My title

గెలిస్తే చూద్దాం….

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్పాచక్రపాణిరెడ్డి… ఆ క్షణమే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దమ్ముంటే ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా తన లాగే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అయితే ఎప్పటిలాగే ఆ ఒక్కటి అడక్కు అంటూ ఫిరాయింపుదారులు సైడ్‌ అయిపోయారు.  ఇప్పుడు శిల్పాచక్రపాణిరెడ్డి రాజీనామాను ఆమోదించాలా వద్దా అన్న దానిపై అధికారపక్షం తర్జనభర్జన పడుతోంది. 

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాన్ని బట్టి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది.  నంద్యాలలో టీడీపీ ఓడిపోతే మాత్రం ఇక కొత్తగా ఎన్నికలకు వెళ్లకూడదన్న నిర్ణయానికి టీడీపీ నాయకత్వం రావొచ్చని అంటున్నారు.  పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ స్థానిక సంస్థల సభ్యులను భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేసి మరీ టీడీపీ గెలుపొందింది. ఇప్పుడు చక్రపాణిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తే మళ్లీ ఎన్నికలకువెళ్లి కోట్లు ఖర్చు పెట్టినా  చెడ్డపేరు తప్ప ఉపయోగం ఉండదన్నది బాబు ఆలోచన.

నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డి గెలిస్తే చక్రపాణిరెడ్డి రాజీనామాను కూడా తొక్కిపెట్టేలా వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం మండలికి చైర్మన్‌ లేరు. టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. చక్రపాణిరెడ్డి రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నిస్తే రెడ్డి సుబ్రమణ్యం తిరుపతిలో ఉన్నారంటూ టీడీపీ నేతలు కబుర్లు చెబుతున్నారు. ఒకవేళ నంద్యాలలో టీడీపీ గెలిస్తే మాత్రం శిల్పాచక్రపాణిరెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించేలా వ్యూహరచన చేస్తున్నారు. నంద్యాల ఫలితాన్ని బట్టే చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.