My title

నీలిరంగులోకి మారుతున్న కుక్కలు

ముంబాయి కాలుష్యం ఇప్పుడు మూగజీవాల బతుకులను అతలాకుతలం చేస్తోంది. నావీ ముంబాయిలోని తలోజా పారిశ్రామిక ప్రాంతంలో కుక్కలు ఏకంగా రంగు మారుతున్నాయి. ఇక్కడి పరిశ్రమల నుంచి వస్తున్న వర్థ్యాలను పక్కనే ఉన్న కసది నదిలోకి వదులుతున్నారు. ఆ నీరు చెరువులకు చేరుతోంది.  ఈ నీటిని తాగిన కుక్కలు నీలి రంగులోకి మారిపోతున్నాయి. తొలుత ఎవరో కుక్కలపై రంగు జల్లారని భావించారు. కానీ రానురాను ఆ ప్రాంతంలోని కుక్కలన్నీ నీలిరంగులోకి మారిపోవడంతో అందరూ అప్రమత్తమయ్యారు.

కాలుషితమైన నీటిని తాగడం వల్లే కుక్కలు నీలి రంగులోకి మారిపోతున్నాయని నిర్ధారించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కొందరు మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వేస్టేజ్‌ను సరైన రీతిలో దారి మళ్లించకపోవడంతో ఈ ప్రాంతమంతా కాలుష్యమయమవుతోందని ఆందోళన చెందారు. ఈ కాలుష్యం జంతువులపైనే కాకుండా మనుషులపై ప్రభావం చూపుతుందని ఆందోళనచెందుతున్నారు. కసది నదిలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం కూడా దారుణంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. చాలా పక్షులు కూడా ఈ నీటిని తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయని నేవీ ముంబాయ్‌లో ఎనిమల్ ప్రొటెక్షన్‌ సెల్‌ను నడుపుతున్న ఆర్తి చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు.