My title

బాబుకు కేంద్రం బ్రేక్‌….

చంద్రబాబు ఇష్టారాజ్యానికి కేంద్రం తాత్కాలికంగా బ్రేక్ వేసింది. డబ్బులు లేవంటూ స్థాయికి మించి వేల కోట్లు అప్పు తెచ్చి…. ఆ సొమ్ముతో ఈవెంట్లు నిర్వహిస్తూ వృథా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. తదుపురి అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. ఇప్పటికే పరిధికి మించి అప్పులు చేశారని…. కొత్తగా అప్పు తీసుకునేందుకు అనుమతి కావాలంటే ముందుగా గత మూడేళ్లకు గాను రాష్ట్ర స్థూల ఉత్పాదకత, అప్పుల వివరాలను పంపాలని అప్పుడే తాము తదుపరి అప్పుకు అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పింది. తాము అనుమతి ఇచ్చే వరకు కొత్తగా అప్పులు కూడా చేయవద్దని స్పష్టం చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 23వేల కోట్లు అప్పు తీసుకురావాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే తొలి ఆరు నెలల్లోనే ఈ అప్పు ఏకంగా 18వేల 900 కోట్లకు చేరింది. ఇందులో 16వేల 100 కోట్లు ఓపెన్ మార్కెట్ నుంచి, రెండు వేల 800 కోట్లు విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చింది. దీంతో ఏపీ పోకడపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రస్థూల ఉత్పాదకతలో 3శాతానికి మించి అప్పు చేయకూడదని 14వ ఆర్థిక సంఘం నిబంధన చెబుతోంది. పైగా తెచ్చిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర అవసరాలకు వాడకూడదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇక్కడ కూడా నిబంధనలను బేఖాతరు చేసింది. తెచ్చిన అప్పులో కేవలం 10 వేల కోట్లను మాత్రమే ఆస్తుల కల్పనకు వాడుకుంది. మిగిలినదంతా అనుత్పాదక వ్యవహారాల్లో వెదజల్లింది. తెచ్చిన అప్పులను ఆస్తుల పెంపుకు కాకుండా అనుత్పాదక రంగంలో ఖర్చు పెడితే దాని వల్ల తిరిగి రాబడి లేక అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదపోకడను గమనించిన కేంద్రం …. తాజాగా మరో నాలుగు వేల కోట్ల అప్పుకు అనుమతివ్వాలంటూ ఏపీ చేసుకున్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ముందు గత మూడేళ్ల  ఖర్చుల వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.