My title

“చెలియా” మూవీ రివ్యూ

రివ్యూ: చెలియా

రేటింగ్‌: 2/5

తారాగణం: కార్తి, అదితిరావ్ హైదరి, తదితరులు

సంగీతం:  ఏఆర్ రెహమాన్

నిర్మాత: దిల్ రాజు

దర్శకత్వం: మణిరత్నం

తెలుగు, తమిళ భాషలలో మాస్టర్ పీసెస్ అనదగ్గ సినిమాల లిస్టు కనక రాసుకుంటే అందులో మణిరత్నం సినిమాలు కనీసం పది దాకా ఉంటాయి. ఎవరికీ సాధ్యం కాని టిపికల్ స్టైల్ లో సినిమాలు తీస్తూనే మాస్ క్లాసు తేడా లేకుండా అందరిని మెప్పించడం ఆయన స్పెషాలిటీ. కాని గత దశాబ్ద కాలంగా మణిరత్నం నిజమైన రేంజ్ కు తగ్గ సినిమా అయితే ఏది రాలేదు. ‘ఓకే బంగారం’ మంచి విజయం సాధించినా అది పరిమిత వర్గాన్ని మాత్రమే విపరీతంగా ఆకట్టుకుంది. కొంచెం గ్యాప్ తీసుకుని కార్తీ హీరోగా మణిరత్నం చేసిన మరో ప్రయత్నమే ‘చెలియా’. ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలు కొని ఇటీవలే విడుదల చేసిన రెండు ట్రైలర్ల వరకు చాలా ఆసక్తి రేపిన ఈ మూవీ విపరీతమైన చిన్న సినిమాల పోటీ మధ్య విడుదల అయ్యింది. యూత్ ని టార్గెట్ చేసిన మణి దానికి తగ్గ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోగలిగాడు.

ఇది చాలా సింపుల్ కథ. ఆర్మీ పైలట్ అండ్ డాక్టర్ మధ్య జరిగే ప్రేమ కథ. చిన్న అపార్థాలు. కొంత గ్యాప్. ఆ తరువాత మళ్ళీ కలుసుకోవడం, సహజీవనం. అటుపై మళ్ళీ విడిపోవడం. హీరో పూర్తిగా కనిపించకుండా పోవడం. చివరికి హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో వస్తే అన్ని మరిచిపోయి ఒక్కటి కావడం. రెండున్నర గంటల సినిమాలో ఇదే కథ. కొంచెం డిటైల్డ్ గా చెప్పుకుంటే వరుణ్(కార్తీ) ఒక యాక్సిడెంట్ లో గాయ పడితే అతనికి డాక్టర్ లీల అబ్రహం(అదితి హైదర్ రావు)ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య క్రమంగా ప్రేమ మొదలవుతుంది. ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న టైంలో వరుణ్ నిర్లక్ష్యం వల్ల అది జరగదు. లీల దూరంగా వెళ్ళిపోతుంది. ఇంతలో కార్గిల్ యుద్ధం లో వరుణ్ పాకిస్తాన్ కు దొరుకుతాడు. అక్కడ జైల్లో ఇద్దరు ఖైదీల సహాయంతో తప్పించుకుని ఇండియా కు వచ్చేస్తాడు. ఆ తర్వాత లీలను ఎలా కలుసుకున్నాడు, చివర్లో లీల ఇచ్చిన షాక్ ఏంటి అనేది మిగిలిన కథ.

కార్తీ నటుడిగా ఎప్పటికప్పుడు తను పర్ఫెక్ట్ అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తీ ఇందులో బాగా కోపం ఉన్న ఆర్మీ పైలట్ గా మంచి నటన కనపరిచాడు. మీసం లేకుండా చూడటం ఫ్రెష్ గా అనిపిస్తుంది. పైగా దానికి బాగా సూట్ అయ్యాడు కూడా. వంక పెట్టడానికి ఏమి లేదు. చెప్పింది చెప్పినట్టు చేసాడు. ఇక హీరొయిన్ ఆదితి అందంగానే ఉంది కాని కొన్ని చోట్ల టుస్సాడ్ మ్యుజియం లోని మైనపు బొమ్మలా కనిపిస్తుంది. బహుశా మేకప్ ప్రభావం వల్ల కావొచ్చు. యాక్టింగ్ పరంగా బాగా చేసింది. కార్తీ తో కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక ఈ ఇద్దరు మినహాయిస్తే చెప్పుకోదగ్గ నటులు కానీ, నటన కాని ఇందులో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అన్ని అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రలే. హీరో హీరొయిన్ తప్ప ఇంకెవరు రిజిస్టర్ అయ్యే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు మణిరత్నం.

ఇక టేకింగ్ విషయానికి వస్తే ఆ మధ్య కడలి తర్వాత ఓపికకు పరీక్ష పెట్టిన మణిరత్నం సినిమా ఇదేనని చెప్పొచ్చు. కేవలం హీరో హీరొయిన్ లవ్ ట్రాక్, వాళ్ళ మధ్య రొమాన్స్ మీదే ఫోకస్ పెట్టిన మణి మిగిలినవన్నీ గాలికి వదిలేసాడు. చిన్న చిన్న సన్నివేశాలను కూడా నిమిషాల తరబడి సాగాదీయటం వల్ల బాగా అసహనంగా అనిపిస్తుంది. ఓకే బంగారం ఆదరించారు కాబట్టి కాస్త లైన్ మార్చి అలాగే తీస్తే చెల్లుతుంది అని అనుకున్న మణిరత్నం లెక్క ఈ సారి పూర్తిగా తప్పింది. సెకండ్ హాఫ్ మొత్తం ఎంతకీ కథ ముందుకు సాగదు. కేవలం లీడ్ పెయిర్ తో లవ్ ట్రాక్ ఉంటే చాలు మిగిలిన క్యారెక్టర్లు అవసరం లేదు అనేలా మణి వేసిన ప్లాన్ ఈ సారి మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ సినిమాను అంతో ఇంతో కాపాడింది మాత్రం కెమెరా మెన్ రవి వర్మన్. తన పనితనంతో కాశ్మీర్ అందాలను ఎసి థియేటర్ లో కళ్ళ ముందు నిలుపుతాడు. పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్, లవ్ సీన్స్ ఒకటేమిటి తన టాలెంట్ కి అద్భుతమైన ప్లాట్ ఫార్మ్ వేసుకున్నాడు. కానీ కథనే సపోర్ట్ చేయలేదు. ఇక రెహ్మాన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ వరకు ఓకే కాని పాటలు మాత్రం చప్పగా ఉన్నాయి. నిర్మాణ విలువలు మాత్రం టాప్ చైర్ లో కూర్చోపెట్టారు.

చివరిగా చెప్పాలంటే మణిరత్నం బెస్ట్ మూవీస్ లిస్ట్ లో చేర్చే అవకాశం చెలియాకు లేదు. కడలి, విలన్ లాంటి సినిమాలతో దీన్ని జత చేయాల్సి రావడం బాధ కలిగించే విషయమే అయినా బలహీనమైన కథా కథనాల వల్ల సినిమా అసలు ఉద్దేశం మాత్రం దెబ్బ తింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ తో పాటు ఎంటర్‌టైన్మెంట్ కావాలని కోరుకుంటే మాత్రం ఇది ముమ్మాటికి నిరాశ పరిచే సినిమానే. మణిరత్నం లో మునుపటి వాడి తగ్గింది అనడానికి మరో ఉదాహరణగా నిలిచింది చెలియా. వేసవి ఉక్కపోత తట్టుకోలేక ఎసి ధియేటర్ లో కూర్చుని కాసేపు సేద తీరడానికి తప్ప చెలియా తప్పనిసరి ఛాయస్ గా పెట్టుకునే మూవీ అయితే కాదు.

– సర్వేశ్వర్‌