My title

రైతు రుణ మాఫీ సర్వరోగ నివారిణి కాదు

  • రుణ మాఫీల వల్ల రైతుల సమస్యలు తీరవు

 స్వాతంత్ర్యానంతరం 70 ఏళ్ల తర్వాత కూడా రుతుపవనాలు సరిగ్గా లేనందువల్ల ఏర్పడే అనావృష్టి, వరదలు, పంటలు పండకపోవడం వంటి సమస్యలు కలగలిసి రైతులను, వ్యవసాయ కార్మికులను కష్టాల్లోకి నెట్టడం కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ సమస్య మరింత జటిలమైంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి సరైన వ్యవసాయ విధానాలు అనుసరించనందువల్ల గ్రామీణ భారతం ఇబ్బందులు పడుతూనే ఉంది. తమిళనాడు రైతులు నెల రోజులుగా దిల్లీలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారు చచ్చిన పాములను, ఎలకలను నోట్లో పెట్టుకుని ఉన్న దృశ్యాలు కలత కలిగిస్తున్నాయి. తమ పొలాల్లో చచ్చిన పాములు, ఎలకలు తప్ప ఏమీ లేదని చెప్పడానికి వారు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుమాలిన స్థితిలో మరణించిన తమ వారి కంకాళాలను కూడా రైతులు ఈ నిరసనలో ప్రదర్శిస్తున్నారు. ఇది వ్యవసాయ రంగం ఎంత దయనీయంగా ఉంది అనడానికి నిదర్శనం.

నైరుతి రుతుపవనాలు బాగానే ఉన్నా గత రెండు సంవత్సరాల నుంచి ఈశాన్య రుతుపవనాలు విఫలమైనందువల్ల దేశంలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర అనావృష్టి ఏర్పడింది. కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ మొత్తం ఎనిమిది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అనావృష్టి పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. 2017లో తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని అనావృష్టి పీడిత ప్రాంతంగా ప్రకటించి చిన్న, మధ్య తరహా రైతులు సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది. తమిళనాడులో 92 శాతం మంది ఇలాంటి వారే. ఆ తర్వాత రైతులందరి సహకార బ్యాంకు రుణాలను కూడా మాఫీ  చేయాలని ఆదేశించింది. సహకార బ్యాంకులు ఇచ్చిన రుణాలలో 30 శాతం పెద్ద రైతులకే అందాయి. ప్రస్తుతం తమిళనాడు రైతులు జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాలని, పంటలు పండనందువల్ల మెరుగైన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రూ. 36, 359 కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేసింది.

ఇలాంటి చర్యలవల్ల రైతులకు కొంత ఉపశమనం కలిగే మాట వాస్తవమే కాని దీర్ఘకాలికంగా వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సంక్షోభానికి, రుణ భారానికి ఇవి సర్వరోగ నివారిణిలు మాత్రం కావు. రుణ మాఫీ మహా అయితే తాత్కాలికంగా పరిస్థితిని ఎదుర్కోవడానికి ఉపకరిస్తుంది. 2008లో యూపీఏ ప్రభుత్వం భారీ స్థాయిలో రుణ మాఫీ చేపట్టి రూ. 70,000 కోట్ల మేర వ్యవసాయ రుణాలు మాఫీ చేసింది. అంత పెద్ద మొత్తం ఖర్చు చేసినా, అది అనివార్యమైనా అది ఒకసారికి పని చేసేది, రుణ భారం నుంచి ఓ మేరకు ఉపశమనం కలిగించేదే తప్ప పదే పదే తలెత్తే గ్రామీణ రుణ భారాన్ని మాత్రం తీర్చలేదు. అందుకే సాధారణంగా నోరు విప్పని రిజర్వు బ్యాంకు గవర్నర్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) అధిపతి రుణమాఫీ ‘నైతిక ముప్పు’ కు దారి తీస్తుందని, నిజాయితీగా రుణాలు చెల్లించే వారు కూడా సకాలానికి అప్పు తీర్చరని చెప్పారు. రుణాల మాఫీ వల్ల రుణాల క్రమశిక్షణ తగ్గుతుందని, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకోవాల్సి వస్తుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ అన్నారు. ఇది జాతి ఆదాయ వ్యయాల పట్టికను దెబ్బ తీస్తుంది అని పటేల్ చెప్పారు.

వాస్తవాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రుణ మాఫీ వల్ల తమ పలుకుబడి పెరుగుతుందని రాజకీయ నాయకులు అనుకుంటారు. నైతిక ముప్పును ఖాతరు చేయరు. రుణ మాఫీ చేయకపోతే 2009లో యూపీఏ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదని చాలా మంది వాదించారు. వ్యవసాయ రుణాల మాఫీ, సబ్సిడీలు మన దేశంలో నిరుపేదలకు ఉపయోగపడడం లేదు. నిజానికి దీని వల్ల భూమి లేని వ్యవసాయ కార్మికులకు, చిన్న కమతాలు ఉన్న వారికి ప్రయోజనం లేదు. అప్పుల బాధకు ఎక్కువగా గురయ్యే వారు ఈ వర్గాల వారే. ఈ రైతులను రుణాలు ఇవ్వడానికి తగిన వారుగా బ్యాంకులు భావించవు. వారికి బ్యాంకు రుణాలు అందుబాటులో ఉండవు. వారు విపరీతంగా వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడతారు. భారత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘ కాలంగా సమస్యలు ఉన్నందువల్ల, సబ్సిడీలు సరిగ్గా అందుబాటులో లేనందువల్ల, భూకమతాల యాజమాన్య వ్యవహారం సవ్యంగా లేనందువల్ల, ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు దిగజారుతున్నందువల్ల రుణ మాఫీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదు.

వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉండడమే కాదు. అది మరింత తీవ్రమవుతోంది. శీతోష్ణ స్థితిలో, వాతావరణంలో తీవ్రమైన  మార్పుల వల్ల రైతులకు భరోసా లేకుండా పోయింది. నీటి పారుదల వ్యవస్థలు సరిగ్గా లేవు. వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం అస్తవ్యస్థంగానే ఉన్నాయి. అందువల్ల అంతరించి పోయే భూగర్భ జలాల మీద ఎక్కువగా ఆధారపడవలసి వస్తోంది. దేశంలోని సగం వ్యవసాయ భూములకు ఇప్పటికీ నికరమైన సాగు నీటి వసతి లేదు. మహాత్మా గాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అనావృష్టి నెలకొన్న రాష్ట్రాలలో పని కల్పించే దినాలను 150కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగిందే. నీటిని నిలవ చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం, నీటిపారుదల మెరుగు పరచడం, అనావృష్టి లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించడం వంటివి సత్వరం అమలు చేయాలి.

 రైతుల ఆదాయ వ్యయాలలో ఎగుడుదిగుళ్లకు అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఆదాయం తగ్గుతోంది. ఆదాయం ఉంటుందో లేదో కూడా తెలియని అనిశ్చిత పరిస్థితి ఉంది. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యవసాయ మార్కెట్లు సవ్యంగా లేవు. వ్యవసాయాదాయం తగ్గి పోవడం, గ్రామీణ రుణభారాన్ని ఈ దృష్టితో పరిశీలించాలి. వ్యవస్థా పరమైన ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈ సుడిగుండంలోనుంచి బయట పడడం సాధ్యం కాదు. రుణ మాఫీ మహా అయితే గాయం తగిలితే పట్టీ కట్టడం లాంటిదే. అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. శాశ్వత పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సే ఉంది. 

(ఇ.పి.డబ్ల్యు. – 2017 ఏప్రిల్ 15 సంచిక సౌజన్యంతో)