My title

ఇక ఎంసెట్ రద్దు…. మెడిసిన్ కు NEET లాగా ఇంజనీరింగ్ కు JEE

దేశవ్యాప్తంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో మార్పులు తెచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్‌ ప్రవేశాలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారానే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనపై రెండేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నా.. ఆచరణలోకి మాత్రం రాలేదు. అయితే… వచ్చే ఏడాది మాత్రం పక్కాగా అమలు చేయాలని కేంద్ర నిర్ణయించినట్లు, ఈ మేరకు రాష్ట్రాలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిసింది.

IIT, NITల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE మెయిన్‌ ప్రవేశ పరీక్ష ఆధారంగానే రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలు కూడా కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే ఇందుకోసం మళ్లీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని భావించి.. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలోనే కేంద్రం జేఈఈ మెయిన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం దేశంలో IIT,NITల్లో ప్రవేశాలకు JEE మెయిన్‌ ప్రవేశ పరీక్ష ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌లో ప్రవేశం కోరుకునే స్టూడెట్స్ ఇక తప్పకుండా JEE మెయిన్‌ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష తర్వాత విద్యార్థులు జాతీయ స్థాయిలో పొందిన ర్యాంకులకు అనుగుణంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ద్వారా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారు. 

ఇదే జరిగితే ఎంసెట్‌ పరీక్షకు స్వస్తి పలికినట్టే.  MBBS,BDS ప్రవేశాలను నీట్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలతోపాటు బీఫార్మసీ, పలు వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. ఇక ఇంజనీరింగ్‌నూ తొలగిస్తే.. బీఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలే నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో వీటికి మరో పరీక్ష నిర్వహించి, ఎంసెట్‌ను రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు.