సాధ్యమైతే అన్నింటికీ గిరాకీ పెరిగి ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. కాని రైతులకు సంఘటిత శక్తి లేదు కనక వారి గోడు పట్టించుకునే వారు ఉండరు. రైతులను అన్ని రాజకీయపక్షాలు ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తాయి. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిన నాయకులు కూడా పట్టణ గాలి పీల్చిన తర్వాత వ్యాపార, పారిశ్రామిక వర్గాల పాటే పాడతారు. 

-ఆర్వీ రామారావ్

(వ్యవసాయ శాస్త్రవేత్త దేవేంద్ర శర్మ రిడిఫ్ డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ అదారంగా)