My title

నంద్యాలలో  బీటెక్‌ బ్యాచ్…. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న బుడ్డా

నంద్యాలలో టీడీపీ కొత్త రకం ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీటెక్ చదువుతున్న వంద మంది విద్యార్థులకు డబ్బులు ఇచ్చి నంద్యాలలో ఓటర్లను భయపెట్టేందుకు ప్రయోగించారు. ఇలా ఓటర్లను భయపెడుతున్న బీటెక్‌ బ్యాచ్‌ను వైసీపీ నేతలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వార్డుల్లో తిరుగుతున్న టీడీపీ సానుభూతిపరులైన బీటెక్ విద్యార్థులు… టీడీపీ నేతల నుంచి తీసుకున్న ఆధార్‌ నెంబర్, రేషన్‌ కార్డు నెంబర్‌ అన్ని చూపిస్తూ… మీ సమాచారం మొత్తం మా వద్ద ఉంది… టీడీపీకి ఓటేయకుంటే రేషన్ రాదు. .. పించన్‌ రాదు అంటూ బెదిరిస్తున్నారు. 

ముస్లిం కుటుంబాలను, నిరక్షరాస్యులను టార్గెట్‌గా చేసుకుని బీటెక్‌ బ్యాచ్‌ నంద్యాలలో చక్కర్లు కొడుతోంది. విషయం తెలుసుకున్న వైసీపీ నేత బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ నేతలు వెళ్లి బీటెక్‌ బ్యాచ్‌ను పట్టుకున్నారు. తొలుత సర్వే కోసం వచ్చామని విద్యార్థులు బుకాయించారు. ఏ సర్వే సంస్థ తరపున వచ్చారో ఐడీ కార్డు చూపించాల్సిందిగా వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో నీళ్లు నమిలారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన వృద్ధులు, మహిళలు… బీటెక్‌ విద్యార్థుల గుంపు తమ ఇంటికి వచ్చి బెదిరించిందని మీడియా ముందు చెప్పారు. చంద్రబాబు ఇంకా ఏడాదిన్నర పాటు అధికారంలో ఉంటారని… టీడీపీకి ఓటేయకుంటే రేషన్, పించన్ ఆగిపోతుందని తమతో చెప్పారని మహిళలు వివరించారు. వ్యవహారం పెద్దదవడంతో బీటెక్  బ్యాచ్‌… తాము చేసింది తప్పేనని, వదిలేయాలని విజ్ఞప్తి చేసింది. ఓటర్లను బెదిరిస్తున్న బీటెక్ బ్యాచ్‌ నుంచి పత్రాలను స్వాధీనం చేసుకున్న వైసీపీ నేతలు… అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.