My title

మా రక్తంలో లేదు… నీలా పిరికిపందను కాదు

విశాఖలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన లక్ష ఎకరాల భూ కుంభకోణం టీడీపీని బాగా ఇబ్బందిపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ బురదను ఇతరపార్టీల నేతలకు అంటించేందుకు టీడీపీ అనుకూల పత్రిక ఒకటి ప్రయత్నించడంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. బొత్స సోదరుడి పేరున ఐదు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయిందంటూ సదరు పత్రిక ప్రచురించడంపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడి దాక్కుంటాయని కానీ.. తాము కాదన్నారు. దమ్ముంటే ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.

తన కుటుంబసభ్యులుంటే వారిని శిక్షించాలని సవాల్ చేశారు. తాను సవాల్ చేస్తున్నానని దీనికి చంద్రబాబు సిద్ధపడాలన్నారు. తాను గానీ, తమ కుటుంబసభ్యులు గానీ ఒక్క సెంటు ప్రభుత్వ భూమిని తీసుకున్నట్టు నిరూపిస్తే వెంటనే రాజకీయాలను వదిలేస్తానని సవాల్ చేశారు. ఈ సవాల్‌కు చంద్రబాబు నిలబడి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే తానేమీ చంద్రబాబులా స్టేలు తెచ్చుకోబోనన్నారు. అలాంటి పిరికితనం తన రక్తంలోనే లేదన్నారు.

కుంభకోణంపై మాట్లాడేవారిని బెదరగొట్టేందుకు పత్రికలకు లీకులిస్తే భయపడుతారనుకోవడం భ్రమేనన్నారు. ఒకసారి ప్రజలు ఓటేసిన పాపానికి ఏకంగా ఊర్లకు ఊర్లు కబ్జా చేసేస్తారా అని బొత్స ప్రశ్నించారు. విశాఖలో ప్రభుత్వ, అటవీ, పేదల భూములను మొత్తం టీడీపీ నేతలు కబ్జా చేసేశారన్నారు. నారా లోకేష్ విశాఖకు వచ్చి నోవాటెల్‌ హోటల్‌లో కూర్చుని కలెక్టర్‌ను పిలిపించుకుని భూకుంభకోణంపై మాట్లాడవద్దని ఆదేశాలు ఇస్తుంటే ఇంకేమనాలన్నారు.   ఎన్నికల్లో డబ్బు సంచులు సరఫరా చేసే మంత్రులతో కలిసి నారా లోకేష్ కనుసన్నల్లోనే విశాఖ కబ్జా జరుగుతోందన్నారు బొత్స.