My title

కాంగ్రెస్ పార్టీకి శని హైకమాండే

తెలంగాణలో కాంగ్రెస్‌ నాశనం అయిపోవడానికి దిగ్విజయ్ సింగే కారణమని ఒకప్పుడు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన ప్రస్తుత టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం అయ్యేందుకు సిద్ధమైన సమయంలో దిగ్విజయ్ సింగే అడ్డుపడ్డారని చెప్పారు.

టీఆర్ఎస్‌ను విలీనం చేస్తే కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడంలో తప్పులేదని తాను స్వయంగా సోనియాగాంధీకే చెప్పానన్నారు.  కానీ రాహుల్‌ గాంధీ చుట్టూ చేరిన దిగ్విజయ్‌ సింగ్‌ లాంటి వారు అడ్డుపడడం వల్లే టీఆర్ఎస్ విలీనం జరగలేదన్నారు.  రాష్ట్రంలో పరిణామాలపై 2007లో తాను సోనియా గాంధీకి లేఖ రాశానని… అది తిరిగి దిగ్విజయ్ సింగ్ చేతికే వెళ్లిందని అప్పటి నుంచి తనపై దిగ్విజయ్ సింగ్ కక్ష పెంచుకున్నారని చెప్పారు.

అందువల్లే  శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేతగా ఉన్న తనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి రాకుండా దిగ్విజయ్ సింగ్ అడ్డుకున్నారని చెప్పారు. వైఎస్‌కు తాను అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడినన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కేవీపీతో పాటు తనను కూడా వైఎస్‌ పిలిపించుకునేవారని చెప్పారు.  వైఎస్సే ముఖ్యమంత్రి కావాలని తాను కూడా సూచించానన్నారు. కానీ ఆ తర్వాత తమ మధ్య హైకమాండే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందన్నారు.

పార్టీలో పెద్ద నేతలు కలిసి పనిచేస్తుంటే వారి మధ్య చిచ్చు పెట్టడం  కాంగ్రెస్‌ హైకమాండ్‌ పద్దతిని విమర్శించారు. రోశయ్యను ముఖ్యమంత్రిని చేసే సమయంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగానే చెప్పారని.. కానీ  ఆ తర్వాత మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించేందుకు కాంగ్రెస్ చాలా సమయం తీసుకుందన్నారు. రోశయ్యను తీసేసి  ఆ స్థానంలో కిరణ్‌కుమార్‌ రెడ్డిని ఎందుకు సీఎంగా చేశారో తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు.

కిరణ్‌కుమార్ రెడ్డికి చిదంబరం సహకరించారన్న భావన పార్టీలో బలంగా ఉందన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అయితే జగన్‌ను బలంగా ఢీకొంటారని చెప్పి కొందరు హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించారన్నారు. బలంగా ఢీకొట్టడానికి అదేమైనా రేసా అని డీఎస్ ఎద్దేవా చేశారు. 2004లో మరోసారి తాను గెలిచి ఉంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్లేదని ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను డీఎస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఆ సమయంలో సరిగా పనిచేసి ఉంటే పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెడతారని డీఎస్ ప్రశ్నించారు.  40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని కాంగ్రెస్‌ను వీడడం కష్టమే అయినా ప్రస్తుతం పార్టీ సోనియా గాంధీ చేతిలో లేదని, రాహుల్‌ గాంధీ చేతిలో ఉందన్నారు. అతడి చుట్టూ దిగ్విజయ్ సింగ్ లాంటి వారు చేరి స్పాయిల్ చేశారని విమర్శించారు.