My title

ప్రియుడే హంత‌కుడు…. మిస్ట‌రీ వీడిన చాందిని కేసు

హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టించిన చాందిని జైన్ హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. ప్రియుడు సాయికిర‌ణ్ ఆమెను హ‌త‌మార్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. చాందిని స్కూల్‌మేట్ అయిన సాయికిర‌ణ్‌తో కొన్ని రోజులుగా చాందిని ల‌వ్‌లో ప‌డింది. వీరి మ‌ధ్య చాలా కాలం నుంచి ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. అయితే కొన్నాళ్లుగా పెళ్లి చేసుకోమ‌ని చాందిని సాయికిర‌ణ్‌ని అడుగుతోంది. వీరి మ‌ధ్య ఈ విష‌యంలో చాలాసార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. అయితే శ‌నివారం కూడా సాయికిర‌ణ్‌తో పెళ్లి విష‌యంపై చాందిని గొడ‌వ‌పడింది. దీంతో మాట్లాడుకుందామ‌ని చాందినిని అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ అమీన్ పూర్ గుట్టల వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవి ఫుటేజీలో స్పష్టంగా రికార్డయ్యాయి. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తుందన్న కారణంతోనే సాయికిరణ్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

చాందిని సెల్‌లో ‘మై హార్ట్’ పేరుతో  సాయికిరణ్ నంబర్  ఫీడ్ అయి ఉంది. దీంతోపాటు శ‌నివారం రోజు ఈ నెంబ‌ర్‌కు ప‌ది సార్లు కాల్స్ వెళ్లాయి. చాందిని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఈ నెంబ‌ర్‌కే కాల్‌చేసిన‌ట్లు ట‌వ‌ర్ సిగ్న‌ల్ ఆధారంగా గుర్తించారు. దీంతో సాయికిర‌ణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే సాయికిర‌ణ్ ఒక్క‌డే చంపాడా?  లేక అతనికి ఇత‌ర ఫ్రెండ్స్ సాయం  చేశారా? ఇక ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. మ‌రోవైపు సాయికిర‌ణ్ ఒక్క‌డే త‌మ కూతురిని చంప‌లేద‌ని..అత‌నికి ఇంకో ఇద్ద‌రు స‌హ‌క‌రించిన‌ట్లు త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని చాందిని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.